logo

ఆ బడి బస్సులు ఏమయ్యాయి..?

పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో జిల్లాలోని బడి బస్సులు రోడ్డెక్కాయి. ఈ నెల 13 నుంచి పాఠశాలలు తెరచుకున్నాయి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన యాజమాన్యాలు తమ బస్సులకు సామర్థ్య ధ్రువీకరణ(ఫిట్‌నెస్‌) పూర్తి చేయించుకున్న తర్వాతే నడపాల్సి ఉంటుంది.

Published : 20 Jun 2024 03:52 IST

ఫిట్‌నెస్‌ ధ్రువపత్రాలు పొందనివి బస్సులు 400పైనే..

బడి బస్సును తనిఖీ చేస్తున్న రవాణా శాఖ అధికారి

న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్‌ (కాకినాడ): పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో జిల్లాలోని బడి బస్సులు రోడ్డెక్కాయి. ఈ నెల 13 నుంచి పాఠశాలలు తెరచుకున్నాయి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన యాజమాన్యాలు తమ బస్సులకు సామర్థ్య ధ్రువీకరణ(ఫిట్‌నెస్‌) పూర్తి చేయించుకున్న తర్వాతే నడపాల్సి ఉంటుంది. కొన్ని పాఠశాలల యజమాన్యాలు తమ బస్సులకు ఫిట్‌నెస్‌ లేకుండా యథేచ్ఛగా రోడ్లపై తిప్పుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గడువు తేదీ దాటిపోయినా కొందరు తమ బస్సులకు సామర్థ్య ధ్రువీకరణ చేయించుకోకుండా నడుపుతున్నట్లు తెలుస్తోంది. 

వివరాల సేకరణలో అధికారులు..

2023-24 విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత కొన్ని బస్సులను గ్యారేజీలకే పరిమితం చేయడంతో వాటి సామర్ధ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలు విద్యాసంస్థలకు సంబంధించి బస్సుల ఫిట్‌నెస్‌ విషయంలో నిబంధనలను గాలికొదిలి ఇష్టారాజ్యంగా నడిపేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన బస్సులు  ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వీటి ఫిట్‌నెస్‌పై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కాకినాడ జిల్లా పరిధిలో 1529 బడి బస్సులు ఉంటే ఇంతవరకు 1094 బస్సులకు సామర్ధ్య పరీక్షలు పూర్తయ్యాయి. మిగిలినవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఏయే రూట్లలో తిరుగుతున్నాయి? ఏ కండీషన్‌లో ఉన్నాయనే దానిపై రవాణా శాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఒక్కో విద్యా సంస్థలో ఎన్నెన్ని బస్సులు ఉన్నాయి? ఎన్నింటికి ఎఫ్‌సీలు పూర్తయ్యాయి? రిపేర్ల పేరుతో పక్కన పెట్టినవి ఎన్ని తదితర వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఆ సమాచారం సేకరణ తర్వాత చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. గత విద్యా సంవత్సరంలో బడి బస్సులపై 55 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

15 ఏళ్లు దాటితే నడపకూడదు..

ఈ ఏడాది మే 16తోనే సామర్థ్య ధ్రువీకరణ పొందడానికి గడువు పూర్తయింది. ఆ తర్వాత  పాఠశాలలు తెరిచేలోగా రవాణాశాఖ నుంచి ఆయా పాఠశాలల యాజమాన్యాలు తమ బస్సులకు ధ్రువీకరణ తీసుకోవాలి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనా పలు పాఠశాలల యజమాన్యాలు బస్సులకు ఎఫ్‌సీలు చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. బస్సుల సామర్థ్యం సరిగా లేని వాటిని కొన్నింటిని తుక్కుగా మార్చేయడం, విక్రయించడం, కొన్ని పాఠశాలలు మూతపడటంతో ఆ బస్సులు తగ్గి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పిల్లలను బడి బస్సులు, ఆటోల్లో పంపించే తల్లిదండ్రులు అవి ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.

ఇవీ లోపాలు..

  • మెడికల్‌ కిట్లు లేకపోవడం, కొన్నింటికి అధిక శబ్దాలు రావడంతోపాటు సైలెన్సర్ల నుంచి పొగ అధికంగా వెలువడటం వంటివి జరుగతున్నాయి.
  • లైట్లు సరిగా వెలగకపోవడం, కొన్ని దెబ్బతినడం. మరికొన్నింటికి అద్దాలు పగిలిపోవడం. 
  • కొన్ని బస్సుల్లో సహాయకులు కనిపించడం లేదు.

నోటీసులు జారీ చేస్తున్నాం..

బడి బస్సుల్లో పిల్లల భద్రత విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉన్నాం. 15 ఏళ్లు దాటిన వాహనాలకు అనుమతి లేదు. బస్సుపై పాఠశాల పేరు, సంబంధిత ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాలి. ఫిట్‌నెస్‌ లేకుండా రోడ్డుపై బస్సులు తిప్పితే వెంటనే ఆ బస్సును సీజ్‌ చేస్తాం. ఇప్పటికే బృందాలను ఏర్పాటు చేశాం. విస్తృత తనిఖీలు చేపడుతున్నాం. ఎఫ్‌సీలు లేని బస్సుల వివరాలు సేకరిస్తున్నాం. ఆయా పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నాం.

-మురళీకృష్ణ, ఇన్‌ఛార్జి ఆర్టీవో, కాకినాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని