logo

అనుమానం పెనుభూతమై..

కాకినాడ గ్రామీణ మండలం వాకలపూడి పంచాయతీ పరిధిలోని ఫిషింగ్‌ హార్బర్‌లో ఇటీవల జరిగిన మహిళ దారుణ హత్యకు సంబంధించి భర్తే హంతకుడిగా నిర్ధారణ అయింది. అనుమానంతో కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి ఆ వివాహితను హత్య చేసినట్లు పోలీసులు కనుగొన్నారు.

Published : 20 Jun 2024 03:58 IST

హార్బర్‌పేట మహిళ హత్య కేసులో భర్తే హంతకుడు

నరసింహమూర్తిని అరెస్టు చేసి వివరాలు వెల్లడిస్తున్న సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌

సర్పవరం జంక్షన్, న్యూస్‌టుడే: కాకినాడ గ్రామీణ మండలం వాకలపూడి పంచాయతీ పరిధిలోని ఫిషింగ్‌ హార్బర్‌లో ఇటీవల జరిగిన మహిళ దారుణ హత్యకు సంబంధించి భర్తే హంతకుడిగా నిర్ధారణ అయింది. అనుమానంతో కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి ఆ వివాహితను హత్య చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ కేసుకు సంబంధించి సర్పవరం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌.. బుధవారం నిందితుడు ఓలేటి నరసింహమూర్తిని అరెస్టు చేసి స్థానిక పోలీసుస్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. ఫిషింగ్‌ హార్బర్‌లో నివసిస్తున్న ఓలేటి నరసింహమూర్తికి సుమారు ఎనిమిదేళ్ల క్రితం సీతతో వివాహమవగా వీరికి ఇద్దరు కుమారులు. నరసింహమూర్తి స్థానిక పోర్టులో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తుండగా, భార్య సీత వలసపాకలలోని రొయ్యలఫ్యాక్టరీలో రోజువారీ పనులు చేస్తూ పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. నరసింహమూర్తికి భార్యపై ఉన్న అనుమానంతో రెండు నెలల నుంచి వేధిస్తున్నాడు. దీంతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో పందెం కాసి డబ్బులు పోగొట్టుకుని.. భార్యను బంగారు వస్తువులు తాకట్టు పెట్టుకునేందుకు ఇవ్వాలని గొడవపడుతుండేవాడు. ఈనెల 16వతేదీ రాత్రి నిందితుడు.. మంచంపై పడుకుని ఉన్న తన భార్యను రాయితో బలంగా మోది హతమార్చాడు. బంగారు వస్తువుల కోసం ఎవరో హత్య చేసినట్లు నమ్మించాలని చూశాడు. అలా అత్తకు, పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్, అడిషనల్‌ ఎస్పీ ఎంజే భాస్కరరావు ఆదేశాల మేరకు.. డీఎస్పీ హనుమంతరావు తదితరులు చేసిన దర్యాప్తులో నిజాలు తెలిశాయి. భార్యను తానే హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో అతణ్ని అరెస్ట్‌ చేసి హత్యకు ఉపయోగించిన రాయిని, దొంగిలించిన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. నిందితుణ్ని స్పెషల్‌ మొబైల్‌ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని