logo

ప్రతి పుస్తకానికీ భద్రత

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలోని ప్రాచీన గ్రంథాలయంలో పుస్తకాల భద్రతకు ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌) సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చారు.

Published : 20 Jun 2024 04:00 IST

ఆర్ట్స్‌ కళాశాల గ్రంథాలయంలో ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌

తీసుకెళ్లిన పుస్తకాలు జారవిడిచేందుకు ఏర్పాటుచేసిన డ్రాప్‌ బాక్స్‌ 

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలోని ప్రాచీన గ్రంథాలయంలో పుస్తకాల భద్రతకు ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌) సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చారు. అనుమతి లేకుండా పుస్తకాలు తీసుకెళ్లేవారికి ఈ కొత్త సాంకేతిక విధానంతో చెక్‌ పెట్టనున్నారు. దీనికోసం గ్రంథాలయంలోని ప్రతీ పుస్తకాన్ని ఆర్‌ఎఫ్‌ఐడీ చేయనున్నారు.

న్యూస్‌టుడే, దేవీచౌక్‌ (రాజమహేంద్రవరం) : గ్రంథాలయంలో 16వ శతాబ్ద కాలం నుంచి నేటి వరకు సుమారు 1.10 లక్షలు పుస్తకాలున్నాయి. మొత్తం పుస్తకాలకు ఆర్‌ఎఫ్‌ఐడీ చేసేందుకు సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చవుతుంది. మొదట విడతగా రూ.20 లక్షలతో 50 వేల పుస్తకాలను కొత్త విధానంలోకి మార్చనున్నారు. ఇందుకోసం పుస్తకాలతోపాటు కళాశాల విద్యార్థులకూ ఆర్‌ఎఫ్‌ఐడీ కోడ్‌ ఇస్తారు. విద్యార్థులు ఎక్కువగా వినియోగించేవాటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే 30 వేల పుస్తకాలకు ఆర్‌ఎఫ్‌ఐడీ బార్‌కోడ్‌ ఏర్పాటుచేశారు.

ప్రత్యేక ఏర్పాట్లు

ఆర్‌ఎఫ్‌ఐడీ విధానాన్ని అమలు చేసేందుకు గ్రంథాలయంలో తగిన ఏర్పాట్లు చేశారు. ప్రవేశానికి, బయటకు వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటుచేశారు. గ్రంథాలయంలో ప్రవేశించే ప్రతీ విద్యార్థి వేలిముద్ర వేసి లోపలకు రావాలి. బయటకు వెళ్లేటప్పుడు అనుమతి లేకుండా ఎవరైనా పుస్తకం తీసుకెళితే ఒక రకమైన శబ్దం వస్తుంది. అనుమతితో తీసుకెళ్లే పుస్తకాల కోసం డ్రాప్‌ బాక్స్‌ ఉంటుంది. డ్రాప్‌బాక్స్‌లో వేసిన వాటికి రసీదు కూడా వస్తుంది. ఆర్‌ఎఫ్‌ఐడీలో భాగంగా ప్రతి పుస్తకం వెనక స్టిక్కర్‌ అంటిస్తారు. వీటిని సాఫ్ట్‌వేర్‌ ద్వారా గ్రంథాలయంలోని కంప్యూటర్‌కు అనుసంధానిస్తారు. దీంతో గ్రంథాలయంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని బయటకు వెళ్లాయి, ఎప్పుడు తీసుకెళ్లారు, ఎప్పడు తీసుకొచ్చారు.. అన్ని వివరాలు నమోదవుతాయి. ఒకవేళ  పుస్తకం తీసినచోట కాకుండా వేరేచోట పెట్టినా ఆర్‌ఎఫ్‌ఐడీ డివైజర్‌ పరిధిలో ఎక్కడ ఉన్నా బార్‌ కోడ్‌ స్కానర్‌ ద్వారా గుర్తించవచ్చు. ఎవరైనా పుస్తకానికి ఉన్న ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ను చింపివేస్తే రూ.100 జరిమానా విధిస్తారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు నూతనంగా ఏర్పాటుచేసిన ఈ విధానం ద్వారానే గ్రంథాలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని