logo

పేదలకు తీపి కబురు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పేదల సంక్షేమంపై దృష్టి సారించింది. మెగా డీఎస్సీ, పింఛన్ల పెంపు, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు, నైపుణ్య శిక్షణ తదితర అంశాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకాలు చేశారు.

Published : 20 Jun 2024 04:02 IST

జులై నుంచి కందిపప్పు, పంచదార

సీతానగరం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పేదల సంక్షేమంపై దృష్టి సారించింది. మెగా డీఎస్సీ, పింఛన్ల పెంపు, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు, నైపుణ్య శిక్షణ తదితర అంశాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకాలు చేశారు. తాజాగా పేదలకు నిత్యావసర సరకులు అందించేలా పౌరసరఫరాల శాఖ ప్రక్షాళనకు నడుం బిగించారు. వైకాపా ప్రభుత్వంలో అయిదేళ్లుగా తెల్ల రేషన్‌కార్డుదారులకు సరకులను తగ్గించుకుంటూ వచ్చారు. పాలన చివరి రెండేళ్లలో బియ్యం ఒక్కటే అందేది. అప్పుడప్పుడు అరకొరగా అరకేజీ చొప్పున పంచదార ఇచ్చినా.. అదీ కొద్దిమందికే. మిగిలిన సరకుల మాటే లేదు. కందిపప్పునకు దాదాపు మంగళం పాడేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.180కి పైనే ఉండగా పంచదార రూ.43 చొప్పున ఉంది. పెరుగుతున్న ధరలపై కొంతకాలంగా నియంత్రణ లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి కందిపప్పు, పంచదార సక్రమంగా అందించాలని కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2014-2019 మధ్యకాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా చౌక దుకాణాల ద్వారా బియ్యం, కందిపప్పు, వంటనూనె, పంచదార, బెల్లం, చింతపండు, గోధుమనూక తదితర సరకులను కార్డుదారులకు ఇచ్చేవారు. ఆయా సరకులను జులై 1 నుంచి పునరుద్ధరించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడు జిల్లాల్లోని కలిపి 50,06,194 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. వీరికి పూర్తిస్థాయిలో పంపిణీ చేసేందుకు అవసరమైన సరకులను సిద్ధంచేసేలా పౌర సరఫరాల అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. వచ్చే నెలలో పంపిణీ చేసేందుకు కందిపప్పు, పంచదార, బియ్యం ఇండెంట్‌ పెట్టామని పౌర సరఫరాల శాఖ డీఎస్‌వో విజయభాస్కర్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని