logo

అమ్మకు వేదన

నవమాసాలు బిడ్డను మోసి ప్రసవ వేదన భరించిన అమ్మకు ఆ తర్వాతా కష్టాలు తప్పడం లేదు. ఆరోగ్యశ్రీ పథకంలో నమోదుకు సంబంధించి డిశ్ఛార్జి సమయంలో బాలింతలకు వేలిముద్రలు వేయించుకుని వైద్యురాలితో ఫొటో తీసి ఆరోగ్యశ్రీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది.

Updated : 20 Jun 2024 04:47 IST

ఆరోగ్యశ్రీ ఫొటో కోసం బాలింతలకు యాతన

సరిపడా బల్లలు లేకపోవడంతో కింద కూర్చొని నిరీక్షిస్తున్న బాలింతలు

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం : నవమాసాలు బిడ్డను మోసి ప్రసవ వేదన భరించిన అమ్మకు ఆ తర్వాతా కష్టాలు తప్పడం లేదు. ఆరోగ్యశ్రీ పథకంలో నమోదుకు సంబంధించి డిశ్ఛార్జి సమయంలో బాలింతలకు వేలిముద్రలు వేయించుకుని వైద్యురాలితో ఫొటో తీసి ఆరోగ్యశ్రీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. ఈ సమయంలో వార్డు నుంచి బాలింతలు చిన్నారులతో ఆరోగ్యశ్రీ కార్యాలయం వద్దకు వచ్చి నిరీక్షించాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ ఫొటో కోసం వైద్యురాలు అందుబాటులో ఉండడం లేదు. సుమారు మూడు గంటలపాటు అక్కడే వేచి ఉంటున్నారు. కనీసం కూర్చోడానికి వీలు లేక ఫ్యాన్లు తిరగక నరకం చూస్తున్నారు. బల్లలు సరిపడాలేక బాలింతలమైనా సరే కింద కూర్చోవాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు ఆరోగ్యశ్రీ వేలిముద్రలు సైతం పడక సమస్యలు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. 

రోజూ ఇదే తీరు..

రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలోని మాతాశిశు విభాగంలో వంద పడకల సామర్థ్యం ఉంటుంది. నిత్యం 15కు పైగా ప్రసవాలు జరుగుతాయి. వాటితోపాటు రోజుకు వంద నుంచి 150 వరకు ఓపీ రోగులు వస్తుంటారు. ఓపీ రోగులు వేచి ఉండేందుకు, డిశ్ఛార్జి సమయంలో రోగులు ఆరోగ్యశ్రీ వేలిముద్రలు, ఫొటో కోసం వేచి ఉండే ప్రాంతమైన ఎంసీహెచ్‌ కింద అంతస్తులో ఫ్యాన్లు లేక ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కుర్చీలు, బల్లలు కూడా సరిపడా లేక కిందే కూర్చోవాల్సి వస్తోంది. డిశ్ఛార్జిలో ఆరోగ్యశ్రీ ఫొటో తీయించుకునేందుకు ఓపీలో ఉన్న వైద్యులు మూడేసి గంటలు తీసుకుంటుండడంతోనే సమస్య ఎదురై బాలింతలకు నిరీక్షణ తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కుక్కల బెడద

జీజీహెచ్‌లో కుక్కల బెడద వేధిస్తోంది. ఆవరణలో సంచరిస్తుండడంతోపాటు వార్డులు, ఓపీ గదులు, పరీక్షలు చేసే చోటా తిష్ఠవేసి రోగులను భయపెడుతున్నాయి. మధ్యాహ్న భోజన సమయంలో మరింత ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఉండే మాతాశిశు విభాగంలో వీటి బెడద మరింత ఎక్కువైంది. రోగులపై దాడి చేస్తాయేమోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని