logo

డైట్‌లో మౌలిక సదుపాయాల కరవు

బొమ్మూరు జిల్లా విద్యాశిక్షణ సంస్థ(డైట్‌)లో మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది తీరుపై ఛాత్రోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ప్రిన్సిపల్‌ జయశ్రీ వ్యవహార శైలితో ఇబ్బందులు పడుతున్నామని..

Published : 20 Jun 2024 04:09 IST

ఛాత్రోపాధ్యాయుల ఆందోళన

చెట్లతో నిండిపోయిన డైట్‌ ప్రాంగణం 

న్యూస్‌టుడే, బొమ్మూరు, ధవళేశ్వరం : బొమ్మూరు జిల్లా విద్యాశిక్షణ సంస్థ(డైట్‌)లో మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది తీరుపై ఛాత్రోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ప్రిన్సిపల్‌ జయశ్రీ వ్యవహార శైలితో ఇబ్బందులు పడుతున్నామని.. కళాశాల నిర్వహణ నిమిత్తం రూ.4,500 వసూలు చేస్తున్నా తమకు ఇచ్చిన రసీదులో పేర్కొన్న సౌకర్యాల్లో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదంటూ వాపోతున్నారు. ఛాత్రోపాధ్యాయుల్లో గర్భిణులకు సెలవు మంజూరు చేయడం లేదని, ప్రసూతి సెలవుపై వెళ్లిన వారు 15 రోజుల్లో  తిరిగి రావాలని ఆక్షంలు విధిస్తున్నారన్నారు. వసతిగృహాల్లో శుభ్రం చేసేందుకు చీపుర్లు కూడా ఉండటం లేదన్నారు. బాలురు, బాలికల వసతి గœృహాల్లో వార్డెన్లు, నైట్‌ వాచ్‌మెన్లు లేకపోవడంతో రాత్రిపూట  భయాందోళన చెందుతున్నామన్నారు. డైట్‌ ప్రాంగణం పనికిరాని మొక్కలు, పెద్దపెద్ద చెట్లు పెరిగిపోవడంతో విషసర్పాలు, తేళ్లు, పందులు నిత్యం సంచరించడంతో భయభ్రాంతులకు గురవుతున్నామన్నారు. సాయంత్రం 6 గంటలు దాటితో బయటకు రాలేని పరిస్థితి నెలకొందన్నారు.

అపరాధ రుసుములతో సతమతం

ఒక్కరోజు సెలవు పెట్టినా రూ.500 అపరాధ రుసుము వసూలు చేస్తున్నారు. నిమిషం ఆలస్యమైన తరగతి బయటే గంటల తరబడి నిలబెడుతున్నారు. ప్రతిచిన్న విషయానికి ఫైన్లు వసూలు చేస్తున్నారు. ఆలస్యంగా వచ్చినా.. ఒకరోజు రాకపోయినా ఇదే పరిస్థితి. ఆవరణలో పనికిరాని మొక్కలు తొలగించమనడంతో మాకు చదువుకోవడానికి సమయం సరిపోవడంలేదు. సెలవుల అనంతరం దూరప్రాంతాల నుంచి వచ్చేవారు రవాణా సౌకర్యం లేక ఆలస్యం అవుతుందని చెప్పినా అపరాధ రుసుము కట్టమంటున్నారు.     

- జె.ప్రభాస్‌

ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా..

ఇక్కడ ప్రస్తుతం 70 మంది వరకు శిక్షణ పొందుతున్నాం. అందరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఫైన్లతో పాటు నెలవారీ మెస్‌ ఛార్జీలు రూ.2 వేల వరకు చెల్లించడం వల్ల మరింత భారంగా మారింది. ప్రిన్సిపల్‌ ప్రతి విషయంలోనూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో మానసిక ఆందోళన చెందుతున్నాం. ప్రతిరోజు ఫైన్ల భయంతోనే కళాశాలకు వెళుతున్నాం. 

వై.శ్రీనివాస్‌

క్రమశిక్షణతో ఉండమన్నందుకే ఆరోపణలు

నేను వచ్చి మూడు నెలలైంది. క్రమశిక్షణËతో మెలగమన్నందుకే నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఛాత్రోపాధ్యాయులు చెల్లించే రుసుముతోనే మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయి. యువత తప్పుదోవ పట్టకుండా చేపడుతున్న క్రమశిక్షణ చర్యలు వారికి నచ్చడం లేదు. కళాశాల సిబ్బంది నాపై తప్పుడు ఆరోపణలు చేయుస్తున్నారు. 

- జయశ్రీ, డైట్‌ ప్రిన్సిపల్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని