logo

రైతు కష్టానికి మద్దతు దక్కేనా!

ఏటా పెరుగుతున్న సాగు పెట్టుబడులకు అనుగుణంగా పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కరవవుతున్న నేపథ్యంలో రైతులు ఇక్కట్లు చవిచూస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్‌ సీజన్‌ (2024-25) నుంచి అమలయ్యే విధంగా వరికి రూ.117 కనీస మద్దతు ధర ప్రకటించింది.

Published : 20 Jun 2024 04:14 IST

వరికి క్వింటాలుకు రూ.117 పెంచుతూ కేంద్రం నిర్ణయం

ముమ్మిడివరం: ఏటా పెరుగుతున్న సాగు పెట్టుబడులకు అనుగుణంగా పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కరవవుతున్న నేపథ్యంలో రైతులు ఇక్కట్లు చవిచూస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్‌ సీజన్‌ (2024-25) నుంచి అమలయ్యే విధంగా వరికి రూ.117 కనీస మద్దతు ధర ప్రకటించింది. పంటకు అయ్యే ఖర్చుపై 50 శాతం అదనపు ధర కల్పిస్తామని.. వరి సాధారణ రకం క్వింటాలుకు రూ.2300 కల్పిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.  

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2.23 లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 11 లక్షలు, రబీలో 14.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది. కేంద్రం 2018-19లో క్వింటాలుకు రూ.200 మద్దతు ధర పెంచగా.. 2023-24లో రూ.143 పెంచింది. మిగిలిన సంవత్సరాల్లో రూ.60 నుంచి రూ.100కు మించలేదు. 

అమలులో చిత్తశుద్ధి కరవు..

కేంద్ర ప్రభుత్వం వరికి ఏటా కొంత మద్దతు ధర ప్రకటిస్తున్నా.. పంట చేతికొచ్చాక రైతులకు అది లభించడం లేదు. ఆర్‌బీకేల్లో మద్దతు ధరకే ధాన్యం కొనుగోలని ప్రకటిస్తున్నా..ఆ పరిస్థితి లేదు. బస్తాకు (75 కిలోలు) రూ.200 నుంచి రూ.250 వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. రబీ సీజన్‌లో కోనసీమ జిల్లాలో 7.74 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే.. ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు లక్ష్యం 2.26 లక్షల మెట్రిక్‌ టన్నులుగా నిర్ధారించారు. ఇప్పటికి 1.62 లక్షల మెట్రిక్‌ టన్నులే కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఎంటీయూ 3626 రకం ధాన్యానికి బహిరంగ మార్కెట్‌లో కొంత మెరుగైన ధర పలకగా.. రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నారు.చిత్తశుద్ధి పాటించి మద్ధతు ధర కల్పిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.

పెరుగుతున్న ఎరువుల ధరలు

సాగులో రైతులు వినియోగించే కాంప్లెక్స్‌ ఎరువులు, పురుగుమందులు ధరలు ఏటా 30 శాతం మేర పెరిగిపోతున్నాయి. గతంలో రూ.1300 ఉండే కాంప్లెక్స్‌ బస్తా ధర గరిష్ఠంగా 
రూ.1900కు చేరింది. ఇక పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం వేస్తున్న లెక్కలకు.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు భారీ వ్యత్యాసం ఉంది. క్వింటాలు ధాన్యం పండించడానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం రూ.1460 లెక్క వేస్తుండగా.. క్షేత్ర స్థాయిలో అది రూ.1900-రూ.2000కు చేరుతుంది. కౌలు రైతులు ఎకరాకు రూ.10 వేల వరకు  నష్టపోవాల్సి వస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని