logo

అయిదేళ్లూ.. అడిగేవారు లేక!

మట్టి, ఇసుక రుచి మరిగారు.. అడ్డదారిన వచ్చిపడే కాసులకు కక్కుర్తిపడ్డారు. మీకు కొంత.. మాకు కొండంత అన్నట్లు వైకాపా ప్రభుత్వ హయాంలో అయిదేళ్లూ వ్యవహారం సాగింది. కొండలు కోనలు కొల్లగొట్టారు.

Updated : 20 Jun 2024 04:46 IST

కూటమి సర్కారు నిర్ణయంతో గనుల విధ్వంసానికి అడ్డుకట్ట
తాత్కాలికంగా స్తంభించిన సీనరేజి వసూళ్లు 
ఇరకాటంలో అక్రమార్కులు

తవ్వకాలతో కరిగిపోయిన పెద్దాపురం-గండేపల్లి పరిధిలోని రామేశ్వరంపేట మెట్ట  

మట్టి, ఇసుక రుచి మరిగారు.. అడ్డదారిన వచ్చిపడే కాసులకు కక్కుర్తిపడ్డారు. మీకు కొంత.. మాకు కొండంత అన్నట్లు వైకాపా ప్రభుత్వ హయాంలో అయిదేళ్లూ వ్యవహారం సాగింది. కొండలు కోనలు కొల్లగొట్టారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోకి యంత్రాలను దింపి నిల్వలను తోడేశారు. రాజకీయ ఒత్తిళ్లకు బెదిరి భూగర్భ గనులశాఖ, కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ, పోలీసు ఇలా ఎవ్వరూ కిమ్మనలేదు. అధికారం మారింది.. గత అక్రమాలపై కొత్త ప్రభుత్వం దృష్టిసారించింది. విచ్చలవిడి గనుల తవ్వకాలకు చెక్‌పెట్టేలా కసరత్తు చేస్తోంది. దీంతో అధికారికంగా పర్మిట్లున్నా ప్రభుత్వం పచ్చజెండా ఊపేవరకు తవ్వకాలు జరపవద్దని భూగర్భ గనుల శాఖ నుంచి హెచ్చరికలు రావడంతో పొక్లెయిన్లు, వాహనాల రణగొణధ్వనులు కొద్దిరోజులుగా ఆగాయి. పర్యావరణానికి హితం చేకూరేలా నిర్ణయాలు ఉంటాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

ఈనాడు, కాకినాడ: గత అయిదేళ్లు విచ్చలవిడిగా సాగిన గనుల తవ్వకాలకు కూటమి ప్రభుత్వం బ్రేకులు వేసింది. శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు అనుమతులు పొందిన ప్రైవేటు సంస్థతోపాటు.. ఉమ్మడి జిల్లాలో చిన్నతరహా ఖనిజాల సీనరేజి వసూలు చేస్తున్న సంస్థ సైతం కార్యకలాపాలు నిలపాల్సి వచ్చింది. ఇన్నాళ్లూ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు పెత్తనం అప్పగించడంతో తవ్వకాలు- తరలింపు ఇష్టారీతిన సాగేది. రైతులు తమ పొల్లాలో మెరక తొలగించినా ప్రైవేటు సైన్యం వెళ్లి డబ్బులు వసూలుచేసేది. భూగర్భ గనుల శాఖ కు పట్టేదికాదు. ఇప్పుడు గత్యంతరంలేక అనుమతులు (పర్మిట్లు) ఉన్నా ప్రభుత్వ నిర్ణయం వెలువడే వరకు ఆపాల్సిందేనని హుకుం జారీచేయడంతో తవ్వకాలు స్తంభించాయి.

ఉమ్మడి జిల్లాలో లేటరైట్‌ తవ్వకాలకు ఆన్‌లైన్‌ పర్మిట్‌ ప్రభుత్వమే ఇస్తుంటే..ఇసుక తవ్వకాలు 2021 మే నుంచి 2023 డిసెంబర్‌ వరకు జేపీ పవర్‌ సంస్థ జరిపేది. ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు 2023 డిసెంబËర్‌ 11 నుంచి తవ్వుకునే అవకాశమిచ్చారు. ప్యాకేజీ 1 కింద శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి జిల్లా వరకు ఏడాదిపాటు అనుమతులిచ్చారు. ఉల్లంఘనలు వివాదాస్పదం అవడంతో న్యాయస్థానం జోక్యం చేసుకుని కలెక్టర్ల నుంచి నివేదికలు కోరే పరిస్థితి ఎదురయ్యింది. ఉమ్మడిజిల్లాలో లేటరైట్, ఇసుక మినహా మిగిలిన చిన్నతరహా ఖనిజాల సీనరేజ్‌ రెండేళ్లపాటు వసూలుకు రూ.233 కోట్లకు సుధాకర ఇన్‌ఫ్రాటెక్‌కు వైకాపా ప్రభుత్వం ఇచ్చింది. 2023 ఏప్రిల్‌ 18 నుంచి ఈ సంస్థ సీనరేజి వసూలు చేస్తోంది. కొత్త సర్కారు ఎటువంటి విధానం తెస్తుందనేది తేలాల్సి ఉంది. 

ఇసుకలో ఎన్నెన్ని లొసుగులో..

వైకాపా ప్రభుత్వ హయాంలో గోదావరిలో ఇసుక తవ్వకాలు పర్యావరణానికి తూట్లు పొడిచేలా సాగాయి. సాక్షాత్తూ కలెక్టర్లు, ఎస్పీలే ఇక్కడ ఎలాంటి అక్రమాలు జరగడంలేదన్నట్లు వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. గతంలో ఉమ్మడి జిల్లాలో మూడు డీసిల్టేషన్‌ పాయింట్లు.. 38 ఓపెన్‌ రీచులు ఉండేవి. 17 ఇసుక డిపోల ద్వారా నిల్వలు అందేవి. వైకాపా వచ్చాక ప్రైవేటు సంస్థలకు బాధ్యతలు అప్పగించేసింది. కాతేరు, బ్రిడ్జిలంక, కేతవానిపాలెంలలో డీ సిల్టేషన్‌ పాయింట్లు.. గోదావరిలో ఇసుక తీసి తరలించడానికి కాతేరు, పిడింగొయ్యి, రాజమహేంద్రవరం, వెంకటనగరం గ్రామాల్లో బోట్స్‌మెన్‌ సొసైటీలకు గతంలో అనుమతులు ఇచ్చారు. ఓపెన్‌ రీచ్‌లు కపిలేశ్వరపురం, తాతపూడి, ఆలమూరులలో ఉండేవి. రాజానగరం, రాజమహేంద్రవరం గ్రామీణం, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల పరిధిలో ఓపెన్‌ ఇసుక రీచుల్లో గత కొన్నాళ్లుగా అడ్డగోలుగా యంత్రాలతో తవ్వుతున్నా కనీస చర్యలు లేవు. బోట్స్‌మెన్‌ సొసైటీ ముసుగులో భారీ ఎత్తున డ్రెడ్జింగ్‌ సాగింది. ధవళేశ్వరం బ్యారేజి, రోడ్‌ కం రైల్‌ బ్రిడ్జి, గామన్‌ వంతెనల మనుగడ ప్రమాదంలో పడింది.

కొండలు కొల్లగొట్టి.. మట్టిని దోచి..

పెద్దాపురం- గండేపల్లి మండలాల పరిధిలోని 823 ఎకరాల్లో కొండలు, గుట్టలు ఉండేవి. రామేశ్వరంపేట మెట్ట (గుళ్లమెట్ట)గా పిలుస్తారు. 1987లో ఎన్టీఆర్‌ ..దళిత రైతులకు ఈ కొండ భూమిలో పట్టాలిచ్చారు. ఇక్కడి మట్టి నిల్వలపై కన్నేసిన కొందరు అక్రమార్కులు తక్కువ ధరకే డి-ఫారం పట్టా, అసైన్డ్‌ భూములు దక్కించుకుని తవ్వకాలకు తెరలేపారు. వైకాపా ప్రభుత్వం పేదలకు ఇళ్లు కార్యక్రమంలో భాగంగా లేఔట్ల మెరక పనులకు కొంత మట్టిని తరలిస్తే.. ఆ ముసుగులో కొండనే ఖాళీచేసేశారు. 500 ఎకరాల్లో అక్రమ తవ్వకాలు- మట్టి నిల్వల తరలింపు వెనుక వైకాపా బడా నేతలే ఉన్నా భూగర్భ గనుల శాఖ కన్నెత్తి చూడలేదు. పూర్వ కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి మట్టి తవ్వకాల కట్టడికి ఈ ప్రాంతాలో మొక్కలు స్వయంగా నాటితే, వాటిని కొందరు తొలగించారు. ఈ కొండతో పాటు మండపేట, అనపర్తి, జగ్గంపేట, రాజానగరం తదితర ప్రాంతాల్లో అక్రమ తవ్వకాల నిగ్గు తేలాల్సి ఉంది.

అప్పుడలా.. ఇప్పుడిలా..

ఉమ్మడి జిల్లాలో పెద్ద తరహా, చిన్నతరహా ఖనిజాలనుంచి వసూలయ్యే సుంకం..అపరాధ రుసుములు, ఇతర శాఖల నుంచి జమ కావల్సిన సొమ్ము, దరఖాస్తులు, సర్వే రుసుములు, ఇతరత్రా ఖనిజ ఆదాయం తెదేపా ప్రభుత్వ హయాంలో ఏటా రూ.500 కోట్లు దాటేది.. 2017- 18లో రూ.567.86 కోట్లు, 2018- 19లో రూ. 520.63 కోట్లు వసూలవగా వైకాపా వచ్చాక 2020- 21లో రూ.173.03 కోట్లకు పడిపోయింది. నాయకులు, ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి అధికంగా చేకూరింది. 

తవ్వకాలు ఆపేశాం..

గనుల తవ్వకాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. పర్మిట్లు ఉన్న యాజమాన్యాన్ని కూడా తవ్వకాలు జరపవద్దని ఆదేశించాం. ఇసుక తవ్వకాలు చేస్తున్న, సీనరేజి వసూలు చేస్తున్న ప్రైవేటు సంస్థలను కొనసాగిస్తారా..? కొత్త వారికి బాధ్యత అప్పగిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. గనుల శాఖ సమీక్ష తర్వాత స్పష్టత వస్తుంది. 

- ఈ.నరసింహారెడ్డి, భూగర్భ గనుల శాఖ అధికారి,కాకినాడ జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని