logo

ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పు

వైకాపా అయిదేళ్ల పాలనలో ఆహార భద్రత చట్టానికి తూట్లు పొడించారు. చౌక దుకాణాల వ్యవస్థను పక్కన పెట్టి  ఇంటింటికీ రేషన్‌ పేరుతో మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్ల(ఎండీయూ)ను రంగంలోకి దించారు

Updated : 21 Jun 2024 06:59 IST

చౌక దుకాణాల వద్దే బట్వాడాకు  అవకాశం
రేషన్‌ వాహనాల వ్యవస్థ రద్దుకు సన్నాహాలు
స్టాక్‌ పాయింట్ల నుంచి సరకు రవాణా నిలిపివేత

కాకినాడ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద సరకులు(పాత చిత్రం)

న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌ : వైకాపా అయిదేళ్ల పాలనలో ఆహార భద్రత చట్టానికి తూట్లు పొడించారు. చౌక దుకాణాల వ్యవస్థను పక్కన పెట్టి  ఇంటింటికీ రేషన్‌ పేరుతో మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్ల(ఎండీయూ)ను రంగంలోకి దించారు. రేషన్‌ డీలర్ల పొట్ట కొట్టి.. వైకాపా కార్యకర్తలకు ఎండీయూ వాహనాలను కట్టబెట్టారు. గత తెదేపా హయాంలో ప్రతినెలా చౌక ధరల దుకాణాల వద్ద లబ్ధిదారులకు 95 శాతం రేషన్‌ సరకులు పంపిణీ చేయగా.. ఎండీయూ వ్యవస్థ వచ్చాక ఇది 90 శాతానికి పడిపోయింది. కాకినాడ జిల్లాలో ప్రతినెలా సుమారు 60వేల కార్డుదారులకు సరకులు అందడం లేదు.  వైకాపా కార్యకర్తలైన ఎండీయూ ఆపరేటర్లు ఇష్టారీతిన వ్యవహరించడంతో కొంత మంది పేదలకు నోటికాడ కూడు దూరమైంది. ప్రతినెలా 1 నుంచి 17 వరకే ఈ వాహనాల ద్వారా సరకులు ఇచ్చేవారు. దీంతో చాలా మందికి సరకులు దక్కలేదు. చౌక దుకాణాల వద్ద నెలంతా పంపిణీ చేసేవారు. 

మార్పులకు  శ్రీకారం..

కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రజాధనాన్ని వృథా చేసి రేషన్‌ వాహనాలను వైకాపా కార్యకర్తలకు కట్టబెట్టిన వైనంపై సీఎం చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారు. ఎంండీయూ వ్యవస్థను రద్దు చేసి, ఆహార భద్రత చట్టం మార్గదర్శకాల ప్రకారం చౌక దుకాణాల వద్దే సరకులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. గత వైకాపా హయాంలో కేవలం బియ్యం, పంచదార, గోధుమ పిండి ఇచ్చి చేతులు దులుపేసుకున్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం వీటితో పాటు వంటనూనె, కందిపప్పు రాయితీ ధరలకు పేదలకు పంపిణీ చేయాలని యోచిస్తోంది. దీంతో ఈ నెలలో ఇప్పటి వరకు జిల్లాలోని ఏడు ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి సరకులు చౌక దుకాణాలకు చేరలేదు. ప్రస్తుతం సరకు రవాణాను నిలిపివేశారు.

అంతా  వారిష్టం..!

  •  ఎండీయూ ఆపరేటర్లు వాహనం ద్వారా సరకులు పంపిణీ చేయకపోయినా అధికారులు ఏమీ చేయలేని దుస్థితి. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు కావడంతో మిన్నుకుండిపోయేవారు.
  •  కొందరు ఆపరేటర్లు వాహనాన్ని ఒక వీధిలో నిలిపి, ఈ-పోస్‌ యంత్రంలో వేలిముద్ర వేసి వెళ్లిపోయేవారు. తర్వాత వేరే వ్యక్తి సరకులు పంపిణీ చేసేవారు. అధికారులకు ఇదంతా తెలిసినా ఏమీ చేయలేని దుస్థితి.
  •  కాకినాడ అర్బన్‌లో కొందరు ఆపరేటర్లు సరకు పంపిణీ చేయగా వచ్చిన సొమ్మును సదరు డీలరుకు జమ చేయకుండా నొక్కేసేవారు. ఇలాంటి వారిపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
  •  ఈ ఎన్నికల్లో  ఎక్కువ మంది ఆపరేటర్లు వైకాపాకు అనుకూలంగా పనిచేశారు. వైకాపాను గెలిపించడానికి సర్వశక్తులొడ్డారు. ఎన్నికల్లో వైకాపా తరఫున ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయిన కాకినాడకు చెందిన ఒక ఆపరేటర్‌ను సంయుక్త కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు.

ఆదేశాలు రాగానే  సరకు రవాణా..

ప్రతినెలా 18 నుంచి 30వ తేదీలోగా అన్ని చౌక దుకాణాలకు రేషన్‌ సరకుల సరఫరా జరుగుతోంది. జులై నెలకు సంబంధించి ఇంకా సరకు రవాణా ప్రారంభించలేదు. బియ్యం, పంచదార సిద్ధంగా ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే చౌక దుకాణాలకు సరకులు చేరవేస్తాం. జులైలో కార్డుదారులందరికీ సరకులు అందేలా ఏర్పాట్లు చేస్తాం.
-ఎం.బాలసరస్వతి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు, కాకినాడ


రూ.30 కోట్ల  ప్రజాధనం వృధా..?

కాకినాడ జిల్లాలో 420 ఎండీయూ వాహనాలు ఉన్నాయి. ఒక్కో వాహనాన్ని రూ.7 లక్షలకు కొనుగోలు చేశారు. దీంలో కొంత ఆపరేటర్‌ వాటా కాగా, మిగతాది బ్యాంకు ద్వారా రుణం ఇప్పించారు. ప్రతినెలా ఒక్కో ఆపరేటర్‌కు రూ.21వేలు చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. ఈ వాహనాలకు రూ.30 కోట్లు వెచ్చించారు. ఇంటింటికి రేషన్‌ పేరుతో వీధుల్లో వాహనాలు నిలిపి మాత్రమే సరకులు ఇచ్చేవారు. ప్రతి ఇంటికి ఈ వాహనాలు వెళ్లిన దాఖలాలు జిల్లాలో ఎక్కడా లేవు. ఎండీయూ ఆపరేటర్‌కు ప్రతినెలా వేతనం ఇవ్వడంతో పాటు రేషన్‌ డీలర్‌కు కమీషన్‌ చెల్లించేవారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి సరకులు చౌక దుకాణానికి చేరగా, అక్కడి నుంచి ఆపరేటర్లు వాహనాల్లో సరకు నింపుకొని వెళ్లి పంపిణీ చేసేవారు. ఈ విధానం పూర్తిగా విఫలమైంది. ప్రజాధనం మాత్రం వృథా చేశారు. దీనికి తోడు ప్రతినెలా జిల్లాలో వేల మంది పేదలకు సరకులు అందకుండా చేశారు.


ఇదీ స్వరూపం..
జిల్లాలో కార్డులు   6,54,592
కార్డులో సభ్యులు   14,77,407
చౌక దుకాణాలు   1,060
ఎండీయూ వాహనాలు  420
మండలాలు   21

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని