logo

ప్రగతి చూపుతాం.. కొత్త శాసనసభ్యుల మనోగతం

అయిదేళ్ల వైకాపా పాలనలో పూడ్చలేని విధ్వంసం జరిగింది.. ఎటుచూసినా అధ్వాన రహదారులు.. సాగు- తాగునీటి సమస్యలే.. కీలక శాఖలు గాడితప్పాయి. అభివృద్ధి పనుల ఉనికే లేదు

Updated : 21 Jun 2024 07:01 IST

 నేడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్, కాకినాడ నగరం, తుని పట్టణం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం:  అయిదేళ్ల వైకాపా పాలనలో పూడ్చలేని విధ్వంసం జరిగింది.. ఎటుచూసినా అధ్వాన రహదారులు.. సాగు- తాగునీటి సమస్యలే.. కీలక శాఖలు గాడితప్పాయి. అభివృద్ధి పనుల ఉనికే లేదు. ఆపన్న హస్తం కోసం అభాగ్యులు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులన్నీ చక్కదిద్దాల్సిన గురుతర బాధ్యత కొత్తగా కొలువుదీరిన కూటమి నేతలపై ఉంది.. వైకాపా నిరంకుశ పాలనకు విసిగి వేసారిన తూర్పు ప్రజలు.. ఉమ్మడి జిల్లాలో ఒక్కస్థానంలోనూ ఆ పార్టీ నేతలను గెలిపించలేదు. 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూటమికే పట్టం కట్టారు. అసెంబ్లీ సమావేశాలు ఈనెల 21 నుంచి నిర్వహించనున్నారు. తొలిరోజు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలో కొందరు తొలిసారిగా అడుగుపెట్టనున్నారు.. ఇంకొందరు పూర్వ అనుభవం ఉన్నవారు. ఈ నేపథ్యంలో మన శాసనసభ్యుల ప్రాధామ్యాలేమిటి..? నియోజకవర్గాల సర్వతోముఖాభివృద్ధికి చేపట్టనున్న చర్యలేమిటో.. వారి మాటల్లోనే..  


నియోజకవర్గ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

తుని నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలుచేస్తా.

 • డ్రైనేజీ పైపులైన్లు ఆధునికీకరిస్తాం.
 •  మహిళల కోసం నర్సింగ్‌ కళాశాల నిర్మాణం చేపడతాం.
 • దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు పూర్తిచేయిస్తాను.
 • తొండంగి మండలంలో కర్మాగారాల ఏర్పాటుతో సెజ్‌ భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తాం.
 • కోటనందూరులో పాడైన నీటి పారుదల మార్గాలను (గ్రోయిన్లు) బాగుచేయించేందుకు చర్యలు చేపడతాను.
 • సూపర్‌ సిక్స్‌ ద్వారా పేదలకు అన్ని సంక్షేమ పథకాలు చేరువ చేస్తాం.

-యనమల దివ్య, తుని ఎమ్మెల్యే


స్వచ్ఛమైన జలాలు అందించేలా కృషి


మెట్ట ప్రాంతానికి ప్రధాన ఆధారమైన పుష్కర ఎత్తిపోతల పథకంలో గండేపల్లి మండలం తాళ్లూరు వద్ద ఏర్పాటు చేసిన పంపు హౌస్‌ మూడేళ్లుగా మరమ్మతుల్లో ఉంది. సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లా. నీటిపారుదల శాఖ అధికారులతోనూ సమీక్షించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. రూ.49 కోట్లు అవసరం. పంపుహౌస్‌ తాత్కాలిక నిర్వహణకు నిధులు మంజూరు చేయించేలా శాసనసభలో ప్రస్తావిస్తా.

 • భావవరం వద్ద ఏర్పాటు చేసిన సీపీడబ్ల్యూఎస్‌ పథకం ద్వారా జగ్గంపేట, గండేపల్లి మండలాలకు శుద్ధజలం సరఫరా అవుతోంది. నిర్వహణ లేకపోవడంతో గాడి తప్పింది. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటి జలాలు విడుదలకు కృషి చేస్తా.
 •  జగ్గంపేటలో ప్రాంతీయ ఆసుపత్రి నిర్మాణానికి, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే తపన ఉంది. గోకవరం, కిర్లంపూడి మండలాలకు డిగ్రీ కళాశాలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తా.
 • మెట్ట ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా.

-జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట

మరమ్మతుల్లో ఉన్న తాళ్లూరు పంపు హౌస్‌ 


ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన

అత్యధిక మెజారిటీతో గెలిపించిన కాకినాడ నగర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తా. పెన్షనర్స్‌ ప్యారడైజ్‌గా పేరుగాంచిన కాకినాడలో అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా జీవించేలా చర్యలు తీసుకుంటాం.

 •  ప్రధానంగా శాంతిభద్రతలు గాడి తప్పకుండా చూస్తాం. నగరంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతాం.
 •  నిలిచిపోయిన స్మార్ట్‌ సిటీ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తాం.
 •  కమాండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ పునరుద్దరణకు చర్యలు తీసుకుంటాం.
 •  అసంపూర్తిగా ఆగిపోయిన టిడ్కో ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తా. సామాజిక భవన నిర్మాణాలకు కృషి చేస్తా.  మహిళల స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తాం. 

 - వనమాడి కొండబాబు, కాకినాడ నగరం


రహదారులు.. వైద్యం.. తాగునీటి కల్పన

నియోజకవర్గంలో ఉన్న సాగునీటి వనరులను సద్వినియోగపరచడం ద్వారా రైతులకు మేలు చేస్తాం. ఇందుకు ప్రాజెక్టుల వారీ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషిచేస్తా.

 •  రహదారులు, వైద్యం, తాగునీరు తదితర మౌలిక అవసరాలు నెరవేర్చడం ద్వారా గ్రామాల సమగ్రాభివృద్ధికి చర్యలు చేపడతాను.
 •  ఉపప్రణాళిక మన్యంలోని ప్రజల జీవనప్రమాణాలు పెరిగేలా తగిన చర్యలు తీసుకుంటాం.
 •  యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన వనరులపై దృష్టి సారిస్తాను. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వచ్చేలా చూస్తా.

- వరుపుల సత్యప్రభ, ప్రత్తిపాడు


అన్ని గ్రామాలకు సురక్షిత తాగునీరు

కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నాం.

 • అన్ని గ్రామాలకు సురక్షిత తాగునీరు అందిస్తాం. దారుణంగా దెబ్బతిన్న రహదారులను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తాం. మురుగు పారుదల వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపడతాం. శివారు ఎకరాకూ సాగునీరు అందించడమే లక్ష్యం.
 •  ఎన్టీఆర్‌ బీచ్‌ను పూర్తిస్థాయిలో మెరుగుపరుస్తాం. స్పోర్ట్సు స్టేడియాన్ని ఐపీఎల్‌ స్థాయి మ్యాచ్‌ల నిర్వహణకు అనుకూలంగా తీర్చిదిద్దుతాం. క్రీడాకారులు, వాకర్స్‌కు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
 • ప్రజలకు జీజీహెచ్‌లో నాణ్యమైన వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తాం. నియోజకవర్గం నుంచి వెళ్లే రోగులకు సహాయం చేసేందుకు ఓ వ్యక్తిని నియమిస్తాం.  

   -పంతం నానాజీ, కాకినాడ గ్రామీణం


అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా..

నాపై ఎంతో నమ్మకంతో మూడోసారి అత్యధిక మెజార్టీతో పెద్దాపురం నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తాను.

ప్రభుత్వం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలోని గ్రామీణ, పురపాలక సంఘాల్లో రహదారులు, మురుగు నీటి కాలువలు, తాగునీటి వసతి వంటి సదుపాయాలు కల్పనకై పాటుపడతాను. ముఖ్యంగా ఏలేరు ఆధునికీకరణపై దృష్టిసారించి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాను. విద్య, వైద్యం ఈ రెండు రంగాలను మరింత బలోపేతం చేయడానికి శాయశక్తుల కృషి చేస్తాను. అభివృద్ధి విషయంలో అన్ని ప్రభుత్వశాఖల అధికారులు సహకరించాలి. అభివృద్ధితో పాటుగా సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడతాను.
- నిమ్మకాయల చినరాజప్ప, పెద్దాపురం  నియోజకవర్గం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు