logo

పీహెచ్‌సీల్లో ప్రసవాలు అరకొరే..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పలుచోట్ల సాధారణ ప్రసవాలు సైతం చేయడంలేదు. వాటిని రిఫరల్‌ కేసులుగా మార్చేస్తున్నారు. నెలకు కనీసం అయిదు ప్రసవాలైనా చేయాలనేది ఉన్నతాధికారుల ఆదేశాలు.

Published : 21 Jun 2024 06:38 IST

ధవళేశ్వరం పీహెచ్‌సీలో ప్రసూతి వార్డు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పలుచోట్ల సాధారణ ప్రసవాలు సైతం చేయడంలేదు. వాటిని రిఫరల్‌ కేసులుగా మార్చేస్తున్నారు. నెలకు కనీసం అయిదు ప్రసవాలైనా చేయాలనేది ఉన్నతాధికారుల ఆదేశాలు. కానీ ఏడాది మొత్తం మీద చూసినా కొన్నిచోట్ల కనీసం ఒక్కటీ జరగడంలేదు. వైద్య సదుపాయాల కొరత, పర్యవేక్షణ లోపం తదితర కారణాలతో లక్ష్యం నెరవేరడం లేదు. ఈ ప్రభావం జిల్లా ఆసుపత్రులు, గర్భిణుల ఆరోగ్యంపై పడుతోంది. 

న్యూస్‌టుడే, బొమ్మూరు, ధవళేశ్వరం : తూర్పుగోదావరి జిల్లాలో 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ప్రతి పీహెచ్‌సీలో 13 మంది ఉద్యోగులను నియమించారు. దీని ప్రకారం ఇద్దరు వైద్యాధికారులు ఉంటారు. వీరిలో ఒకరు ఓపీ చూడాలి. మరొకరు గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టరుగా సేవలందించాలి. ఇందంతా రొటేషన్‌ పద్ధతిలో కొనసాగాలి. వీరితో పాటు ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌ అసిస్టెంటు, ఫార్మాసిస్టు, ఎంపీహెచ్‌ఈవో, పీహెచ్‌ఎన్, ఎంపీహెచ్‌ఎస్‌లు ఇద్దరు(ఆడ, మగ), యూడీసీ, అటెండరు లేక వాచ్‌మెన్‌ పోస్టులను మంజూరు చేశారు. దీని ఉద్దేశం 24 గంటలూ వైద్య సేవలందించడమే. ఎక్కడా మాతాశిశు మరణాలు జరగకుండా ప్రతి పీహెచ్‌సీలో కాన్పులు జరగాలి. వీరికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, అంగన్‌వాడీ టీచర్లను సహాయకులుగా నియమించారు. ఇంతమంది ఉన్నప్పటికీ సాధారణ ప్రసవాలకు సైతం గర్భిణులు నోచుకోవడంలేదు. అత్యవసర కేసులంటూ 108 వాహనాల్లో సీహెచ్‌సీలు, జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులకు తరలిస్తున్న క్రమంలో అంబులెన్సుల్లోనే ప్రసవాలు జరుగుతున్న సంఘటనలు తరచూ చూస్తున్నాం. 

ఇదీ పరిస్థితి    

2023-24 సంవత్సరంలో ధవళేశ్వరం పీహెచ్‌సీలో 135, బిక్కవోలులో 56, నల్లజర్లలో 44, దేవరపల్లిలో 31, కోరుకొండలో 30, ఉండ్రాజవరంలో 28, మలకపల్లిలో 27, రంగంపేటలో 20, సీతానగరంలో 20, దొమ్మేరులో 19, మారకొండపాడులో  18, అన్నదేవరపేటలో 15, రామవరంలో 15, పెరవలిలో 14, గౌరీపట్నం లో 13, కాలవలపల్లిలో 13, కుతుకులూరులో 9, పాలచర్లలో 9, సమిశ్రగూడెంలో 9, దోసకాయలపల్లిలో 8, తాడిమల్లలో 8, తాళ్లపూడిలో 7, బ్రాహ్మణగూడెంలో 6, కొంకుదురులో 3, హుకుంపేటలో 2,  పోతవరంలో ఒకటి చొప్పున ప్రసవాలు నమోదయ్యాయి. నిర్ధేశించిన లక్ష్యం ప్రకారం జిల్లాలో ఏడాదికి 1,860 వరకు జరగాల్సి ఉండగా కేవలం 2023 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు కేవలం 685 మంది మాత్రమే పురుడు పోసుకున్నారు. 

ఇతర సేవలూ కరవే..

పీహెచ్‌సీల్లో గత కొన్నేళ్లుగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరగడంలేదు. వైద్యులున్నా వెనుకడుగు వేస్తుడటం గమనార్హం. ఈ క్రమంలో చాలామంది ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో రూ.20 వేల నుంచి రూ.35 వేలు ఖర్చు పెడుతున్నారు. కొన్ని పీహెచ్‌సీలు మినహా మిగిలిన చోట్ల ఇవేవీ కానరావడం లేదు. 

లోటుపాట్లపై దృష్టిసారించాం..

అన్ని పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు జరగాల్సిందే. అత్యవసరమైతేనే సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రులకు పంపాలి.  ఈ విషయమై ఇప్పటికే సమీక్ష నిర్వహించాం. కు.ని.లు నెలకు కనీసం 20 చేయాలి. దీనిపై వైద్యులందరికీ శిక్షణ ఇచ్చాం. అవసరమైతే మళ్లీ తరగతులు నిర్వహిస్తాం. ఎక్కడైనా సిబ్బంది అలసత్వం వహించి విధులకు హాజరుకాకపోతే కఠిన చర్యలు తీసుకుంటాము. 
-వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

- ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 24 గంటలూ పనిచేసేందుకు వీలుగా ప్రభుత్వం జీవో నంబరు 143 తీసుకొచ్చింది. ఈ మేరకు ఏప్రిల్‌ 2023 నుంచి ఇప్పటివరకు జిల్లాలో ప్రసవాల తీరిది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని