logo

నేడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం.. నూతన ఎమ్మెల్యేల మనోగతమిదీ..

అయిదేళ్ల వైకాపా పాలనలో పూడ్చలేని విధ్వంసం జరిగింది.. ఎటుచూసినా అధ్వాన రహదారులు.. సాగు- తాగునీటి సమస్యలే.. కీలక శాఖలు గాడితప్పాయి.

Updated : 21 Jun 2024 07:39 IST

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, బిక్కవోలు, కడియం, సీతానగరం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం: అయిదేళ్ల వైకాపా పాలనలో పూడ్చలేని విధ్వంసం జరిగింది.. ఎటుచూసినా అధ్వాన రహదారులు.. సాగు- తాగునీటి సమస్యలే.. కీలక శాఖలు గాడితప్పాయి. అభివృద్ధి పనుల ఉనికే లేదు. ఆపన్న హస్తం కోసం అభాగ్యులు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులన్నీ చక్కదిద్దాల్సిన గురుతర బాధ్యత కొత్తగా కొలువుదీరిన కూటమి నేతలపై ఉంది.. వైకాపా నిరంకుశ పాలనకు విసిగి వేసారిన తూర్పు ప్రజలు.. ఉమ్మడి జిల్లాలో ఒక్కస్థానంలోనూ ఆ పార్టీ నేతలను గెలిపించలేదు. 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూటమికే పట్టం కట్టారు. అసెంబ్లీ సమావేశాలు ఈనెల 21 నుంచి నిర్వహించనున్నారు. తొలిరోజు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలో కొందరు తొలిసారిగా అడుగుపెట్టనున్నారు.. ఇంకొందరు పూర్వ అనుభవం ఉన్నవారు. ఈ నేపథ్యంలో మన శాసనసభ్యుల ప్రాధామ్యాలేమిటి..? నియోజకవర్గాల సర్వతోముఖాభివృద్ధికి చేపట్టనున్న చర్యలేమిటో.. వారి మాటల్లోనే..  


విద్య, వైద్యానికి అగ్ర ప్రాధాన్యం

నియోజకవర్గంలో విద్య, వైద్యానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఉంటుంది. నిడదవోలు 30 పడకల ఆసుపత్రిని 100 పడకలుగా మార్చేలా కృషి చేస్తా.

 • యువతకు వృత్తివిద్య, నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు కార్యాచరణ చేస్తున్నాం.
 • నిడదవోలు పట్టణ ప్రజలకు గోదావరి జలాలు అందేలా చూస్తాం
 •  సుమారు 40 ఆలయాలున్న ప్రాంతానికి వెళ్లేందుకు చినకాశీరేవు వంతెన పూర్తి చేస్తాను.
 • పెరవలి మండలంలో చిరువ్యాపారులకు వసతులు కల్పించి ఆదుకుంటాం.
 •  టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమస్య పరిష్కరిస్తాం. నియోజకవర్గవ్యాప్తంగా రహదారులు, కాలువల అభివృద్ధికి చర్యలు చేపడతాం.

 కందుల దుర్గేష్, మంత్రి, నిడదవోలు ఎమ్మెల్యే


అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

కొవ్వూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కార్యాచరణ అమలు చేస్తాం.

 • ఎత్తిపోతల పథకాలను ఆధునికీకరించి ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం.
 • తెదేపా హయాంలోనే 80 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్లను త్వరితగతిన లబ్ధిదారులకు అందించడానికి ప్రయత్నిస్తాం. తాగునీటి బోర్లు సరిచేయించి రోజూ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని అధికారులకు సూచించాం.
 • గోదావరి బండ్‌ను ఆహ్లాదకరంగా మార్చడమే గాక గోష్పాదక్షేత్రాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతాం
 • ముఖ్య రైళ్లను కొవ్వూరు స్టేషన్‌లో నిలిపేలా ఉన్నతాధికారులతో మాట్లాడతా.

ముప్పిడి వెంకటేశ్వరరావు, కొవ్వూరు


దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం

అతి సామాన్యుడినైన నేను ప్రజాస్వామ్యం ద్వారా శాసనసభలో అడుగు పెట్టేలా అవకాశం కల్పించిన మహిళలు, రైతులు, కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తాను.

 •  సత్సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చాను. ఈ అవకాశంతో మహిళా సాధికారతకు పథకాలు సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటా.
 •  నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటి పరిష్కారంపై దృష్టి పెట్టి అధికారుల సహకారంతో అభివృద్ధికి బాటలు వేస్తాం. 

మద్దిపాటి వెంకటరాజు, గోపాలపురం


రైతుల పొలాలకు నీరందేలా చేస్తా..

పురుషోత్తపట్నం, పుష్కర, తొర్రిగెడ్డ ఎత్తిపోతల మరమ్మతుల సమస్యలను పరిష్కరించడం ద్వారా మెట్ట ప్రాంతంలోని తుని వరకు శివారు పొలాలకు నీరందిస్తాం. సీతానగరం, రాజమహేంద్రవరం నాలుగు వరసల రహదారి విస్తరణకు 11.2 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. న్యాయపరమైన అంశాలను పరిష్కరిస్తాం. గుత్తేదారులకు బకాయిలు విడుదల చేసి రహదారి పనులు వేగవంతం చేయిస్తాను. 

 •  ఏపీఎస్‌ఐడీసీ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. 
 • దేవస్థానం పేరుతో కోరుకొండ భూముల్లో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు తిరిగి జరిగేలా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. ఇళ్ల స్థలాలకు ఇచ్చిన ఆవ భూముల స్కాం, కొండలు, ఇసుక దోపీడీపై విచారణ నిర్వహిస్తాం.   

బత్తుల బలరామకృష్ణ, రాజానగరం


ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తాను.

 • నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల సమస్య పరిష్కరిస్తా. ప్రధాన మురుగు కాలువలను బాగుచేసి ముంపు సమస్య లేకుండా చేస్తాను.
 • గృహ నిర్మాణ రంగాన్ని సరిచేసి అర్హులకు ఇవ్వడంతోపాటు, శాటిలైట్‌ సిటీ మాదిరిగా మరిన్ని టౌన్‌షిప్‌లు నిర్మిస్తాం.
 • కడియం నర్సరీలను పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తాం.
 • గోదావరి నదిలో వ్యర్థాల ప్రక్షాళనకు నివేదికలు సిద్ధం చేశాం. పుష్కరాల సమయానికి స్వచ్ఛ గోదావరి ధ్యేయం.    

గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్యే, రాజమహేంద్రవరం గ్రామీణం


సాగునీటి కల్పన.. రహదారుల మరమ్మతులు

నియోజకవర్గంలో సాగునీటి పారుదల, రహదారుల వ్యవస్థలు అధ్వానంగా తయారయ్యాయి. వీటిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది.

 • కాలువల మరమ్మతులకు నిధులు తీసుకువస్తాం. ముఖ్యమైన కెనాల్‌ రోడ్డు అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర నిధులతో ప్రణాళిక వేస్తున్నాం.
 • కాపవరం-బలభద్రపురం మధ్య రైల్వే లెవిల్‌ క్రాసింగ్‌ వద్ద దారి కల్పించేందుకు కృషి చేస్తాం.
 • బలభధ్రపురం రైల్వే హాల్ట్‌ను ఎలాంటి సమాచారం లేకుండా ఎత్తివేశారు. పునరుద్ధరణకు చర్యలు చేపడతాం.
 • అనపర్తి రైల్వే స్టేషన్‌లో జన్మభూమితో పాటు, కొన్ని ఇతర ఎక్స్‌ప్రెస్‌లు ఆగేలా చేస్తాం.     

నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి


ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం

చారిత్రక రాజమహేంద్రవరం నగరాన్ని మరింత విస్తరించాలనేది లక్ష్యం. ఆవ భూముల కొనుగోళ్ల విషయంలో జరిగిన తప్పిదాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాను.

 • కాస్త వర్షానికే నగరం ముంపు సమస్యను ఎదుర్కొంటుంది. అమృత్‌ పథకంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కొద్ది మేరకు మాత్రమే నిధులు విడుదలయ్యాయి. కాలువల విస్తరణ పనులు చేపట్టినన్పటికీ మధ్యలో నిలిచిపోయాయి. మరిన్ని నిధులను కోరతాం.
 •  హేవలాక్‌ బ్రిడ్జి, గోదావరి రివర్‌ఫ్రంట్‌ వంటి ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా నగరం శోభాయమానంగా మారనుంది.
 • 2027 పుష్కరాలకు సంబంధించి ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా పనులు చేపడతాం. వసతి ఏర్పాట్లు, తాగునీరు, ఘాట్ల నిర్మాణం వంటి పనులు ముందుగానే చేపట్టాల్సిన అవసరం ఉంది.

ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమహేంద్రవరం అర్బన్‌ ఎమ్మెల్యే 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు