logo

ప్రక్షాళన చేస్తాం.. ప్రగతి చూపుతాం

అయిదేళ్ల వైకాపా పాలనలో పూడ్చలేని విధ్వంసం జరిగింది.. ఎటుచూసినా అధ్వాన రహదారులు.. సాగు- తాగునీటి సమస్యలే.. కీలక శాఖలు గాడితప్పాయి. అభివృద్ధి పనుల ఉనికే లేదు. ఆపన్న హస్తం కోసం అభాగ్యులు ఎదురుచూడాల్సిన పరిస్థితి

Published : 21 Jun 2024 07:20 IST

 కొత్త శాసనసభ్యుల మనోగతం

నేడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే: అమలాపురం గ్రామీణం, ముమ్మిడివరం, మామిడికుదురు, పి.గన్నవరం, రామచంద్రపురం, మండపేట, రావులపాలెం పట్టణం: అయిదేళ్ల వైకాపా పాలనలో పూడ్చలేని విధ్వంసం జరిగింది.. ఎటుచూసినా అధ్వాన రహదారులు.. సాగు- తాగునీటి సమస్యలే.. కీలక శాఖలు గాడితప్పాయి. అభివృద్ధి పనుల ఉనికే లేదు. ఆపన్న హస్తం కోసం అభాగ్యులు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులన్నీ చక్కదిద్దాల్సిన గురుతర బాధ్యత కొత్తగా కొలువుదీరిన కూటమి నేతలపై ఉంది.. వైకాపా నిరంకుశ పాలనకు విసిగి వేసారిన తూర్పు ప్రజలు.. ఉమ్మడి జిల్లాలో ఒక్కస్థానంలోనూ ఆ పార్టీ నేతలను గెలిపించలేదు. 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూటమికే పట్టం కట్టారు. అసెంబ్లీ సమావేశాలు ఈనెల 21 నుంచి నిర్వహించనున్నారు. తొలిరోజు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలో కొందరు తొలిసారిగా అడుగుపెట్టనున్నారు.. ఇంకొందరు పూర్వ అనుభవం ఉన్నవారు. ఈ నేపథ్యంలో మన శాసనసభ్యుల ప్రాధామ్యాలేమిటి..? నియోజకవర్గాల సర్వతోముఖాభివృద్ధికి చేపట్టనున్న చర్యలేమిటో.. వారి మాటల్లోనే..  


తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

ఫోన్‌లో మాట్లాడుతున్న కార్మిక శాఖ మంత్రి సుభాష్‌

రామచంద్రపురం నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యమిస్తాను. జలజీవన్‌ మిషన్‌లో భాగంగా ఇంటింటికీ కొళాయి ఏర్పాటు చేస్తాం

 • నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. వారికి 365 రోజులు పని కల్పించేందుకు కృషి చేస్తా.
 • సాగు, పంట కాలువల్లో పూడిక తొలగింపునకు చర్యలు తీసుకుంటాను.
 • రబీలో ధాన్యం విక్రయించిన రైతులకు ఈ నెలాఖరులోగా సొమ్ము అందేలా చూస్తాను.

-వాసంశెట్టి సుభాష్, కార్మికశాఖ మంత్రి


7 వంతెనలు.. కొత్త రహదారులు

అమలాపురం పట్టణంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఏడు వంతెనల నిర్మాణాలు చేపడతాం. ఎర్రవంతెన, నల్లవంతెన, ఈదరపల్లి వంతెనలతోపాటు మరికొన్నింటిని ఏర్పాటుచేయడం లక్ష్యంగా పెట్టుకున్నా.

 •  తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను.
 •  కొత్త రహదారుల నిర్మాణం.. అదే సమయంలో ధ్వంసమైన మార్గాలకు మరమ్మతులు వంటివి ఉంటాయి.
 •  పట్టణంలోని కాలనీల్లో మురుగునీటి పారుదల వ్యవస్థను చక్కదిద్దుతా.
 • నియోజకవర్గంలో రైతులకు ఇబ్బందికరంగా మారిన పంట, మురుగు కాలువల ఆధునికీకరణ పనులకు కార్యాచరణ ఉంది.   

 -అయితాబత్తుల ఆనందరావు, అమలాపురం


సంక్షేమం.. గ్రామీణాభివృద్ధి

 •  గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. ముమ్మిడివరం నగర పంచాయతీలో 2018లో ఏఐఐబీ నిధులు రూ.110 కోట్లతో తాగునీటి పథకం తీసుకువచ్చాను. వైకాపా పాలనలో గుత్తేదారులకు బిల్లులు చెల్లించక పనులు నిలిచిపోయాయి. దానిని పూర్తిచేస్తా.
 • ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల్లో ఉపాధి హామీ నిధులతో రహదారుల పనులు చేపడతాం. ముమ్మిడివరం-కాట్రేనికోన రహదారి నిర్మాణంపై దృష్టి సారిస్తా.
 •  జి.మూలపొలం, గుత్తెనదీవి వంతెనల నిర్మాణానికి గతంలో నిధులు విడుదల చేయలేదు. వాటన్నింటినీ పూర్తి చేయడం బాధ్యతగా తీసుకుంటా.

-దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు), ముమ్మిడివరం


రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం

పి.గన్నవరం నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌శాఖ రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాను.

 • అయినవిల్లి సిద్ధివినాయకుడు, అప్పనపల్లి బాలబాలాజీస్వామి దేవస్థానాల్లో భక్తులకు సదుపాయాలు కల్పిస్తాం.
 • పి.గన్నవరం వద్ద 1852లో కాటన్‌ నిర్మించిన అక్విడెక్టు... కొత్తగా కట్టిన డొక్కా సీతమ్మ అక్విడెక్టులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతా.
 •  గ్రామాల్లో కాలువల నిర్మాణం, పి.గన్నవరంలో అగ్నిమాపకకేంద్రం ఏర్పాటు, నదీకోత నివారణ చర్యలు, జి.పెదపూడిలంకలో గోదావరిపై వంతెన పనులు వేగంగా పూర్తిచేస్తా.
 • ఎదురుబీడుం, కె.ఏనుగుపల్లిలంక, శివాయిలంక, అప్పనపల్లి వద్ద కాజ్‌వేల నిర్మాణానికి కృషిచేస్తా.     

 -గిడ్డి సత్యనారాయణ, పి.గన్నవరం


లింక్‌ రోడ్లు.. నీటి పారుదల వ్యవస్థపై దృష్టి

పేదలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యం. తాగునీరు, డ్రెయినేజీ, రోడ్ల్ల నిర్మాణాలు తొలి ప్రాధాన్యం. ్య వ్యవసాయ ఉత్పత్తులు తరలించే సమయంలో లింక్‌ రోడ్లు పాడైపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాటి  ఆధునికీకరణకు కృషి చేస్తాను. ్య నీటి పారుదల, డ్రెయినేజీ వ్యవస్థలను మెరుగుపరుస్తా. ్య లొల్ల లాకుల అభివృద్ధికి చర్యలు చేపడతా. ్య సామాజిక భవనాలు నిర్మిచడంతో పాటు, విద్య వైద్య పరంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాను. 
-బండారు సత్యానందరావు, కొత్తపేట ఎమ్మెల్యే


ఇళ్ల నిర్మాణం.. రహదారుల బాగుచేత

ఇళ్ల లబ్ధిదారులకు గృహాలు నిర్మించి ఇచ్చే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చాను. నియోజకవర్గం పరిధిలో 9,280 మందికి స్థలాలు ఇచ్చారు. 3,373 మంది మాత్రమే  నిర్మించుకున్నారు. మరో 5,907 మంది పూర్తి చేయలేకపోయారు. వీరందరికీ ఇళ్లు నిర్మించే విషయాన్ని శాసనసభలో ప్రస్తావిస్తా.

 • ర.భ శాఖ, పీఆర్‌ రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. గోతుల కారణంగా కొందరు మరణించిన సంఘటనలు ఉన్నాయి. నిర్మాణం పూర్తి చేయడాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటా.
 • చిట్టచివరి లబ్ధిదారు వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో ఉన్నాను. 

-వేగుళ్ల జోగేశ్వరరావు, మండపేట


అన్ని నివాసిత ప్రాంతాలకు రక్షిత తాగునీరు

రాజోలు నియోజకవర్గంలో అన్ని నివాసిత ప్రాంతాలకు ప్రతి రోజూ రక్షిత మంచినీరు అందేలా చూడటమే తొలి ప్రాధాన్యం. సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, అధునాతన నీటి శుద్ధి విభాగాలు, పైపులైన్లను ఏర్పాటు చేసే దిశగా కృషి జరుగుతోంది.

 • అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతా. భక్తులు, పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు కావాల్సిన నిధుల మంజూరుకు కృషి చేస్తాను
 • యువతకు ఉపాధి కల్పన దిశగా ప్రత్యేక ప్రణాళిక ఉంది.
 • గతంలో జిల్లా కలెక్టర్‌గా, ప్రభుత్వ శాఖల్లో కమిషనర్‌గా, వివిధ సంస్థల్లో మేనేజింగ్‌ డైరెక్టరుగా చేసిన అనుభవంతో నియోజకవర్గంలో అందరినీ సమన్వయం చేసుకొని అన్ని రంగాల్లో పురోగతి సాధించి చూపుతా.   

 -దేవ వరప్రసాద్, రాజోలు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు