logo

వైకాపా నాయకుల చూపు కూటమి వైపు

ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమితమైన  నేపథ్యంలో అయిదేళ్ల రాజకీయ భవిష్యత్తుపై వైకాపా నాయకుల్లో గుబులు పట్టుకుంది. స్థానిక సంస్థల్లో విజయం సాధించిన వైకాపా నాయకులు తెదేపా, జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.

Updated : 11 Jul 2024 05:25 IST

నిడదవోలు, న్యూస్‌టుడే: ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమితమైన  నేపథ్యంలో అయిదేళ్ల రాజకీయ భవిష్యత్తుపై వైకాపా నాయకుల్లో గుబులు పట్టుకుంది. స్థానిక సంస్థల్లో విజయం సాధించిన వైకాపా నాయకులు తెదేపా, జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని రోజులుగా వీరు కూటమి పార్టీల ప్రధాన నాయకులతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిడదవోలు పట్టణంలోని పలు కౌన్సిలర్లు పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. 2021లో జరిగిన పురపాలక సంఘ ఎన్నికల్లో 27 వార్డుల్లో వైకాపా అభ్యర్థులు, ఒక వార్డులో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన కారింకి నాగేశ్వరరావు(27వ వార్డు) విజయం సాధించారు. ఇందులో 25వ వార్డు కౌన్సిలర్‌ భూపతి ఆదినారాయణకు ఛైర్మన్‌ పదవి దక్కింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, నిడదవోలు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా కందుల దుర్గేష్‌ భారీ మెజార్టీతో గెలిచి, మంత్రి అవ్వడంతో కొంతమంది కౌన్సిలర్లు కూటమి వైపు అడుగులు వేస్తున్నారు.

పాలకవర్గం మార్పు..?

27 మంది వైకాపా కౌన్సిలర్లలో 12 నుంచి 13 మంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వారిలో కొందరు నియోజకవర్గ వైకాపా ప్రధాన నాయకుడి మాట వినకుండా మంత్రిని కలిశారు. 13 మంది పార్టీ మారితే ఎమ్మెల్యేగా దుర్గేష్‌కు ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా ఓటు హక్కు ఉంటుంది. తెదేపా నుంచి ఇప్పటికే ఒక కౌన్సిలర్‌ ఉండటంతో పాలకవర్గం మార్పు ఖాయమవుతుందని భావిస్తున్నారు. పార్టీ మార్పుపై ఓ కౌన్సిలర్‌ బాహటంగానే చెబుతున్నారు. వైఎస్సార్‌ జయంతికి పలువురు కౌన్సిలర్లు హాజరు కాలేదు.

ఛైర్మన్‌ పదవిపై ఉత్కంఠ..

ఎన్నికల సమయంలో ఇద్దరు వైకాపా కౌన్సిలర్లు ఛైర్మన్‌ పదవి కోసం పోటీ పడ్డారు. రెండున్నరేళ్లు చొప్పున ఒప్పందం జరిగింది. ముందు భూపతి ఆదినారాయణకు, తర్వాత కాలం 21వ వార్డు నుంచి విజయం సాధించిన కామిశెట్టి సత్యనారాయణ(సత్తిబాబు)కు అవకాశం రావాలి. మొదటి రెండున్నరేళ్ల కాలం అవ్వడం, ఆ తర్వాత సాధారణ ఎన్నికలు రావడంతో జాప్యం జరిగింది. సత్తిబాబుకు ఛైర్మన్‌ పదవి మార్పుపై ఇటీవల మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ నాయుడు పలువురు కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. కాగా రాష్ట్రంలో వైకాపా ఓటమి, నాయకుల పార్టీ మార్పు అంశం తెరమీదకు రావడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు