logo

గ్రామాల విలీనంపై కొత్త మలుపు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో చుట్టుపక్కల గ్రామ పంచాయతీల విలీన ప్రక్రియ కొత్త మలుపు తిరిగింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.

Updated : 11 Jul 2024 05:23 IST

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో చుట్టుపక్కల గ్రామ పంచాయతీల విలీన ప్రక్రియ కొత్త మలుపు తిరిగింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. గత 15 ఏళ్లుగా ఈ ప్రక్రియ నలుగుతుండగా ప్రస్తుతం చివరి దశకు చేరుకొంది. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అప్పటి మంత్రి వేణు దీనికి వ్యతిరేకంగా పావులు కదిపారు. ఎన్నికల్లో ఆ ప్రాంత ప్రజలను ఆకట్టుకొనే క్రమంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.

గాలిలో దీపంలా పాలన

విలీన అంశం గాలిలో దీపంలా మారిపోయింది. అభివృధ్ధి పేరుతో రాజమహేంద్రవరం ఆనుకొని ఉన్న చుట్టుపక్కల గ్రామ పంచాయతీలను నగరపాలక సంస్థలో విలీనం చేయాలని గతంలో ప్రతిపాదించారు. దీన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి చంద్రబాబునాయుడు హయాంలోనే ఈ అంశం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత మారిన ప్రభుత్వాలు అనుకూలంగా ఉండటంతో దస్త్రాలు ముందుకు కదిలాయి. ఎట్టకేలకు పది గ్రామ పంచాయితీలను విలీనం చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేశారు. అందుకు గవర్నర్‌ సైతం ఆమోదం తెలిపారు. కోర్టుకు ప్రభుత్వం తరఫున అఫిడవిట్‌ విడుదల చేయాల్సి ఉంది.  ఓ పక్క నగరపాలక సంస్థ యంత్రాంగం సైతం ఆయా పంచాయతీల్లో దస్త్రాలు స్వాధీనం చేసుకొన్నారు. ఈ లోపు సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి.

అప్పటి మంత్రి సూచనలతో..

రాజమహేంద్రవరం గ్రామీణంలో వైకాపా తరఫున బరిలో నిలిచిన అప్పటి మంత్రి వేణుగోపాలకృష్ణ విలీనంపై కొత్తపాట పాడారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఎన్నికలకు ఇంకా మూడు నెలలు సమయం ఉండగా గ్రామీణంలో అడుగు పెట్టారు. దీనిలో భాగంగా విలీనం ప్రతిపాదనల వల్ల గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ పనులు ఉండటం లేదని, ప్రజలకు ఆదాయం లేకుండా పోతుందనే కారణంతో కలెక్టర్‌కు లేఖ రాశారు. మంత్రి సూచన మేరకు అప్పటి కలెక్టర్‌ మాధవీలత స్పందించారు. నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారిగా ఉన్న ఆమె డీమెర్జింగ్‌ చేయాలని ప్రతిపాదించారు. స్పందించిన అధికార యంత్రాంగం సీడీఎంఏకు డీమెర్జింగ్‌పై ప్రతిపాదనలు పంపించారు. కలెక్టర్‌ ప్రత్యేకాధికారి హోదాలో ఈ ఏడాది ఫిబ్రవరి 9న కౌన్సిల్‌ తీర్మానం చేసి అదేనెల 12వ తేదీన ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాకపోగా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది.

కీలక దశలో ఉండగా..

విలీన ప్రక్రియ కీలక దశలో ఉండగా తిరిగి వద్దంటూ ప్రభుత్వానికి నివేదించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గ్రామీణంలో విలీన ప్రతిపాదిత గ్రామాల్లో స్థానిక ఎన్నికలు జరగకపోవడంతో పాలకవర్గం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటోఇటో ఎటోవైపు నిర్ణయించాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. పాలకవర్గం లేక సమస్యలను పట్టించుకొనే నాధుడు లేడంటూ మొరపెడుతున్నారు. మరోవైపు రానున్న పుష్కరాల నేపథ]్యంలో నగరపాలక సంస్థకు పాలకవర్గం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించడంతో విలీన అంశం మరోసారి తెరపైకి వస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పాలకులు ఎలా నిర్ణయం తీసుకొంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో గ్రామీణ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అర్బన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్‌ల నిర్ణయం మేరకు ప్రతిపాదన ముందుకెళ్లనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని