logo

HYD: గచ్చిబౌలిలో నాటు తుపాకుల కలకలం

పట్టపగలు నాటు తుపాకులతో సంచరిస్తున్న ఓ వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated : 01 Jul 2021 08:34 IST

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: పట్టపగలు నాటు తుపాకులతో సంచరిస్తున్న ఓ వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి మత్తులో సదరు వ్యక్తి తుపాకీతో స్థానికులను బెదిరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు.. కొండాపూర్‌ మసీద్‌ బండలో మంగళవారం మధ్యాహ్నం ఓ యువకుడు, తన ఇద్దరు స్నేహితురాళ్లతో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయానికి జేవీజీ హిల్స్‌ రోడ్డు నుంచి భుజానికి సంచితో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆ ముగ్గురిని అడ్డుకున్నాడు. అమ్మాయిలతో అనుచితంగా ప్రవర్తించాడు. యువకుడు అతడిని అడ్డుకోగా.. ఇద్దరి మధ్య కాసేపు ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం ఆ వ్యక్తి తన సంచిలోంచి రెండు నాటు తుపాకులను తీసి చంపేస్తానంటూ వారిని బెదిరించాడు. భయభాంత్రులకు గురైన ఆ ముగ్గురు పరుగులు తీశారు. అనంతరం డయల్‌ 100కు సమాచారమివ్వడంతో గచ్చిబౌలి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సదరు వ్యక్తి అప్పటికే అక్కడి నుంచి పారిపోగా.. గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు జేవీజీ హిల్స్‌ సమీపంలోని ఓ గదిలో పట్టుబడ్డాడు. అతని వద్ద నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పంజాబ్‌ రాష్ట్రంలోని జలంధర్‌కు చెందిన దల్జీత్‌సింగ్‌(28)గా తేలింది. కొంతకాలం క్రితం నగరానికి వలసొచ్చినట్లు సమాచారం. జేవీజీ హిల్స్‌ కాలనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే తన స్నేహితుడి వద్దకు తరచూ వచ్చి వెళ్తుంటాడని తేలింది. అతడికి తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని