logo

Hyd: ఉగ్రవాదులుంటున్నా ఉలుకూ పలుకూలేదు

బిహార్‌లోని దర్భంగా రైల్వేస్టేషన్‌లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు వెనుక ఇద్దరు ఉగ్రవాదులు నాసిర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ మాలిక్‌లున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌.ఐ.ఎ) అధికారులు గుర్తించారు. వీరు మల్లేపల్లిలోని ఒక ప్రార్థన మందిరం వద్ద వస్త్రదుకాణాన్ని నిర్వహిస్తున్నారని తెలుసుకున్నారు.

Updated : 02 Jul 2021 07:20 IST

వారి కార్యకలాపాలపై పోలీసుల దృష్టి అంతంతే

ఈనాడు, హైదరాబాద్‌: బిహార్‌లోని దర్భంగా రైల్వేస్టేషన్‌లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు వెనుక ఇద్దరు ఉగ్రవాదులు నాసిర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ మాలిక్‌లున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌.ఐ.ఎ) అధికారులు గుర్తించారు. వీరు మల్లేపల్లిలోని ఒక ప్రార్థన మందిరం వద్ద వస్త్రదుకాణాన్ని నిర్వహిస్తున్నారని తెలుసుకున్నారు. వారిని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని దిల్లీకి తరలించారు.

‘‘బెంగళూరు.. హైదరాబాద్‌ నగరాల్లోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రముఖులను చంపేందుకు హుజీ ఉగ్రవాద సంస్థ కార్యచరణ రూపొందించిందని బెంగళూరు క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు తొమ్మిదేళ్ల క్రితం తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో హుజి సంస్థ తరఫున పనిచేస్తున్న పాతబస్తీ యువకుడు ఉబేద్‌-ఉర్‌-రహిమాన్‌ను బెంగళూరు నుంచి వచ్చి అరెస్ట్‌ చేశారు.

- రాజధాని నగరంలో ఉగ్రవాదులు, ఉగ్రసంస్థల కార్యకలాపాలకు సజీవ సాక్ష్యాలు ఈ సంఘటనలు. ఈ రెండు ఘటనల్లో ఉగ్రవాదులను హైదరాబాద్‌ పోలీసులు పట్టుకోలేదు. బయట నుంచి వచ్చిన పోలీసు అధికారులు అరెస్ట్‌ చేశారు. ఉగ్రవాదులను అరెస్ట్‌ చేసేంత వరకు మన పోలీసులకు విషయం తెలీదు.

సమాచారమా? తెలీదు.. దక్షిణాది రాష్ట్రాల్లోని బెంగళూరు, హైదరాబాద్‌, కోయంబత్తూరు, కోచి పరిసర ప్రాంతాల్లో ఉగ్రసంస్థలు రెండు దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. బెంగళూరు క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు, కేరళ ఏటీఎస్‌ (ఉగ్రవాద వ్యతిరేక దళం) పోలీసులు ఎప్పటికప్పుడు ఉగ్రకలాపాలపై సమాచారం సేకరిస్తున్నారు. కేంద్ర నిఘా సంస్థలతో సమాచారాన్ని పంచుకుంటున్నారు. ఇందుకు భిన్నంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో చాపకింది నీరులా ఇండియన్‌ ముజాహిదీన్‌, లష్కర్‌-ఎ-తోయిబా, హుజీ వంటి ఉగ్ర సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నా ఆయా సంస్థల సభ్యులు రహస్యంగా ఇక్కడ ఉంటున్నా పోలీసులకు తెలీదు. ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జాతీయ దర్యాప్తు సంస్థ పోలీస్‌ అధికారులు ఇక్కడి వచ్చి ఉగ్రవాదులు, వారి సానుభూతి పరులను అరెస్ట్‌ చేసినప్పుడు మాత్రమే పోలీసులకు తెలుస్తోంది..

అడ్డాగా పాతబస్తీ, మల్లేపల్లి, టోలీచౌకీ.. ఉగ్రసంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు పాతబస్తీ, మల్లేపల్లి, టోలీచౌకీలను కేంద్రాలుగా ఎంచుకున్నాయని నిఘా సంస్థల దర్యాప్తులో తేలింది. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్‌ ప్రాంతాలు, పశ్చిమ మండలంలోని మల్లేపల్లి, టోలీచౌకీల్లో ఎక్కువగా ఉగ్రవాద సంస్థల సభ్యులు నివాసముంటున్నారు. వీరిలో చాలామంది వస్త్రవ్యాపారులు, ఫర్నిచర్‌ దుకాణాల యజమానులుగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు ఐటీ సంస్థల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. మల్లేపల్లి ప్రాంతంలో ఎనిమిదేళ్లలో ఆరుగురు ఉగ్రవాదులను కేంద్ర నిఘా వర్గాలు అరెస్ట్‌ చేశాయి. తాజాగా ఎన్‌.ఐ.ఎ.కు పట్టుబడిన నాసిర్‌మాలిక్‌ ఇరవై ఏళ్ల క్రితం నుంచి మల్లేపల్లిలోనే ఉంటున్నాడు. మధ్యలో రెండుసార్లు పాకిస్థాన్‌ వెళ్లొచ్చాడని విచారణలో తేలింది. పదేళ్లుగా వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్న మాలిక్‌ సోదరులపై మన పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు.

భద్రతలో నిర్లక్ష్యం.. ‘రైల్వే’నే నిదర్శనం

సికింద్రాబాద్‌ పార్సిల్‌ బుకింగ్‌ కార్యాలయం నుంచి వెళ్లిన ఓ పార్సిల్‌.. బిహార్‌లోని దర్భంగా రైల్వేస్టేషన్‌లో పేలింది. ఈ ఘటన వెనుక ఉగ్ర కుట్ర కోణాలున్నాయని ఎన్‌ఐఏ విచారణలో వెల్లడవుతోంది. ఇప్పటికే సదరు పార్సిల్‌ను బుకింగ్‌ చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇంత జరుగుతున్నా.. రైల్వేపరంగా ఎలాంటి అప్రమత్తత లేదు. పార్సిల్‌ బుకింగ్‌ ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా కొనసాగుతోంది. పేలుడు తదితర పదార్థాలను గుర్తించే మెటల్‌ డిటెక్టర్లు, స్కానర్లు ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. పార్సిల్‌ బుకింగ్‌ కేంద్రం, రైల్వేస్టేషన్‌లో పటిష్ట బందోబస్తుకే పరిమితమయ్యారు.

అడుగడుగునా భద్రతా లోపాలు.. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో భద్రత గాలిలో దీపంలా మారింది. స్టేషన్‌ ప్రవేశ మార్గాల్లోనే సరకులు, బ్యాగులు స్కాన్‌ అయిపోవాలి. లేని పక్షంలో స్కానర్‌ యంత్రంలో వాటిని వేసిన తర్వాతే స్టేషన్‌లోకి అనుమతించాలి. మెట్రోలో మాదిరి ప్రయాణికుల చేతి సంచులూ స్కాన్‌ చేయాల్సిందే. లక్షలాది ప్రయాణికులను, వారి సామగ్రిని తనిఖీ చేయడం కత్తిమీద సాములాంటిదే. కానీ భద్రత దృష్ట్యా తప్పదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని