logo

TS News: దోమలపై మీనాస్త్రం!

నిల్వ నీటిలో గంబూసియా చేపలు వదలడంతో దోమల ఉద్ధృతి తగ్గుతోంది. లార్వా దశలోనే చేపలు తినేయడంతో వాటి పెరుగుదల నిలిచిపోతోంది.

Updated : 10 Jul 2021 08:06 IST

నగరవాసులూ పెంచుకోవచ్చు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: నిల్వ నీటిలో గంబూసియా చేపలు వదలడంతో దోమల ఉద్ధృతి తగ్గుతోంది. లార్వా దశలోనే చేపలు తినేయడంతో వాటి పెరుగుదల నిలిచిపోతోంది. మూసీ లాంటి  మురుగు నీటిలో కాకుండా సాధారణంగా నిల్వ ఉండే నీరు, కొద్దిగా మురికిగా ఉండే నీటిలో ఈ చేపలు మనుగడ సాగిస్తాయి. హయత్‌నగర్‌లోని కాప్రాయి చెరువుతో పాటు ఇతర ప్రదేశాల్లో పెంచుతున్న లక్షలాది గంబూసియా చేపలను నగరంలోని అన్ని చెరువులు, కుంటల్లో వదిలేందుకు  రంగం సిద్ధం చేస్తున్నారు. ఒక్కొక్క చేప రోజుకు 100 నుంచి 300 లార్వాలను ఆహారంగా తీసుకుని దోమల సంతతి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి.

స్థానికులకు అవగాహన... రెండేళ్ల క్రితం గంబూసియా చేపలను అధికారులు కాప్రాయి చెరువులో వదిలారు. నీరు పుష్కలంగా, వాటి జీవన పరిస్థితులకు అనుకూలంగా ఉండటంతో వాటి సంతతి ఊహించని రీతిలో పెరిగింది. ప్రస్తుతం అందులో 30 లక్షలకు పైగా చేపలున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలోని ఇతర చెరువుల్లోనూ ఇదే తరహాలో వృద్ధి చెందుతున్నాయి. ఆయా చెరువుల నుంచి గంబూసియా చేపలను సేకరించి కొరత ఉన్న జలవనరుల్లో వదులుతున్నారు. ఇటీవలే శేరిలింగంపల్లి, కార్వాన్‌, మచ్చబొల్లారం, అల్వాల్‌, సరూర్‌నగర్‌, బంజారాహిల్స్‌, లోటస్‌పాండ్‌ సమీపంలోని జలాశయాల్లో వీటిని వదలడంతోపాటు స్థానికులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.  గేటెడ్‌ కమ్యూనిటీలు, రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌లు, నీటి నిల్వ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో దోమల బెడద ఉన్నవారు నేరుగా ఎంటమాలజీ అధికారులను సంప్రదిస్తే ఈ  చేపల్ని అందజేస్తామని  చీఫ్‌ ఎంటమాలజిస్ట్‌ రాంబాబు తెలిపారు. సర్కిల్‌ స్థాయిలో అసిస్టెంట్‌ ఎంటమాలజిస్ట్‌, డివిజన్‌ స్థాయిలో సూపర్‌వైజర్లకు సమాచారం ఇస్తే అధికారులు అక్కడికి వచ్చి వాటిని అందిస్తారని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని