logo

Crime News: మూడోసారి పోలీసు కస్టడీకి శిల్పాచౌదరి

పెట్టుబడులు, అధికవడ్డీలతో మోసగించిన ఆరోపణలతో అరెస్టయిన శిల్పాచౌదరిని ఒకరోజు పోలీసు కస్టడీకు ఉప్పర్‌పల్లి న్యాయస్థానం సోమవారం అనుమతినిచ్చింది. ఆమె దాఖలు చేసిన బెయిల్‌పిటీషన్‌ను తిరస్కరించింది.

Published : 14 Dec 2021 08:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: పెట్టుబడులు, అధికవడ్డీలతో మోసగించిన ఆరోపణలతో అరెస్టయిన శిల్పాచౌదరిని ఒకరోజు పోలీసు కస్టడీకు ఉప్పర్‌పల్లి న్యాయస్థానం సోమవారం అనుమతినిచ్చింది. ఆమె దాఖలు చేసిన బెయిల్‌పిటీషన్‌ను తిరస్కరించింది. గండిపేట సిగ్నేచర్‌ విల్లాస్‌కు చెందిన శిల్పాచౌదరి, శ్రీనివాస్‌ ప్రసాద్‌ దంపతులు మోసగించారంటూ గత నెలలో దివ్యారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను రాబట్టేందుకు శిల్పాచౌదరిని ఇప్పటికే రెండుసార్లు కస్టడీకు తీసుకుని విచారించారు. రెండోసారి కస్టడీకు తీసుకున్నపుడు రెండో శనివారం, ఆదివారం సెలవులు కావటంతో బ్యాంకు ఖాతాలు, లాకర్లను పరిశీలించలేకపోయామంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో ఒక్కరోజు కస్టడీకు అనుమతినిచ్చింది. మంగళవారం ఆమె నుంచి బ్యాంకు లావాదేవీలు, లాకర్లకు సంబంధించిన వివరాలు సేకరించనున్నట్టు సమాచారం.

అంతా గందరగోళం.. నవంబరు 13న పుప్పాలగూడ ప్రాంతానికి చెందిన దివ్యారెడ్డి రూ.1.50 కోట్లు ఇచ్చినట్టు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదైంది. రోహిణీరెడ్డి రూ.3.18కోట్లు, మంజు రూ.1కోటి, ప్రియదర్శిని రూ.2.90కోట్లు, శ్వేత రూ.2కోట్లు, వాణి నుంచి రూ.1కోటి వరకూ నగదు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌గా తీసుకున్నట్టు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టడీలోనూ శిల్పాచౌదరి పోలీసులకు సహకరించలేదని సమాచారం. ఆమె చెప్పిన 20 మందికి నోటీసులు జారీచేసినా ఎవరూ స్పందించలేదు. ఇద్దరు మహిళలు తాము బినామీలు కాదని బాధితులమంటూ పోలీసు ఉన్నతాధికారికి మౌఖికంగా తెలియజేసినట్టు సమాచారం. ఆ ఇద్దరూ ఫిర్యాదు చేయకపోవటానికి కారణాలేమిటనేది అంతుబట్టని ప్రశ్నగా మారింది. బినామీ పేర్లతో ఉన్న బ్యాంకు ఖాతాలు, లాకర్ల గురించి తెలుసుకున్న పోలీసులు వాటి వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని