logo

AP News: వైకాపా ఎమ్మెల్యేపై తిరుగుబావుటా..

పదేళ్లుగా జెండా మోసిన కార్యకర్తలకు విలువ లేదు. అధికారుల వద్ద గౌరవం లేదు. వాలంటీర్లు మాట వినడం లేదు. అధికారంలో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి. మూడు మండలాలకు చెందిన నాయకులు టికెట్‌ ఇవ్వొద్దంటే..

Updated : 29 Dec 2021 10:54 IST


మాట్లాడుతున్న ఎంపీపీ శారదాకుమారి

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: పదేళ్లుగా జెండా మోసిన కార్యకర్తలకు విలువ లేదు. అధికారుల వద్ద గౌరవం లేదు. వాలంటీర్లు మాట వినడం లేదు. అధికారంలో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి. మూడు మండలాలకు చెందిన నాయకులు టికెట్‌ ఇవ్వొద్దంటే.. ఎస్‌.రాయవరం మండలం నుంచి మనమంతా అండగా నిలిచి గొల్ల బాబూరావును ఎమ్మెల్యేగా గెలిపించాం. ఆయన మనకిస్తున్న విలువ ఏదీ?’ అంటూ పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బంగారమ్మపాలెంలో ఎంపీపీ శారదాకుమారి వర్గానికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు మంగళవారం సమావేశమై ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఎంపీపీ శారదాకుమారి ప్రసంగిస్తూ.. ‘13 ఏళ్లుగా ఎమ్మెల్యేగా చేసినా మంత్రి పదవి రాలేదంటున్నారు. మా ఆయన 21 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికీ తగిన గుర్తింపు రాలేదు. ఇకపై కూడా రాకుండా చేయాలని చూస్తున్నారు. మా గోడు ఎవరికి చెప్పుకోవాల’ని కంటతడి పెట్టారు. ఎమ్మెల్యేలు వస్తుంటారు.. పోతుంటారు. స్థానికంగా పేదలకు అండగా ఉంటూ పార్టీలోనే కొనసాగుతూ గ్రామస్థాయిలో మరింత బలోపేతం అయ్యేలా కృషి చేస్తామన్నారు. ఎంపీపీ భర్త బొలిశెట్టి గోవిందరావు మాట్లాడుతూ.. కులం, డబ్బుకు ఎమ్మెల్యే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తెదేపా నుంచి వచ్చిన వారికి, బాబూరావు ఓడిపోతారని పందెం కాసిన వారికి ప్రాధాన్యం ఇస్తూ.. ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నాయకులను చులకనగా చూస్తున్నారని ఆరోపించారు. ఇకపై తాను ఎమ్మెల్యే ముఖం చూడనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఒత్తిడితో తిమ్మాపురం పంచాయతీ రికార్డులను డీఎల్‌పీవో తీసుకువెళ్లడం ఏంటని ప్రశ్నించారు. సర్పంచుల చెక్‌ పవర్‌ రద్దు చేయాలని చూస్తున్న ఎమ్మెల్యే మనకు అవసరం లేదన్నారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి, మండల పరిషత్తు కోఆప్షన్‌ సభ్యులు శ్రీనురాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని