logo

Hyderabad News:డ్రంకన్‌ డ్రైవ్‌లో చిక్కి.. బైక్‌కు నిప్పంటించుకుని

డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్న నాంపల్లి ట్రాఫిక్‌ పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. పరీక్షల్లో పట్టుబడిన ఓ వాహనదారుడు సహనం కోల్పోయి వారి ముందే తన ద్విచక్ర వాహనానికి నిప్పంటించి పోలీసులతో వాదనకు

Updated : 04 Jan 2022 07:40 IST

మంటలపై నీళ్లు చల్లుతున్న స్థానికులు

నాంపల్లి, న్యూస్‌టుడే: డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్న నాంపల్లి ట్రాఫిక్‌ పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. పరీక్షల్లో పట్టుబడిన ఓ వాహనదారుడు సహనం కోల్పోయి వారి ముందే తన ద్విచక్ర వాహనానికి నిప్పంటించి పోలీసులతో వాదనకు దిగాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన నాంపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నాంపల్లి ట్రాఫిక్‌ పోలీసులు ఆదివారం రాత్రి రైల్వేస్టేషన్‌ ఎదురుగా డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏక్‌మినార్‌ చౌరస్తా నుంచి నాంపల్లి రైల్వేస్టేషన్‌ వైపునకు ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి రావడాన్ని గుర్తించి చెక్‌పోస్ట్‌ వద్ద నిలువరించి బలవంతంగా డ్రంకన్‌డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించారు. అతడు మత్తులో ఉన్నట్లు నిర్ధారించడంతో పాటు బైక్‌ తాలూకు దస్తావేజులు కూడా చూపమని కోరారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఆ వ్యక్తి సహనం కోల్పోయి పోలీసులతోనే వాదనకు దిగాడు. ఆవేశంతో పోలీసుల ముందే లైటర్‌ వెలిగించి తన బైక్‌ పెట్రోల్‌ ట్యాంక్‌లో విసిరేశాడు. ఒక్కసారిగా బైక్‌కి మంటలంటుకున్నాయి. పోలీసులు వెంటనే అప్రమత్తమై స్థానికుల సహాయంతో నీరు చల్లి మంటలను ఆర్పివేశారు. అప్పటికే బైక్‌ పాక్షికంగా దగ్ధమైంది. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని నాంపల్లి ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొనగా, లాఅండ్‌ఆర్డర్‌ పోలీసులు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని  చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని