logo

TS News: మూడేళ్లుగా మంచంపైనే..దిక్కుతోచని స్థితిలో కుటుంబం

నిరుపేద కుటుంబం.. ఇంటి యజమాని ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తూ.. జీవనం కొనసాగించేవారు. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఆనందంగా గడిపేవారు. మూడేళ్ల కిందట విధి వక్రీకరించి.. ఓ రోజు ఆయన ప్రమాదానికి గురయ్యారు.

Updated : 18 Jan 2022 08:11 IST

ఆదుకోవాలని వేడుకుంటున్న సంపత్‌ కుటుంబ సభ్యులు

పెద్దవంగర, తొర్రూరుటౌన్‌, న్యూస్‌టుడే: నిరుపేద కుటుంబం.. ఇంటి యజమాని ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తూ.. జీవనం కొనసాగించేవారు. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఆనందంగా గడిపేవారు. మూడేళ్ల కిందట విధి వక్రీకరించి.. ఓ రోజు ఆయన ప్రమాదానికి గురయ్యారు. నాటి నుంచి మంచానికే పరిమితమయ్యారు. ఇద్దరు పిల్లలను, ఆయనను సాకడానికి భార్య చిన్న చిన్న కూలీ పనులు చేస్తూ నెట్టుకొస్తోంది.

ప్రమాదవశాత్తు కిందపడి...

పెద్దవంగరకు చెందిన ముప్పై ఏళ్ల గాజరబోయిన సంపత్‌కు భార్య సరిత, ఏడేళ్ల కుమారుడు నిఖిల్‌, అయిదేళ్ల కుమార్తె లాస్య ఉన్నారు. గ్రామంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆయనకు ఇల్లు తప్పా ఎలాంటి ఆస్తులు లేవు. కష్టపడితేనే నాలుగు ముద్దలు నోట్లోకిపోయేది. ఓ రోజు ఇంటిపైన పడుకున్న సంపత్‌ ప్రమాదవశాత్తు కిందపడడంతో వెన్నుముక విరిగింది. చికిత్స నిమిత్తం ముందుగా వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం స్థానికుల సహాయంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌ దవాఖానాలో శస్త్రచికిత్స చేసినా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. నడుము నుంచి పాదాల వరకు స్పర్శలేక చచ్చుపడ్డాయి. మంచానికే పరిమితమయ్యారు. ఫిజియోథెరఫీ చేయిస్తే కోలుకోవచ్చని వైద్యులు సూచించారు. ప్రారంభంలో ఒక నెల ఫిజియోథెరఫీ చేయిస్తే రూ.50 వేల వరకు ఖర్చు అయింది. ఆ తర్వాత డబ్బులు లేక నిలిపివేశారు. మలవిసర్జన సంచి, ప్యాంపర్స్‌, మందులకుగాను నెలకు రూ.5 వేలు, వివిధ ఆరోగ్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌ తీసుకెళ్లడానికి రవాణా ఖర్చులు రూ.5 వేలు అవుతున్నాయి. ఆయన భార్య కూలీకి వెళ్తున్నా.. కుటుంబాన్ని పోషించలేని దుస్థితి నెలకొంది. ఎన్నో సార్లు పస్తులుంటున్నారు.


పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం..
- సరిత, సంపత్‌ భార్య

కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుందామనుకుంటే నా కుడి చెయ్యి విరిగింది. బలమైన పనులు చేయలేక పిల్లలను పస్తులు ఉంచలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. నా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు వైద్య ఖర్చులకు రూ.5 లక్షల అప్పు అయ్యింది. నా భర్త వైద్యానికి, పిల్లల భవిష్యత్తుకు సాయం చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని