logo

Suicide: ఆన్‌లైన్‌లో అప్పు.. తీర్చలేక అవమానంగా భావించి ఆత్మహత్య

ఆన్‌లైన్‌లో యాప్‌ ద్వారా తీసుకున్న అప్పు చెల్లించలేదని అవమానంగా భావించి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్‌ జిల్లా ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 30 Jan 2022 08:51 IST


సింగటి రమేష్‌

ఉప్పల్‌, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌లో యాప్‌ ద్వారా తీసుకున్న అప్పు చెల్లించలేదని అవమానంగా భావించి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్‌ జిల్లా ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండకు చెందిన సింగటి రమేష్‌(24) ఎనిమిది నెలలుగా ఉప్పల్‌లోని విజయపురికాలనీలో ఇద్దరు మిత్రులతో కలిసి అద్దెకుంటున్నాడు. ఆన్‌లైన్‌లో గణితం బోధిస్తున్నాడు. తన అవసరానికి ఓ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రూ.5వేలు అప్పు తీసుకున్నాడు. సకాలంలో  చెల్లించలేదని ఇటీవల యాప్‌ నిర్వాహకులు బంధుమిత్రుల ఫోన్లకు విషయాన్ని చేరవేశారు. అవమానంగా భావించి శుక్రవారం రాత్రి గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు టవల్‌తో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా గదికి వచ్చిన మిత్రులు చూడగా లోపల నుంచి గడియ పెట్టి ఉంది. తొలగించి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మిత్రులు రమేష్‌ తండ్రి సుధాకర్‌, సోదరుడు హరీశ్‌, ఉప్పల్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు బంధుమిత్రుల నుంచి వివరాలు సేకరించారు. ఆన్‌లైన్‌ అప్పు తప్ప ఇతర ఏ విధమైన ఇబ్బందులు లేవని వారు పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసుకొని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని