logo

Hyderabad News: హుస్సేన్‌ సాగర్‌ తీరాన మరో ఉద్యానవనం

హుస్సేన్‌ సాగర్‌ చెంత నెక్లెస్‌ రోడ్డులో ఇరవై ఎకరాల్లో ఎకో పార్కును హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ సిద్ధం చేస్తోంది. ఇందులో ఉదయం నడకకు వెళ్లే వారి కోసం ట్రాక్‌ల ఏర్పాటుతో పాటు అరుదైన మొక్కల జాతులను పెంచనున్నారు.

Updated : 01 Feb 2022 08:34 IST

రూ.15 కోట్లతో అభివృద్ధి చేస్తున్న హెచ్‌ఎండీఏ


సాగర్‌ జలాలపైకి పర్యాటకులు వెళ్లేలా నిర్మిస్తున్న వంతెన

ఈనాడు, హైదరాబాద్‌: హుస్సేన్‌ సాగర్‌ చెంత నెక్లెస్‌ రోడ్డులో ఇరవై ఎకరాల్లో ఎకో పార్కును హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ సిద్ధం చేస్తోంది. ఇందులో ఉదయం నడకకు వెళ్లే వారి కోసం ట్రాక్‌ల ఏర్పాటుతో పాటు అరుదైన మొక్కల జాతులను పెంచనున్నారు. ప్రస్తుతం ఆ స్థలంలో ఉన్న చెట్ల జాతులకు ఎలాంటి హాని లేకుండానే రూ.15 కోట్ల వ్యయంతో కొత్తగా పార్కును అభివృద్ధి చేస్తున్నామని అధికారులు తెలిపారు. ట్యాంక్‌బండ్‌ లేదా నెక్లెస్‌ రోడ్డుపై నిల్చుని హుస్సేన్‌ సాగర్‌ను చూడటం వేరు.. పడవలో ప్రయాణం చేస్తే మరో అనుభూతి ఉంటుంది. అలాంటి వెసులుబాటే ఎకో పార్కులో కల్పించనున్నారు. ఇక్కడ ‘యూ’ ఆకారంలో ఒక వంతెన సాగర్‌పైన నిర్మించనున్నారు. దానిపై నడుచుకుంటూ వెళుతూ కింద ఉన్న సాగర్‌ను చూడొచ్చు. ఈ వంతెనతో సాగర్‌పై నిల్చున్నామన్న అనుభూతి పర్యాటకులకు కలుగుతుందని అధికారులు వివరించారు. ఆయుర్వేదంలో కీలకమైన ఔషధ మొక్కలు పెంచడానికి ప్రత్యేక స్థలం కేటాయిస్తున్నారు. నెక్లెస్‌ రోడ్డులో జలవిహార్‌ తర్వాత పీవీ ఘాట్‌ మధ్యన ఉన్న స్థలంలో ఈ కొత్త ఉద్యానం రానుంది. ప్రస్తుతం అక్కడి పిచ్చి మొక్కలు తొలగించి చదును చేసి పార్కును నిర్మిస్తున్నారు. విలువైన మొక్కలకు అలానే ఉంచుతూ కొత్త వాటిని నాటుతున్నారు. నెక్లెస్‌ రోడ్డుకు వచ్చే పర్యాటకులు ఇక్కడ కొంత సమయం సేద తీరేలా పచ్చదనం, ఇతర సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని