logo

Hyderabad News: హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పర్యాటక వసతి

నగరంలోని రైల్వే స్టేషన్లకు వందేళ్లు దాటిన చరిత్ర ఉంది. ఆ చరిత్ర చెక్కు చెదరకుండా వాటిని అభివృద్ధి చేయడం రైల్వే విభాగం కర్తవ్యంగా మారింది.

Published : 09 Feb 2022 09:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలోని రైల్వే స్టేషన్లకు వందేళ్లు దాటిన చరిత్ర ఉంది. ఆ చరిత్ర చెక్కు చెదరకుండా వాటిని అభివృద్ధి చేయడం రైల్వే విభాగం కర్తవ్యంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో స్టేషన్ల అభివృద్ధికి రూ.325 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పట్టాలెక్కనుంది.

మార్గం సుగమం..

హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌ ముందు రిజర్వేషన్‌ కాంప్లెక్స్‌ను గతంలోనే నిర్మించారు. ఈ భవనంపై మరో 4 అంతస్తులు నిర్మిస్తే ఇక్కడ పర్యాటక వసతి.. కార్యాలయాల ఏర్పాటు, హోటళ్లు, షాపింగ్‌ కాంప్లెక్సు సాధ్యమవుతుంది. ఇందుకు కేంద్ర పర్యాటక శాఖ సహకరించనుంది. ఇప్పటికే రైల్వేతో కలిసి సంయుక్త సర్వే చేసి.. కల్పించాల్సిన సౌకర్యాలపై నివేదిక సిద్ధం చేశారు. అయితే ఇండియన్‌ రైల్వే స్టేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎస్‌డీసీ) ఈ కార్యక్రమాన్ని పీపీపీ పద్ధతిలో చేపట్టాలని భావించింది.

ఇంతలో కార్పొరేషన్‌ కథ ముగియడంతో దక్షిణ మధ్య రైల్వేనే ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు స్టేషన్లకు సంబంధించి రూ.189 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించింది. మిగిలిన రూ.136 కోట్లు ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి మార్గం సుగమమైందని అధికారులు చెబుతున్నారు.

చారిత్రక ప్రాంతం నుంచి..

నగరం నడిబొడ్డున ఉన్న ఈ చారిత్రక స్టేషన్లో పర్యాటక ఆతిథ్యం ఇవ్వాలని ద.మ. రైల్వే గతంలోనే భావించి, అప్పట్లోనే రూ.23 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.10.65 కోట్లతో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయగా, గత ఏడాది రూ.2.27 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే ఇక్కడ రిజర్వేషన్‌ కాంప్లెక్స్‌ ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలో స్టేషన్ల అభివృద్ధికి కేటాయించిన మొత్తం రూ.325 కోట్లలో.. మిగిలిన రూ.136 కోట్లతో పర్యాటక వసతి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని