logo

పెళ్లిరోజే పెను విషాదం.. జలపాతంలో కుమారుడిని రక్షించబోయి తండ్రి మృతి

విహార యాత్ర ఆ ఇంట తీరని విషాదాన్ని మిగిల్చింది. పెళ్లిరోజు కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపేందుకు జలపాతం వద్దకు వెళ్లి అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఇంటి యజమాని మృత్యువాత పడటం ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నీటిలో కొట్టుకుపోతున్న కుమారుడిని

Updated : 10 Feb 2022 13:20 IST


విహారయాత్రకు వెళ్తూ కారులో తీసుకున్న సెల్ఫీ

మోతుగూడెం(తూర్పు గోదావరి), న్యూస్‌టుడే: విహార యాత్ర ఆ ఇంట తీరని విషాదాన్ని మిగిల్చింది. పెళ్లిరోజు కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపేందుకు జలపాతం వద్దకు వెళ్లి అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఇంటి యజమాని మృత్యువాత పడటం ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నీటిలో కొట్టుకుపోతున్న కుమారుడిని రక్షించుకొన్న తండ్రి తాను మాత్రం మృత్యువు నుంచి బయట పడలేకపోయారు. మోతుగూడెం వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన కక్కిరాల పురుషోత్తం మృతి చెందారు. ఆయన అశ్వారావుపేటలో పెట్రోల్‌ బంకుతోపాటు, పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అశ్వారావుపేట మండలం నారాయణపురానికి చెందిన సంతోషిణిని 13 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి 12, 10 ఏళ్ల వయసున్న దీలీప్‌, దీపక్‌ కుమారులు. బుధవారం ఆ దంపతుల పెళ్లిరోజు కావడంతో కుటుంబ సమేతంగా చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని జలపాతం వద్దకు విహారానికి వెళ్లారు. వారంతా జలపాతం కింద తడుస్తూ ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో పెద్ద కుమారుడు నీటి ప్రవాహంలో పడి మునిగి పోతున్నాడు. పురుషోత్తం ప్రవాహంలోకి దిగి పైన ఉన్న భార్యకు కుమారుడ్ని అందించి కాపాడాడు. ఈ క్రమంలో తాను నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ లోయలో పడిపోయాడు. కళ్లెదుటే పురుషోత్తం నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండటాన్ని చూసిన భార్య, కుమారులు పెద్ద పెట్టున ఆర్తనాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు రెండు గంటలపాటు శ్రమించి లోయలో పడి విగతజీవిగా మారిన పురుషోత్తం మృతదేహాన్ని పైకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసిన మోతుగూడెం ఎస్సై సత్తిబాబు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చింతూరు ఆసుపత్రికి తరలించారు. అందరితో కలివిడిగా నవ్వుతూ మాట్లాడే పురుషోత్తం మృతితో దమ్మపేట, అశ్వారావుపేటలో విషాదం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని