logo

Crime News: మియాపూర్‌లో తయారీ.. ఏపీలో చలామణి

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ నోట్లు తయారుచేసి మారుస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈనెల1న హస్తినాపురంకాలనీలో జరిగిన గొలుసు చోరీ కేసులో అదుపులోకి తీసుకున్న పేరం వెంకటశేషయ్య ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.40,000 నగదు పరిశీలించగా

Updated : 11 Feb 2022 08:08 IST

‘గొలుసు’ లాగితే.. నకిలీ నోట్లు బయటపడ్డాయి

అరెస్టయిన నిందితులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో నకిలీ నోట్లు తయారుచేసి మారుస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈనెల 1న హస్తినాపురంకాలనీలో జరిగిన గొలుసు చోరీ కేసులో అదుపులోకి తీసుకున్న పేరం వెంకటశేషయ్య ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.40,000 నగదు పరిశీలించగా నకిలీ నోట్లుగా తేలాయి. వాటి ఆధారంగా ఎల్బీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.అశోక్‌రెడ్డి బృందం దర్యాప్తు చేపట్టి నకిలీ కరెన్సీ ముఠా బండారం బట్టబయలు చేశారు. ఓగిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి(22), కోడూరి శివగణేష్‌(26), కొవ్వూరి శ్రీనివాసరెడ్డి(51), కర్రి నాగేంద్రసుధా మాదవరెడ్డి(45), సోరంపూడి శ్రీనివాస్‌(44), పిల్లి రామకృష్ణ(32), తోట సంతోష్‌కుమార్‌(37), పేరం వెంకటశేషయ్య (43)లను అరెస్ట్‌ చేశారు. ఏ3, ఏ4 నాగిరెడ్డి, మస్తాన్‌ కోసం గాలిస్తున్నారు. చిక్కన నిందితుల నుంచి రూ.100, 200, 500ల నకిలీ నోట్లు(రూ.3.22లక్షలు), ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎల్బీనగర్‌ రాచకొండ కమిషనరేట్‌ క్యాంపు కార్యాలయంలో ఎల్బీనగర్‌ ఏసీపీ పి.శ్రీధర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు వి.అశోక్‌రెడ్డి, బి.ఉపేందర్‌తో కలిసి సీపీ మహేష్‌భగవత్‌ వివరాలు వెల్లడించారు.

కలర్‌ జిరాక్స్‌.. పత్లా కాగితం

నకిలీ కరెన్సీ ముఠా నేత ఓగిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సొంతూరు. బంధువు శ్రీనివాసరెడ్డితో కలిసి నకిలీ నోట్లు ముద్రించి చలామణీ చేశాడు. గతేడాది జైలుకెళ్లొచ్చారు. బయటకురాగానే తూగో జిల్లా కొడూరి శివగణేష్‌, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కర్రి నాగేంద్రసుధా మాదవరెడ్డి, సోరంపూడి శ్రీనివాస్‌, మియాపూర్‌వాసి తోట సంతోష్‌కుమార్‌, నెల్లూరు జిల్లాపేరం వెంకటశేషయ్య, నాగిరెడ్డి, మస్తాన్‌లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. మియాపూర్‌ సంతోష్‌కుమార్‌ ఇంట్లోనే ప్రింటర్లు, రంగులు, తదితర వస్తువులు, పత్లా కాగితాలతో రూ.100, 200, 500 కలర్‌ జిరాక్సుతో నకిలీనోట్ల తయారీ ప్రారంభించారు. రూ.50,000 అసలు నగదు చెల్లించినవారికి రూ.లక్ష నకిలీవి ఇచ్చేవారు. అధికశాతం దళారులు ఏపీలో చలామణీ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. దొంగ ఇంట్లో దొరికిన నకిలీనోట్ల ఆధారంగా ముఠాను అరెస్ట్‌ చేసిన ఎల్బీనగర్‌ ఇన్‌స్పెక్టర్లు అశోక్‌రెడ్డి, ఉపేందర్‌రావు, ఎస్సైలు, ఇతర సిబ్బందిని  సీపీ అభినందించి రివార్డులు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని