logo

Andhra News: నన్ను పదవి నుంచి తప్పించేందుకు చూసే కళ్లు ఎన్నో

‘నన్ను ఛైర్మన్‌గా డిస్మిస్‌ చేయడానికి చాలా కళ్లు ఎదురు చూస్తున్నాయి. దేవుడు దయ ఉన్నంత వరకు పాలనలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రయత్నిస్తా’ అని సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి

Updated : 12 Feb 2022 10:30 IST

‘సింహాచలం’ ఛైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు

మాట్లాడుతున్న అశోక్‌ గజపతిరాజు

సింహాచలం, న్యూస్‌టుడే: ‘నన్ను ఛైర్మన్‌గా డిస్మిస్‌ చేయడానికి చాలా కళ్లు ఎదురు చూస్తున్నాయి. దేవుడు దయ ఉన్నంత వరకు పాలనలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రయత్నిస్తా’ అని సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు వ్యాఖ్యానించారు. ఆలయ ధర్మకర్తల మండలి సమావేశం శుక్రవారం జరగాల్సి ఉంది. 14 మందికి గాను తగినంత మంది సభ్యులు రాకపోవడంతో వాయిదా పడింది. ఛైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు, సభ్యుడు నల్లమిల్లి కృష్ణారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు ఎస్‌.ఎన్‌.రత్నం,  విజయ, మురళీకృష్ణ మినహా మిగిలిన వారు హాజరు కాకపోవడంతో ఈవో సూర్యకళ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొందరు సభ్యులు ఉద్దేశపూర్వకంగా  గైర్హాజరైనట్లు తెలుస్తోంది. మరికొందరు శుభకార్యాలు, వ్యక్తిగత పనుల నేపథ్యంలో రాలేకపోయారు. త్వరలోనే మళ్లీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

భక్తులపై భారం మోపడం సరికాదు: ‘నా అలవాటు ప్రకారం సమావేశం నిర్వహణకు మూడు తేదీలు సూచించాలని ఈవోకు తెలియజేశా. ఆ మేరకు ఈ నెల 7, 9, 11 తేదీలు నాకు సూచించారు. నేను 11 ఎంపిక చేసుకున్నా.  తేదీల విషయంలో బోర్డు, అధికారుల మధ్య సమన్వయం లేనట్లు కనిపిస్తోంది. కొవిడ్‌ ముందు అప్పన్న ఆలయ ఆదాయం ఏడాదికి రూ.50కోట్లు పైన ఉండేది. కొవిడ్‌ తర్వాత రూ.29కోట్లకు తగ్గింది. ఈ ఆదాయం ఆలయ నిర్వహణకు సరిపోతుంది.  ప్రాధాన్యాల ఆధారంగా ఖర్చు చేస్తే సమస్య తలెత్తదు.  డీజిల్‌ ఖర్చుల నుంచి ఉపశమనం పొందేందుకు విద్యుత్తు బస్సులను ప్రవేశపెడితే ఎలా ఉంటుందని ఆలోచన చేశాం. సింహగిరిపై పార్కింగ్‌ రుసుము పేరిట భక్తులను వేధించడం మంచిది కాదు. సీతమ్మధారలో దేవస్థానం స్థలంలో నిర్మించిన ఆంజనేయస్వామి విగ్రహం దేవస్థానానికే చెందుతుంది. సర్వే సంఖ్యలు కూడా మాయ చేసి భూములు కబ్జా చేస్తున్నారు’ అని విలేకరులతో అశోక్‌గజపతి రాజు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని