logo

Medaram Jathara: జయహో సమ్మక్క

సమ్మక్క.. ధీరవనిత. శౌర్యపరాక్రమాలకు ప్రతిరూపం.. మహిమాన్వితమైన తల్లి. సబ్బండ వర్గాల కొంగుబంగారం.. కోట్లాది మందికి ఆశీస్సులు ఇవ్వడానికి రెండేళ్లకోసారి    జనబాహుళ్యంలోకి వచ్చే పెద్దమ్మ గురువారం భక్తుల

Updated : 17 Feb 2022 12:15 IST

నేడుఆగమనం!

న్యూస్‌టుడే, గోవిందరావుపేట

సమ్మక్క.. ధీరవనిత. శౌర్యపరాక్రమాలకు ప్రతిరూపం.. మహిమాన్వితమైన తల్లి. సబ్బండ వర్గాల కొంగుబంగారం.. కోట్లాది మందికి ఆశీస్సులు ఇవ్వడానికి రెండేళ్లకోసారి    జనబాహుళ్యంలోకి వచ్చే పెద్దమ్మ గురువారం భక్తుల జయజయధ్వానాల నడుమ గద్దెపై కొలువుదీరనుంది. నిండు జాతర ఆవిష్కృతమవుతుంది.

సమ్మక్క రాక ఆద్యంతం భక్తిపారవశ్యంతో కూడి ఉంటుంది. గురువారం ఉదయమే పూజారులు మేడారంలోని సమ్మక్క మందిరానికి వెళ్తారు. పూజా సామగ్రిని శుభ్రం చేసి.. ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత సమీప అడవికి వెళ్లి కంకవనాన్ని తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. అనంతరం చిలకలగుట్టకు చేరుకుంటారు. సాయంత్రం జిల్లా యంత్రాంగం వెళ్తుంది. చిలకలగుట్ట నుంచి గద్దెలకు వెళ్లే మార్గం భక్తజనులతో కిక్కిరిసిపోతుంది. దారి పొడవునా మహిళలు రంగవల్లికలు వేస్తారు. శివసత్తులు శివాలెత్తుతారు.. భక్తజనులు ఆనంద పారవశ్యంలో నృత్యాలు చేస్తుంటారు. ఎదురుకోళ్లు ఎగిసిపడుతుంటాయి.. జయహో సమ్మక్క.. నామస్మరణతో మేడారం మారుమోగిపోతుంది.

సముద్రపు గవ్వలు.. అందాల అల్లికలు  

భూపాలపల్లి టౌన్‌: సముద్రంలో దొరికే గవ్వలతో తయారు చేసిన గృహోపకరణాలు చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దండలుగా తయారు చేశారు. అద్దాలకు వాటిని అద్దారు. భక్తులు వాటిని కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకెళ్తున్నారు.

గిరిజనం.. భక్తి పూనకం

శివనగర్‌: కోయ గిరిజనులు భక్తి పరవశంతో ఊగిపోయారు. బుధవారం అమ్మవార్లను దర్శించుకోవడానికి సమ్మక్క, సారలమ్మ రూపాలైన వెదురుకు ఎర్రవస్త్రాలను చుట్టిన కర్రలను చేతుల్లో పట్టుకొని నృత్యాలు చేస్తూ తరలివెళ్లారు. లక్షలాది మంది భక్తజనం మధ్య గిరిజనుల భక్తిపరవశ నృత్యాలు అలరించాయి.

కంకవనంతో మొక్కు

భూపాలపల్లి టౌన్‌: సమ్మక్క-సారలమ్మలకు కంక చెట్లు అంటే ఎంతో ప్రీతిపాత్రం. భక్తులు కంక వనంతో బెల్లం తీసుకెళ్లి అమ్మవార్ల గద్దెలకు సమర్పిస్తున్నారు. దర్శనం తర్వాత ఒకటి రెండు చెట్లను ఇంటికి తీసుకెళ్తారు. జాతర చుట్టు పక్కల ప్రాంతాలలో ఎక్కడ చూసినా కంకవనం కనిపిస్తోంది.

మేడారం నుంచి ప్రత్యక్ష ప్రసారం

భూపాలపల్లి టౌన్‌: మేడారం మహాజాతర ఖ్యాతి ఖండంతరాలు దాటింది. అందరి చూపు వనం వైపే. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇందులో భాగంగానే ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వివిధ టీవీ ఛానల్స్‌ వారు లైవ్‌ వాహనాలు తెచ్చుకున్నారు. వాటన్నింటినీ ఒకే దగ్గర పార్కింగ్‌ చేశారు. యావత్‌ ప్రపంచానికి జాతర విశేషాలను చూపిస్తున్నారు.

ప్రతిక్షణం ఉత్కంఠ

చిలకలగుట్టపై నుంచి పూజారులు కుంకుమ భరిణను తీసుకొని కిందికి రాగానే పోలీసు ఉన్నతాధికారులు సమ్మక్క ఆగమనాన్ని తెలిపేందుకు సంకేతంగా గాలిలోకి కాల్పులు జరుపుతారు. ఇక ఆ క్షణం నుంచి సమ్మక్క గద్దెపై కొలువుదీరే వరకు ప్రతి క్షణం ఉత్కంఠను తలపిస్తోంది. భక్తజనులు ఉప్పొంగిన సంతోషంలో ఆనంద తాండవమే చేస్తారు. తల్లికి స్వాగతం పలుకుతూ అక్షింతలు, పువ్వులు వెదజల్లుతారు. రోప్‌ పార్టీ రక్షణ వలయంలో వచ్చే పూజారులను తమ చేతులతో తాకి తరించిపోవాలని భక్తులు చూస్తుంటారు.

ఎస్పీకి రెండోసారి అవకాశం

మేడారం జాతరలో ప్రధాన ఘట్టం సమ్మక్క తల్లి గద్దెకు చేరడం. చిలకలగుట్టపై నుంచి పెద్దమ్మ ఆగమనాన్ని తెలిపేందుకు సంకేతంగా జిల్లా పోలీస్‌ బాస్‌ గాలిలోకి కాల్పులు జరుపుతారు. 2020 జాతరలో ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ జి.పాటిల్‌ అమ్మకు ఆహ్వానం పలికారు. ఈసారి కూడా ఆ అవకాశం ఆయనకే దక్కనుంది. రెండుసార్లు ఆహ్వానం పలికిన అరుదైన గౌరవం నలిన్‌ ప్రభాత్‌ తర్వాత సంగ్రామ్‌ సింగ్‌కు లభించనుంది.

న్యాయ సేవా కేంద్రం ప్రారంభం

న్యాయ సేవా కేంద్రం సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.కృష్ణఆదిత్య అన్నారు. బుధవారం మేడారంలో న్యాయ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. వరంగల్‌ న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్‌ నందికొండ నర్సింగరావు, కార్యదర్శి జీవీ మహేష్‌నాథ్‌, ములుగు న్యాయసేవా సంస్థ ఛైర్మన్‌ ఎన్‌.రామచంద్రరావు పాల్గొన్నారు.

- ఏటూరునాగారం

గుర్తుంచుకోండి!!

మహా జాతరలో ఎక్కడ చూసినా జనసందోహమే. చాలా మంది దారితప్పిపోతుంటారు. బృందాలుగా వచ్చిన వారు ఏదో రకమైన జెండాలను గుర్తుగా పెట్టుకుంటారు. ఆ జెండాను ఒకరు పట్టుకొని ముందుగా వెళ్తుండగా, ఆయణ్ని  మిగిలిన వారు అనుసరిస్తుంటారు. ఒక వేళ తప్పిపోతే.. ఆ జెండా ఎక్కడ ఉందో చూసుకొని.. అక్కడికి వెళ్తారు.

- భూపాలపల్లి టౌన్‌

మా బంగారు కొండలు..

అమ్మల దర్శనానికి వచ్చిన దంపతులు తమకు పిల్లలు   కలిగితే వారిని భుజాలపై ఎత్తుకొని దర్శనానికి వస్తామని మొక్కుకుంటారు. వీరితో పాటు పిల్లలు ఎక్కడ తప్పిపోతారేమోనని చంకన ఎక్కించుకొనే వారు కొందరైతే.. మరికొందరు సౌకర్యంగా ఉంటుందని భుజాలపైకి ఎక్కించుకుంటారు. జంపన్నవాగు, గద్దెల ప్రాంగణంలో ఇలాంటి దృశ్యాలు కనిపించాయి.

- గోవిందరావుపేట

రూ.50 కొట్టు.. తోక తొక్కు!

కాజీపేట: అనుకోకుండా అదృష్టం కలిసి వస్తే నక్కతోక తొక్కాడంటారు. చనిపోయిన నక్కతోకను అడవిలో దొరకపట్టుకుని కోయదొరలు జాతరకు తెచ్చి ఇలా సమ్మక్క ఆలయం ముందు పెట్టారు. నక్కతోక తొక్కండి.. అదృష్టవంతులవ్వండని చెబుతుండటంతో ఆసక్తి ఉన్నవారు రూ.50 ఇచ్చి మరీ తోక తొక్కుతున్నారు. నిజంగానే అదృష్టం కలిసివస్తుందో.. లేదో కాలమే చెప్పాలి మరి!  

శిరస్త్రాణం తప్పనిసరి

భూపాలపల్లి టౌన్‌: గద్దెల ప్రాంగణంలో విధులు నిర్వర్తించాలంటే శిరస్త్రారణం తప్పనిసరి. పోలీసులు, వాలంటీర్లు విధిగా ధరించాల్సిందే. లేదంటే బంగారం(బెల్లం ముద్దలు), కొబ్బరికాయలు క్రికెట్‌ బంతుల్లా వచ్చి తలలకు తగులుతాయి. దర్శనానికి వచ్చిన భక్తులు.. తల్లులకు బంగారం సమర్పించడానికి బెల్లం ముద్దలు, కొబ్బరికాయలు గద్దెలపైకి విసురుతుంటారు. విధులు నిర్వహించేవారు రక్షణకు హెల్మెట్లు ధరిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని