logo

Crime News: వలపు బాణమేసి.. అందినంత వలిచేసి!

డబ్బు సంపాదించాలంటే కిడ్నాప్‌లు చేయాలని బలంగా నిర్ణయించుకుని నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో అపహరణలకు పాల్పడుతున్న గుంజపోగు సురేష్‌ నేరచరిత తవ్వేకొద్దీ పోలీసులకు....

Updated : 19 Feb 2022 06:51 IST

కిడ్నాప్‌లతో డబ్బు డిమాండ్‌

ఆ నగదుతో హైవేపై కారులో విన్యాసాలు


సురేష్‌

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, ఆసిఫ్‌నగర్‌: డబ్బు సంపాదించాలంటే కిడ్నాప్‌లు చేయాలని బలంగా నిర్ణయించుకుని నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో అపహరణలకు పాల్పడుతున్న గుంజపోగు సురేష్‌ నేరచరిత తవ్వేకొద్దీ పోలీసులకు కొత్తకొత్త విషయాలు తెలుస్తున్నాయి. డిగ్రీ చదివిన సురేష్‌ ఉద్యోగం రాకపోవడంతో డ్రైవర్‌ వృత్తి ఎంచుకున్నాడు. అత్యంత వేగంగా కార్లు నడపడం, విన్యాసాలు చేస్తూనే నియంత్రించడాన్ని నేర్చుకున్నాడు. డ్రైవర్‌గా సంపాదన సరిపోకపోవడంతో అన్న స్ఫూర్తితో దొంగగా మారాడు. చిన్న చోరీలకే పోలీసులు అరెస్ట్‌ చేయడంతో రెండేళ్ల కిందట స్వస్తి చెప్పి కిడ్నాప్‌ ముఠా ఏర్పాటు చేశాడు. యువకులు, వృత్తి నిపుణులకు వలవేసి రప్పించేందుకు శ్వేత అనే యువతిని నియమించుకున్నాడు. ఆమె వలలో పడి బయటకు వచ్చిన వారిని అనుచరులు జగదీష్‌, కునాల్‌, రోహిత్‌లతో కలిసి అపహరించి డబ్బు డిమాండ్‌ చేసేవాడు. నగదు చేతిలో పడగానే.. అనుచరులకు కొంత పంచి, మిగతా మొత్తంతో ఒంటరిగా కారులో హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు జాయ్‌రైడ్‌ చేసేవాడు. కర్నూలులో పాత స్నేహితులతో రెండు, మూడు రోజులు ఎంజాయ్‌ చేసి హైదరాబాద్‌కు వచ్చేవాడు. ఇప్పటి వరకు ఆరుగురిని కిడ్నాప్‌ చేసిన సురేష్‌ ముఠా.. మరో ముగ్గురిని అపహరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.

భార్య కొనిచ్చిన కారుతో...

కర్నూలు జిల్లాకు చెందిన సురేష్‌.. చిన్నప్పుడే తల్లిదండ్రులు హైదరాబాద్‌కు రావడంతో ఇక్కడికి వచ్చేశాడు. తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు చిన్నచిన్న పనులు చేస్తుండగా.. సురేష్‌ డిగ్రీ వరకూ చదివాడు. ఒక సోదరుడు ఘరానా దొంగగా మారడంతో తానూ అదేబాట పట్టాడు. కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకొని భార్యను కారు కొనివ్వాలని కోరాడు. సినిమా షూటింగ్‌లు, ఇతర అవసరాలకు స్పోర్ట్స్‌ కారు కావాలని చెప్పడంతో తాను పొదుపు చేసుకున్న సొమ్ము ఇచ్చేసింది. ఆ డబ్బుతో ఓ స్పోర్ట్స్‌ కారు కొన్నాడు. ఈ కారులోనే తన గ్యాంగ్‌తో కలిసి కిడ్నాప్‌లు చేసేవాడు. ఇందులోనే భోజనం తిని, నిద్రపోయేవాడు. హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై గంటకు 150 నుంచి 200 కి.మీ. వేగంతో కారు నడిపేవాడు. శ్వేతతో పాటు మరో యువతిని నియమించుకొనేందుకు సంప్రదిస్తుండగా ఆసిఫ్‌నగర్‌ పోలీసులు సురేష్‌ బృందాన్ని అరెస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని