logo

Andhra News: అమరావతి పెళ్లికి ఊరంతా ఏకమై..!

‘అడగందే అమ్మయినా అన్నం పెట్టదు’ అనేది సామెత...అయితే చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన మాదాబత్తుల అమరావతి విషయంలో ఆ ఊరివాళ్లు అడక్కముందే అన్నీ సమకూర్చారు. పదేళ్లగా ఆమెని అక్కున చేర్చుకున్నారు. కల్యాణ ఘడియలు రావడంతో అత్తింటికి వెళ్లేటప్పుడు ఏం పంపాలో

Updated : 19 Feb 2022 14:21 IST

విశాఖ జిల్లా గుండుపాల గ్రామస్థుల ఆదర్శం

‘అడగందే అమ్మయినా అన్నం పెట్టదు’ అనేది సామెత...అయితే చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన మాదాబత్తుల అమరావతి విషయంలో ఆ ఊరివాళ్లు అడక్కముందే అన్నీ సమకూర్చారు. పదేళ్లగా ఆమెని అక్కున చేర్చుకున్నారు. కల్యాణ ఘడియలు రావడంతో అత్తింటికి వెళ్లేటప్పుడు ఏం పంపాలో అవన్నీ ఊళ్లోవాళ్లే సమకూర్చారు. ఆదివారం ఉదయం లింగంపేటలో ‘కల్యాణం’. ఈ వేడుకలో పాల్గొని అక్షింతలు వేసి ఆశీర్వదించేందుకు ఊరంతా బయలుదేరుతున్నారు.
నర్సీపట్నానికి సమీపంలోని గుండుపాల గ్రామానికి చెందిన అమరావతితో విధి చెలగాటమాడింది. ఆమెకు పదేళ్లప్పుడే తల్లీతండ్రి కన్నుమూశారు. ఇప్పుడామె వయసు 20 ఏళ్లు. ఇన్నాళ్లూ ఆమెని చుట్టుపక్కల వారే ఆదరించారు. ఎనిమిదో తరగతి వరకు చదువుకున్న ఆమె మధ్యాహ్నం వేళ స్కూల్లో భోజనం చేసేది. రాత్రి ఆకలయ్యే సమయానికి చుట్టుపక్కల వారే భోజనం పంపేవారు. సిమెంట్‌ ఇటుకలు పేర్చి ఇనుపరేకుల కప్పు కింద నిద్రిస్తూ అందరి ఆడపిల్లల్లానే కలలు కనేది. అవి నిజమయ్యే దారి కనిపించక కలవరపడేది.

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయం అవుతాయంటారు.. విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టులో డ్రైవర్‌గా పనిచేస్తున్న గొలుగొండ మండలం లింగంపేట నివాసి బొద్దిన సురేష్‌ తొలిచూపులోనే అమరావతిపై మనసు పారేసుకున్నాడు. కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. ఆమెకు పెళ్లి కుదరడంతో ఊళ్లో వాళ్లంతా సంతోషించారు. ఉపాధ్యాయుడు రాము ముందుకొచ్చి మన ఊరి ఆడపడుచుకు మనందరం దగ్గరుండి కల్యాణం జరిపిద్దామన్నారు. అందరు మద్దతు తెలిపారు. ఆ తరువాత అన్నీ చకచకా జరిగిపోయాయి. వీధిలోని చేనేత సామాజికవర్గానికి చెందిన మహిళలంతా కలిసి బంగారు చెవి బుట్టలు తయారు చేయించారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కలిసి టేకు మంచం, కార్యదర్శి పరుపు, దిండ్లు, సచివాలయ ఓ మహిళా పోలీసు బీరువా కొన్నారు. ఊళ్లోని ఆటో వాళ్లంతా ఆదివారం పూర్తిగా పెళ్లిపనుల్లోనే ఉండాలని నిర్ణయించారు. కొందరు చీరలు కొన్నారు. కొందరు ఖర్చులకు డబ్బులిచ్చారు.


వారే దేవుళ్లు..
కడుపున పెట్టుకునే అమ్మలేదు. చేయిపట్టుకు నడిపించే నాన్నలేడు. చేనేత కార్మికులైన అమ్మానాన్న వయోభారంతో చనిపోయారు. అప్పుడప్పుడు ఫిట్స్‌ వస్తుండటంతో ఎనిమిదో తరగతి మించి చదువుకోలేకపోయా. చుట్టుపక్కల వారే ఆకలి తీర్చేవారు. అనారోగ్యంగా ఉంటే సపర్యలు చేశారు. విధి చిన్నచూపు చూసినా ఊళ్లో వాళ్లంతా దేవుళ్లలా ఆదుకున్నారు. వారందరి దయతోనే పెళ్లవుతోంది.
- మాదాబత్తుల అమరావతి


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని