logo

Crime News: రూ.36 లక్షలతో ఏటీఎం వాహనం డ్రైవరు పరారు

ఏటీఏం కేంద్రాల్లో డబ్బు నింపేందుకు వినియోగించే వాహనం డ్రైవరు రూ.36 లక్షల నగదుతో ఉడాయించాడు. హైదరాబాద్‌ శివారులోని సూరారం కాలనీలో శనివారం జరిగింది. బేగంపేటకు చెందిన రైటర్స్‌ సంస్థ సిబ్బంది

Updated : 20 Feb 2022 09:53 IST

దుండిగల్‌, నిజాంపేట, న్యూస్‌టుడే: ఏటీఏం కేంద్రాల్లో డబ్బు నింపేందుకు వినియోగించే వాహనం డ్రైవరు రూ.36 లక్షల నగదుతో ఉడాయించాడు. హైదరాబాద్‌ శివారులోని సూరారం కాలనీలో శనివారం జరిగింది. బేగంపేటకు చెందిన రైటర్స్‌ సంస్థ సిబ్బంది నగరంలోని పలు ఏటీఎం కేంద్రాల్లో నగదు జమ చేస్తుంటారు. మధ్యాహ్నం రూ.64 లక్షల నగదుతో కస్టోడియన్లు నితిన్‌, రంజిత్‌, గన్‌మెన్‌ బాబు, డ్రైవర్‌ సాగర్‌(25) టీఎన్‌09 సీవై 3354 వాహనంలో సంస్థ కార్యాలయం నుంచి బయలుదేరారు. మొదట జీడిమెట్లలోని యాక్సిస్‌ బ్యాంకులో రూ.13 లక్షలు జమచేశారు. అనంతరం సూరారంకాలనీ సాయబాబానగర్‌లోని మరో యాక్సిస్‌ బ్యాంకు ఏటీఏం కేంద్రానికి మధ్యాహ్నం 3.30 గంటలకు వచ్చారు. రూ.15 లక్షలను జమచేయడానికి ఇద్దరు కస్టోడియన్లు లోపలికి వెళ్లారు. గన్‌మెన్‌ బాబు బయట పహారా కాస్తున్నారు. వాహన డ్రైవర్‌ బండిని యూటర్న్‌ చేసుకొస్తానని చెప్పి వెళ్లాడు. కస్టోడియన్లు పని ముగించుకొని ఎంతసేపు వేచి చూసినా వాహనం రాకపోవడంతో డ్రైవర్‌ చరవాణి నంబరుకు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాప్‌ వచ్చింది. వారు దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాహనంలో  రూ.36 లక్షలు ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు.  డ్రైవర్‌ సాగర్‌ తీసుకెళ్లిన వాహనం నర్సాపూర్‌ అటవీ రోడ్డులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే అందులోని నగదును తీసుకొని అతను ఉడాయించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సీసీ కెమెరాలు ఉండని అటవీ ప్రదేశంలో వాహనాన్ని వదిలి వెళ్లడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది.  నిందితుడి స్వస్థలం సిరిసిల్లగా తెలుస్తోంది. 20 రోజుల క్రితమే సంస్థలో పనికి కుదిరినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని