logo

Telangana News: రైతుల ఖాతాల్లో రూ.లక్షల్లో జమ

ఆ రైతుల ఖాతాల్లో డబ్బులు ఎక్కడి నుంచి జమ అయ్యాయో తెలియదు. ఎంత జమ అయ్యాయో కూడా తెలియదు. ఆదివాసీ రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని

Updated : 20 Feb 2022 08:49 IST

రూ. 1.28 కోట్లు డ్రా చేసిన సీఎస్‌పీ నిర్వాహకుడు

ఆదిలాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : ఆ రైతుల ఖాతాల్లో డబ్బులు ఎక్కడి నుంచి జమ అయ్యాయో తెలియదు. ఎంత జమ అయ్యాయో కూడా తెలియదు. ఆదివాసీ రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి ఏటీఎంల నుంచి సీఎస్‌పీ నిర్వాహకుడు మాత్రం రూ.1.28 కోట్లు డ్రా చేసిన వైనం ఆదిలాబాద్‌ జిల్లాలో కలకలం రేపింది. తమ బ్రాంచి నుంచి డబ్బులు డ్రా అయిన విషయం తెలిసిన బ్యాంకు అధికారులు రైతుల వద్దకు వెళ్లి రికవరీకి యత్నించడంలో అసలు విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం మామిడిగూడ పంచాయతీ సల్పలగూడ గ్రామ రైతులకు ఆదిలాబాద్‌ పట్టణంలోని బస్టాండ్‌ సమీపంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. అందులోని ఆదివాసీ రైతులు కొడప భీంరావు, మడావి రాంబాయి, కొడప గంగాదేవిల కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల నుంచి రూ.1,28,78,000 డ్రా అయినట్లు అధికారులు గుర్తించారు. ఆ డబ్బుల రికవరీ కోసం చీఫ్‌ మేనేజరు ఎం.వివేక్‌ సిబ్బందితో కలిసి శుక్రవారం రైతుల వద్దకు వెళ్లారు. అంత డబ్బు తాము డ్రా చేయలేదని మామిడిగూడ సీఎస్‌పీ(కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌) నిర్వాహకుడు జటల రమేష్‌ నుంచి విడతల వారీగా మొత్తం రూ.16.20 లక్షలు తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో భీంరావు రూ.5.20 లక్షలు, మడావి రాంబాయి రూ.9.50 లక్షలు, కొడప గంగాదేవి రూ.1.50 లక్షలు సీఎస్‌పీ నుంచి తీసుకున్నట్లుగా చెబుతుండగా.. మిగిలిన రూ.1,12,58,000 సీఎస్‌పీ నిర్వాహకుడు రైతుల పేర డ్రా చేసుకున్నట్లుగా బ్యాంకు మేనేజరు తెలిపారు. ఈ మొత్తం నాలుగు నెలలుగా డ్రా చేయడంతో తాము ఏ ఖాతా నుంచి డబ్బులు డ్రా అవుతున్నాయో తెలుసుకోలేకపోయినట్లు పేర్కొన్నారు. 

రూ.30 లక్షలు రికవరీ 

సీఎస్‌పీ నుంచి ఇప్పటికే రూ.30 లక్షలు రికవరీ చేసిన అధికారులు ఆయన వద్ద ఉన్న రైతుల కిసాన్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఖాతాలను స్తంభింపజేశారు. రైతులు సైతం ఆ డబ్బులు తిరిగి చెల్లించేందుకు అంగీకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని మేనేజర్‌ పేర్కొన్నారు. 

డబ్బుల జమపైనే అనుమానాలు..? 

రైతుల ఖాతాల్లో డబ్బులు ఎక్కడి నుంచి జమ అయ్యాయో.. ఆ డబ్బులు ఎలా డ్రా అయ్యాయో మాత్రం బ్యాంకు అధికారులు చెప్పలేకపోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతులను గుర్తించిన అధికారులు వారి ఖాతాల్లోనూ ఎలాంటి లావాదేవీలు ఆన్‌లైన్‌లో కనిపించకపోవడంతో విస్తుపోతున్నారు. వాస్తవానికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కింద రోజుకు రూ.60 వేల వరకు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఒక్కో రైతు రుణం కింద రూ.2 లక్షల మించి తీసుకోరని అధికారులే చెబుతున్నారు. అలాంటిది అపరిమితంగా క్రెడిట్‌ కార్డుల నుంచి డబ్బులు ఎలా డ్రా అయ్యాయన్నది మిస్టరీగా మారింది. సమగ్రంగా విచారణ జరిపితేగానీ అసలు విషయం బయటపడేలా లేదు. 


నగదు చెల్లించేందుకు అంగీకరించారు 

- ఎం.వివేక్‌, చీఫ్‌ మేనేజరు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు 

రైతుల ఖాతాల్లో జమ అయిన బ్యాంకు నగదు తిరిగి చెల్లించేందుకు వారు అంగీకరించారు. ఈ వ్యవహారంలో సీఎస్‌పీ నిర్వాహకుడి పాత్ర ఉంది. ఆయన నుంచి రూ.30 వేలు రికవరీ చేశాం. మిగిలిన డబ్బులు చెల్లిస్తానని రాత పూర్వక హామీ ఇవ్వడంతో పోలీసు కేసు నమోదు చేయలేదు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని