logo

Telangana News: ఆసుపత్రిలో చూపిస్తానని.. భార్య పేరిట ఆస్తి రిజిస్ట్రేషన్‌

మాయమాటలతో వృద్ధురాలి స్థిరాస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వ్యక్తిపై పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

Updated : 20 Feb 2022 08:58 IST

కట్టంగూరు: మాయమాటలతో వృద్ధురాలి స్థిరాస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వ్యక్తిపై పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కల్మెరకు చెందిన బెల్లి ఎల్లమ్మ (80) జ్వరంతో 20 రోజుల క్రితం బాధపడుతూ, తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది. ఆ సమయంలో ఆమె బంధువు అదే గ్రామానికి చెందిన బెల్లి వీరయ్య ఆసుపత్రిలో చూపిస్తానని కరోనా పరీక్షలు జరిపిస్తానని ఎల్లమ్మతో నమ్మబలికాడు. ఆమె కుటుంబ సభ్యులకు తెలియకుండా కట్టంగూరు తహసీల్‌ కార్యాలయానికి తీసుకెళ్లి, ఎల్లమ్మ పేరుపై ఉన్న 27 గుంటల స్థిరాస్తిని తన భార్య వాణి పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శనివారం తెలిపారు.

నా భర్తను ఎస్సై కొట్టారు: బెల్లి వాణి, వీరయ్య భార్య

మేము బెల్లి ఎల్లమ్మ, ఆమె కుమారుడు యాదయ్యకు డబ్బులిచ్చి 27 గుంటల స్థిరాస్తిని నా పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాము. ఇప్పుడు మనవళ్ల మద్దతుతో మాపై తప్పుడు కేసు పెట్టింది. ఇదే అదనుగా కట్టంగూరు ఎస్సై నాభర్త వీరయ్యను కొట్టారు. వీరయ్య ఆస్వస్థతకు గురి కావడంతో నల్గొండ ప్రభుత్వాసుపత్రితో చికిత్స చేయిస్తున్నాం.

ప్రచారంలో వాస్తవం లేదు: విజయ్‌కుమార్‌, ఎస్సై

అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడని ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెల్లి వీరయ్యను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి, వీరయ్య సోదరుడు, గ్రామ పెద్ద సమక్షంలో వివరాలు తెలుసుకొని పంపించాము తప్పితే ఎవరిపై చేయి చేసుకోలేదని ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపారు. నిఘా నేత్రాల సమక్షంలోనే విచారణ జరిపి పంపించామని, తాను కొట్టినట్లు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని