logo

Andhra News: దొరికిన రూ.5 లక్షలు అప్పగింత

అధిక మొత్తంలో నగదు దొరికితే.. తిరిగి దాని సొంతదారుడికి ఇవ్వాలనుకునే వారు అతి కొద్ది మంది ఉంటారు. తపాలా శాఖ విశ్రాంత ఉద్యోగి కాగిత నర్సింహారావు మాత్రం.. తనకు దొరికిన రూ.5 లక్షల నగదును నిజాయతీగా తిరిగి అప్పగించిన ఘటన గవర్నర్‌పేట

Updated : 22 Feb 2022 09:13 IST

నిజాయతీ చాటుకున్న తపాలా శాఖ విశ్రాంత ఉద్యోగి


నగదును అమరేశ్వరరావుకు అప్పగిస్తున్న నర్సింహారావు (ఎరుపు చొక్కా)

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : అధిక మొత్తంలో నగదు దొరికితే.. తిరిగి దాని సొంతదారుడికి ఇవ్వాలనుకునే వారు అతి కొద్ది మంది ఉంటారు. తపాలా శాఖ విశ్రాంత ఉద్యోగి కాగిత నర్సింహారావు మాత్రం.. తనకు దొరికిన రూ.5 లక్షల నగదును నిజాయతీగా తిరిగి అప్పగించిన ఘటన గవర్నర్‌పేట బకింగ్‌హాంపేట పోస్టాఫీస్‌ వద్ద సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన చదల అమరేశ్వరరావు(61) తపాలా శాఖలో పని చేసి రిటైర్‌ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం కుటుంబ అవసరాల నిమిత్తం గవర్నర్‌పేట బకింగ్‌హాంపేట తపాలా కార్యాలయంలోని తన తఖాతా నుంచి రూ.5లక్షలు విత్‌డ్రా చేసుకుని, బయటకు వచ్చారు. ఇంటికి వెళ్లే క్రమంలో నగదు ఉన్న బ్యాగును, తన వాహనం పక్కన ఉన్న ద్విచక్రవాహనంపై పెట్టారు. ఫోన్‌లో మాట్లాడుతుండగా.. నగదు బ్యాగు ఉంచిన వాహనాన్ని దాని యజమాని తీసుకుని వెళ్లిపోయారు. కొద్ది సేపటి తర్వాత చూసిన అమరేశ్వరరావు.. ద్విచక్రవాహనం కనిపించకపోవటంతో కంగారుపడి, హుటాహుటిన గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.

వెనక్కి వచ్చిన వాహన చోదకుడు: నగదు ఉన్న బ్యాగును తీసుకుని వెళ్లిపోయిన ద్విచక్ర వాహన చోదకుడు తాడిగడప శ్రీనివాస్‌నగర్‌కు చెందిన కాగిత నర్సింహారావు. ఆయన కూడా తపాలా శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన కొద్ది దూరం వెళ్లిన తర్వాత తన ద్విచక్రవాహనంపై గుర్తు తెలియని బ్యాగు ఉండటం గమనించారు. తెరిచి చూడగా, రూ.5లక్షలు కనిపించాయి. వెంటనే తిరిగి తపాలా కార్యాలయానికి వచ్చి అధికారులకు విషయం తెలియజేశారు. ఇంతలో గవర్నర్‌పేట పోలీసులు, చదల అమరేశ్వరరావును తీసుకుని అక్కడకు వచ్చారు. నగదు బ్యాగు అమరేశ్వరరావుదిగా గుర్తించారు. పోలీసుల సమక్షంలో నర్సింహారావు చేతుల మీదుగా తిరిగి అమరేశ్వరరావుకు అప్పగించారు. నిజాయతీగా నగదు వెనక్కి తీసుకువచ్చిన నర్సింహారావును తపాలశాఖ అధికారులు, సిబ్బంది, పోలీసులు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని