logo

Crime News: మూర్తీ.. అర్జెంట్‌గా డబ్బు పంపు

‘‘నేను ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నా. బెంగళూరులో మా బంధువులబ్బాయి ఆసుపత్రిలో...

Updated : 02 Mar 2022 07:22 IST

సీఈవోలు, వర్సిటీల ఉన్నతాధికారుల పేర్లతో మోసం 

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘మూర్తీ.. అర్జెంట్‌గా నీ వాట్సాప్‌ నంబర్‌ పంపించు. ఒక సంక్షిప్త సందేశం పంపుతున్నా. నేను ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నా. బెంగళూరులో మా బంధువులబ్బాయి ఆసుపత్రిలో ఉన్నాడు. నేను పంపించిన బ్యాంక్‌ ఖాతాలో రూ.50 వేలు నగదు బదిలీ చేయి. మీటింగ్‌ పూర్తి కాగానే ఆఫీస్‌కు వచ్చి నీ ఫోన్‌పే లేదా గూగుల్‌పేకు నగదు బదిలీ చేస్తా. సెల్‌ఫోన్లు మాట్లాడకూదంటూ మీటింగ్‌లో చెప్పారు. అందుకే నాకు ఫోన్‌ చేయకు సరేనా.’’ - హైదరాబాద్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయం ఉపకులపతి మెయిల్‌ఐడీతో గ్రంథాలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి వచ్చిన సందేశమిది. ఉన్నతాధికారి పరిస్థితి ఇబ్బందిగా ఉందని గ్రహించిన ఉద్యోగి రెండో ఆలోచనలేకుండా నగదు బదిలీ చేశారు. ఉపకులపతి కార్యాలయానికి రాగానే మీరు చెప్పినట్టు రూ.50 వేలు పంపించాను సార్‌ అన్నాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఉపకులపతి తాను మెయిల్‌ చేయలేదని చెప్పగా మోసపోయానని గ్రహించిన గ్రంథాలయ ఉద్యోగి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

ఈ సంఘటన ఒక్కటే కాదు వర్సిటీ వీసీలు, ఉన్నతాధికారుల మెయిల్స్‌తో, కార్పొరేటు, ఐటీ సంస్థల సీఈవోల నకిలీ మెయిల్స్‌తో సైబర్‌ నేరస్థులు మోసం చేస్తున్నారు. ప్రాథమిక ఆధరాలు సేకరించిన పోలీసులు ఇది నైజీరియన్ల పనేనని నిర్ధారించారు.

అక్షరం మార్చి.. 

* కంపెనీలు, వర్సిటీల వెబ్‌సైట్ల నుంచి ఆయా వ్యక్తుల మెయిల్‌ ఐడీలు తీసుకుని ఒక అక్షరం అటూ ఇటూ మార్చి కిందిస్థాయి ఉద్యోగులకు మెయిల్‌ పంపుతున్నారు. అత్యవసరంగా మీ వాట్సాప్‌ నంబర్‌ పంపించాలంటూ సూచిస్తున్నారు. 

* కిందిస్థాయి ఉద్యోగులు మెయిల్‌కు వాట్సాప్‌ నంబర్లు పంపించగానే ఉపకులపతులు, సీఈవోల ఫొటోలను అంతర్జాలం ద్వారా తీసుకుని ఒక వాట్సాప్‌ నంబర్‌కు డీపీగా దాన్ని ఉంచుతున్నారు. వాట్సాప్‌ డీపీ ద్వారా బాధితులకు వాట్సాప్‌ సందేశం పంపించి ఫలానావారికి నగదు పంపించాలని, ఖాతా నంబర్‌ను అందులో సూచిస్తున్నారు. 

* హైదరాబాద్‌లోని రెండు ప్రముఖ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల మెయిల్‌, వాట్సాప్‌ డీపీలతో సైబర్‌ నేరస్థులు మోసాలు చేశారు. ఒక విశ్వవిద్యాలయం ఉపకులపతి పేరుతో ఆరుగురికి మెయిల్స్‌ పంపించగా నలుగురు నగదు బదిలీ చేసేప్పుడు ఉపకులపతి కార్యాలయానికి వారు ఫోన్‌ చేసి మోసమని తేలడంతో మిన్నకున్నారు. మిగిలిన ఇద్దరూ రూ.50వేల చొప్పున నగదు బదిలీ చేశారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రస్తుతం ఈ తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని