logo

Amaravati: రాజధానిలో.. జగనన్న లేఔట్‌ లేనట్లే!

వారంతా నిరుపేదలు.. రెక్కాడితే కానీ డొక్కాడని వారు. దినసరి కూలీలు.. ఇంట్లో పనిచేసే మహిళలు. వారికి గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లు జక్కంపూడిలో మంజూరు చేశారు. చాలా మంది లబ్ధిదారుల వాటా చెల్లించారు. దాదాపు 6వేల మంది

Published : 04 Mar 2022 07:40 IST

ఈనాడు, అమరావతి

‘టిడ్కో లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి రాజధాని ప్రాంతంలో లేఔట్‌ వేసి నివేశన స్థలాలు ఇస్తాం..’

- విజయవాడ నగరంలోని మూడు శాసనసభ నియోజకవర్గాల్లోని నిరుపేదలకు ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీ ఇది.

వారంతా నిరుపేదలు.. రెక్కాడితే కానీ డొక్కాడని వారు. దినసరి కూలీలు.. ఇంట్లో పనిచేసే మహిళలు. వారికి గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లు జక్కంపూడిలో మంజూరు చేశారు. చాలా మంది లబ్ధిదారుల వాటా చెల్లించారు. దాదాపు 6వేల మంది వరకు ఉన్నారు. వీరికి టిడ్కో ఇళ్లు రద్దు చేశారు. కారణం నిర్మాణం నిలిపివేయడమే. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన టిడ్కో ఇళ్లకు కొత్త ప్రభుత్వం చరమగీతం పాడిన విషయం తెలిసిందే. 25 శాతం పైన నిర్మాణం అయిన వాటిని మాత్రమే పూర్తి చేసి అప్పగించాలని నిర్ణయించింది. పట్టణ పేదలకు సెంటు స్థలం, గ్రామీణ పేదలకు సెంటున్నర చొప్పున జగనన్న కాలనీలలో నివేశన స్థలాల పంపిణీ చేసిన విషయం తెలిసిందే. నవరత్నాలులో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకం కింద వైకాపా ప్రభుత్వం దీన్ని చేపట్టింది. ఇందులో భాగంగా విజయవాడలోని నిరుపేదలకు పలుచోట్ల భారీ లేఔట్‌ వేశారు. దాదాపు 90వేల మంది అర్హులను గుర్తించారు. వీరిలో 27వేల వరకు టిడ్కో ఇళ్లు మినహా మిగిలిన వారికి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కొండపావులూరు, నున్న, కొత్తూరు తాడేపల్లి, ముత్యాలంపాడు, ఇబ్రహీంపట్నం, కండపల్లి తదితర ప్రాంతాల్లో భారీ లేఔట్‌లు వేశారు. దాదాపు 30వేల మందికి నివేశన స్థలాలు పంపిణీ చేశారు. మిగిలిన వారికి రాజధాని గ్రామాల్లో ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించారు. మందడం గ్రామంలో విజయవాడ నిరుపేదలకు దాదాపు 10వేల మందికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. తూర్పు నియోజకవర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. కృష్ణలంక, రామలింగేశ్వరనగర్‌ ప్రాంతాల వారు, మధ్య, పశ్చిమ నియోజకవర్గాల వారు ఉన్నారు. అమరావతి రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో లేఔట్‌ ఆగిపోయింది. ఆ పేదలకు ఇంకా పట్టాలు ఇవ్వలేదు. టిడ్కో ఇళ్లు లేవు. ప్రస్తుతం అమరావతిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పుతో ఇక రాజధాని గ్రామాల్లో జగనన్న లేఔట్‌ వేసే అవకాశం లేదని తేలిపోయింది. ఇతర అవసరాలకు కేటాయించవద్దని చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చింది. దీంతో 10వేల మంది పేదలకు ఎక్కడ ఇస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒక్కొక్కరికి సెంటు చొప్పున 100 ఎకరాలు స్థలం కావాలి. దీనికి రహదారులు అన్నీ కలిపితే కనీసం 200 ఎకరాలకు పైగా ఉండాలి. అంతస్థలం సేకరణ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని