logo

VK Sasikala: మళ్లీ అన్నాడీఎంకేలోకి చిన్నమ్మ?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే వరుస ఓటములు ఎదుర్కొంది. ఇందుకు కారణం పార్టీలో నెలకొన్న వర్గపోరే అని పార్టీ కార్యకర్తలు...

Updated : 04 Mar 2022 09:50 IST

పన్నీర్‌సెల్వం సమక్షంలో తీర్మానం 

పార్టీలో అనూహ్య పరిణామాలు 

సైదాపేట, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే వరుస ఓటములు ఎదుర్కొంది. ఇందుకు కారణం పార్టీలో నెలకొన్న వర్గపోరే అని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఓపీఎస్‌, ఈపీఎస్‌ ద్వంద్వ నాయకత్వంతో ఇకపై లాభం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎడప్పాడి పళనిస్వామికి ఎక్కువగా పలుకుబడి ఉండే కొంగు మండలం, పన్నీర్‌సెల్వానికి పలుకుబడి ఉండే దక్షిణ మండలాల్లోనూ అన్నాడీఎంకేకు ఊహించని ఓటమి ఎదురైంది. దీంతో నాయకత్వాన్ని మార్చాలన్న డిమాండ్‌ అధికమైంది. అదికూడా జయలలితకు నీడలా వ్యవహరించిన శశికళే పార్టీకి నేతృత్వం వహించాలని దక్షిణ మండల అన్నాడీఎంకే వర్గాలు మాట్లాడుతున్నారు. ఇందుకు ఓపీఎస్‌ కూడా అంగీకరిస్తారని కొన్ని రోజులుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుకోని మలుపు అన్నాడీఎంకేలో చోటు చేసుకుంది. తేని జిల్లా పెరియకుళం కైలాసపట్టిలోని అన్నాడీఎంకే సమన్వయకర్త ఓ.పన్నీర్‌ సెల్వానికి సొంతమైన ఫామ్‌ హౌస్‌లో బుధవారం సమావేశం జరిగింది. ఇందులో తేని జిల్లా అన్నాడీఎంకే ముఖ్య నిర్వాహకులు అనేక మంది పాల్గొన్నారు. 

శశికళ చేరికపై అధిష్టానానికి తీర్మానం 

పన్నీర్‌ సెల్వంతో పార్టీ నిర్వాహకులు ఎన్నికల్లో ఓటమి గురించి చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ ఓటమికి వర్గపోరే కారణమని నిర్వాహకులు ఓపీఎస్‌ ఎదుట ఆరోపించినట్లు సమాచారం. అన్నాడీఎంకే, ఏఎంఎంకే, శశికళ ఒక్కటయితే తప్ప అన్నాడీఎంకే విజయం సాధించటం సాధ్యం కాదని నిర్వాహకులు, కార్యకర్తలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 5వ తేదీ శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకోవటం గురించి తీర్మానం ఆమోదించి పార్టీ అధిష్టానానికి పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తేని జిల్లాలో తీసుకున్న నిర్ణయం లాగానే మిగతా జిల్లాల్లో కూడా తీర్మానం ఆమోదిస్తారని తెలుస్తోంది. ప్రారంభం నుంచే శశికళను పార్టీలోకి చేర్చుకోవాలనే అభిప్రాయంలోనే ఓపీఎస్‌ ఉన్నారు. పార్టీ వ్యవహారాల్లో ఎడప్పాడి పళనిస్వామిది పైచేయిగా ఉండటంతో ఓపీఎస్‌ వ్యాఖ్యలు సద్దుమణిగాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైంది. స్థానిక ఓటమి నేపథ్యంలో ఎడప్పాడి వర్గం కొన్ని రోజులుగా మౌనం వహిస్తోంది. తేని జిల్లాలో తీసుకున్న నిర్ణయంపై ఎడప్పాడి వర్గం ఎలా స్పందిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తానికి ఓపీఎస్‌ సమక్షంలో ఆమోదించిన తీర్మానంతో అన్నాడీఎంకేలో అంతర్గత రాజకీయాలు మళ్లీ వేడెక్కడం ప్రారంభించాయి.ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ గురువారం పన్నీర్‌సెల్వంతో సమావేశమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని