logo

ఖరీదైన దుస్తులతో కళాశాల విద్యార్థిగా ముస్తాబై.. తెల్ల స్కూటీపై తిరుగుతూ..

ఖరీదైన దుస్తులతో కళాశాల విద్యార్థిగా ముస్తాబవుతాడు. యమహా ఆర్‌ 15(రూ.1.90 లక్షలు)పై జల్సాగా తిరుగుతాడు. చోరీలు చేసేందుకు తెలుపు రంగు స్కూటీపై వెళ్లడాన్ని అదృష్టంగా భావిస్తాడు. రాష్ట్రవ్యాప్తంగా పగటిపూట చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న

Updated : 05 Mar 2022 09:10 IST

ఘరానా నిందితుడి అరెస్ట్‌.. రూ.23.80 లక్షల సొత్తు స్వాధీనం

యామిన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఖరీదైన దుస్తులతో కళాశాల విద్యార్థిగా ముస్తాబవుతాడు. యమహా ఆర్‌ 15(రూ.1.90 లక్షలు)పై జల్సాగా తిరుగుతాడు. చోరీలు చేసేందుకు తెలుపు రంగు స్కూటీపై వెళ్లడాన్ని అదృష్టంగా భావిస్తాడు. రాష్ట్రవ్యాప్తంగా పగటిపూట చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఘరానాదొంగ యామిన్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా అబ్దుల్లాపూర్‌మెట్‌, ఎల్బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నేరెడ్‌మెట్‌ రాచకొండ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో శుక్రవారం నేరవిభాగ డీసీపీ యాదగిరి, సీఐలతో కలసి సీపీ మహేష్‌ భగవత్‌ నిందితుడి వివరాలు వెల్లడించారు. షేక్‌ యామిన్‌ అలియాస్‌ సలీమ్‌(39) రోజువారీ కూలీ. స్వస్థలం జగిత్యాల జిల్లా చిలకవాడగట్టు. ప్రస్తుతం షాద్‌నగర్‌ ఏలికట్టలో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. భార్య, పిల్లలు వేరుగా ఉంటున్నారు. చోరీలు చేస్తూ 2010, 2015, 2016, 2018, 2019లో అరెస్టయి జైలుశిక్ష అనుభవించి బయటకొచ్చాడు. మళ్లీ వరుస చోరీలకు పాల్పడుతూ మూడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఫిబ్రవరి 5న అబ్దుల్లాపూర్‌మెట్‌లోని గోసకొండలో ఇంటితాళం పగులగొట్టి నగలు, రూ.లక్ష చోరీ చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇది యామిన్‌ పనిగా గుర్తించారు. చోరీ తర్వాత స్కూటీపై ఎంజీబీఎస్‌కు చేరి, పార్కింగ్‌లో నిలిపి, ఆర్టీసీ బస్సులో షాద్‌నగర్‌ చేరినట్టు గుర్తించారు. అతన్ని అరెస్ట్‌ చేసి 350 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలు 1.5 కిలోలు, రూ.1.50 లక్షల నగదు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.23,80,000 ఉంటుందని అంచనా ఇతడికి సహకరించిన ఉస్మాన్‌(మహారాష్ట్ర), లక్ష్మణ్‌(నిజామాబాద్‌), మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. పోలీసుల రికార్డుల ప్రకారం 85 చోరీలు చేసినట్టు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని