logo

Andhra News: అన్నం పెట్టకుండా.. అమెరికా వెళ్లిపోయాడు!

నవమాసాలు మోసి.. కనీ పెంచినందుకు.. తల్లిని సంరక్షించుకోవాల్సిందిపోయి.. ఆమెపై ఉన్న ఆస్తులను రాయించుకుని అమెరికాకు చెక్కేశాడు ఆ ప్రబుద్ధుడు. బతికినన్ని

Updated : 06 Mar 2022 09:37 IST

కుమారుడి తీరుపై వృద్ధురాలి నిరసన

ఇంటి ఎదుట నిరసన దీక్ష చేపట్టిన గరిమెళ్ళ సత్యనాగకుమారి

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: నవమాసాలు మోసి.. కనీ పెంచినందుకు.. తల్లిని సంరక్షించుకోవాల్సిందిపోయి.. ఆమెపై ఉన్న ఆస్తులను రాయించుకుని అమెరికాకు చెక్కేశాడు ఆ ప్రబుద్ధుడు. బతికినన్ని రోజులు నాలుగు మెతుకులు పెట్టి, యోగక్షేమాలు చూసుకోవాల్సిన కుమారుడు పట్టించుకోకపోవడంతో గన్నవరం సొసైటీపేటకు చెందిన ఆమె శనివారం నిరసన దీక్ష చేపట్టారు. బాధితురాలి కథనం మేరకు.. స్థానికంగా నివాసం ఉండే 60 ఏళ్ల గరిమెళ్ళ సత్యనాగకుమారి అనే వృద్ధురాలి భర్త 2001లో గుంటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆయన చనిపోయిన అనంతరం అతను అప్పటికే చేసిన అప్పులు తీర్చమని కొందరు వేధించడంతో ఇళ్లు, ఇతర ఆస్తులు అమ్మి తీరుస్తానని కుమారుడు గరిమెళ్ళ వెంకటఫణీంద్రచౌదరి తల్లికి చెప్పాడు. దీంతో తనతోపాటు భర్త పేరుమీద ఉన్న ఆస్తులన్నింటినీ నాగకుమారి కుమారుడుకి రాసింది. భర్త చేసిన రూ.29లక్షల అప్పు తీర్చకుండా ఉన్నట్టుండి అమెరికా వెళ్లిపోయాడు. తనకు న్యాయం చేయమని గతంలో జిల్లా కలెక్టర్‌, ఆర్డీవో, ఎస్పీ, ఇలా ఉన్నతాధికారులను సైతం కలిసినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని తనను శేషజీవితమైనా ప్రశాంతంగా గడిపేందుకు వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించాలని కోరుతున్నారు. ఆస్తులు రాయించుకొని చూడకుండా వదిలేసిన కొడుకుపై చర్యలు తీసుకొనే వరకు ఈ దీక్ష కొనసాగిస్తానని వృద్ధురాలు తేల్చి చెబుతున్నారు. ఆమె దీక్షపై సమాచారం అందుకున్న గన్నవరం తహసీల్దార్‌ నరసింహారావు బాధితురాలిని పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని