logo

Crime News: సెల్‌ఫోన్ల దొంగ కోసం వెతికితే... బంగారం బయటపడింది

సెల్‌ఫోన్ల దొంగతనం కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తే బంగారం చోరీ కేసులు బయటపడ్డాయి. నేరాలు చేస్తూ తొమ్మిదేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న దొంగను....

Updated : 07 Mar 2022 09:02 IST

నిందితుడి అరెస్టు, రూ.25.60 లక్షల విలువైన సొత్తు స్వాధీనం


నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సొత్తు చూపుతున్న పోలీసులు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : సెల్‌ఫోన్ల దొంగతనం కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తే బంగారం చోరీ కేసులు బయటపడ్డాయి. నేరాలు చేస్తూ తొమ్మిదేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద రూ.25.60 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాష్ట్ర సచివాలయం సమీపంలోని గరుడ కంట్రోల్‌రూమ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను తెలిపారు. ఫిబ్రవరి 12వ తేదీ అర్ధరాత్రి గురజాలలోని ఓ సెల్‌ఫోన్‌ దుకాణంలో చోరీ జరిగింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు చేయాలని సీసీఎస్‌ సీఐ విజయకృష్ణ, గురజాల అర్బన్‌ సీఐ ధర్మేంద్రబాబులను రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ ఆదేశించారు. ఘటనాస్థలిలో లభించిన ఆధారాలలో నిందితుడు శావల్యాపురం మండలం పిచ్చికలపాలేనికి చెందిన బాలమునెయ్య అలియాస్‌ బాలమణిగా నిర్ధారించారు. అతను వినుకొండలో ఉన్నాడని తెలిసి అక్కడి సీఐ రమేష్‌ సహకారంతో ఆదివారం నిందితుడిని అరెస్టు చేశారు. కూలిపనులు చేసుకుంటూ జల్సాలకు అలవాటుపడిన అతను నేరాలు చేస్తున్నట్లు చెప్పారు. గురజాలలోని దుకాణంలో సెల్‌ఫోన్లు తస్కరించినట్లు బాలమునెయ్య ఒప్పకున్నాడని పోలీసులు తెలిపారు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి లోతుగా దర్యాప్తు చేస్తే నిందితుడు గతంలో అచ్చంపేట, బాపట్ల, విజయనగరం జిల్లాలోని కొత్తవలసతోపాటు పలు ప్రాంతాల్లోని బంగారు దుకాణాల్లో చోరీలు చేసినట్లు తేలింది. గత

తొమ్మిదేళ్లుగా చోరీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నది ఇతనే అని తేలడంతో పోలీసులు నివ్వెరపోయారు. 2014లో అచ్చంపేటలోని బంగారపు దుకాణంలో, 2018లో బాపట్లలో, 2021లో కొత్తవలసలో నేరాలకు పాల్పడినట్లు తేలిందని పోలీసులు చెప్పారు. స్వాధీనం చేసుకున్న సొత్తులో 192 గ్రాముల బంగారపు వస్తువులు, 2.5 కిలోల వెండి సామగ్రి, 86 చరవాణీలు ఉన్నట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకున్న సీఐలు ధర్మేంద్ర, విజయకృష్ణ, రమేష్‌బాబు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని