logo

Andhra News: నడికూడి రైల్వేస్టేషన్‌లో దోపిడీ ఘటన.. నగదును గొయ్యి తీసి పాతారు..

భారీగా నగదుతో వెళ్తున్నారన్న సమాచారం పసిగట్టారు.. పక్కా ప్రణాళికతో పోలీసులమని చెప్పి నడికూడి రైల్వే స్టేషన్‌లో నగదు దోపిడీ చేసిన ఐదుగురు సభ్యుల ముఠాను జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు రైల్వేస్టేషన్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో నిందితుల వివరాలను గుం

Updated : 14 Mar 2022 09:12 IST

కేసును ఛేదించిన పోలీసులు

ఐదుగురు నిందితుల అరెస్టు.. రూ.89 లక్షలు స్వాధీనం


నిందితుల వివరాలు వెల్లడిస్తున్న రైల్వే ఎస్పీ అనిల్‌బాబు, ఏఎస్పీ

అజయ్‌ప్రసాద్‌, ఆర్పీఎఫ్‌ ఏఎస్పీ శరత్‌బాబు 

గుంటూరు, దాచేపల్లి, న్యూస్‌టుడే: భారీగా నగదుతో వెళ్తున్నారన్న సమాచారం పసిగట్టారు.. పక్కా ప్రణాళికతో పోలీసులమని చెప్పి నడికూడి రైల్వే స్టేషన్‌లో నగదు దోపిడీ చేసిన ఐదుగురు సభ్యుల ముఠాను జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు రైల్వేస్టేషన్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో నిందితుల వివరాలను గుంతకల్లు రైల్వే ఎస్పీ, గుంటూరు ఇన్‌ఛార్జి రైల్వే ఎస్పీగా వ్యవహరిస్తున్న పి.అనిల్‌బాబు విలేకరులకు తెలిపారు. దుర్గి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన కస్తూరి శ్రీనివాసరావు, దుర్గికి చెందిన కపలవాయి సాంబశివరావు తమ కుమార్తె వివాహానికి బంగారం కొనుగోలు చేయాలనుకున్నారు. అదే ప్రాంతానికి చెందిన వారి స్నేహితులు ప్రకాశరావు, అజయ్‌కుమార్‌, రామశేషయ్యలకు ఈనెల ఏడో తేదీన రూ.89 లక్షలు ఇచ్చి చెన్నైలో బంగారం కొనుగోలు చేయడానికి పంపించారు. ఆ రోజు రాత్రి నడికూడి రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫారం వద్ద వేచి ఉన్నారు. రాత్రి 8:20 గంటలకు తెల్లని కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వారి వద్దకు వెళ్లి తాము పోలీసులమని.. చేతిలోని సంచులు తనిఖీ చేయాలన్నారు. ప్లాట్‌ఫారం చివర తమ ఎస్సై ఉన్నారంటూ తీసుకెళ్లి వారి చేతిలోని నగదు సంచిని లాక్కున్నారు. కస్తూరి శ్రీనివాసరావు, సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నడికూడి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

నగదును గొయ్యి తీసి పాతారు : రైల్వే డీజీ హరీష్‌కుమార్‌ గుప్తా ఆదేశాలతో విజయవాడ రైల్వే ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌, గుంటూరు ఇన్‌ఛార్జి ఎస్పీ అనిల్‌బాబు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జీఆర్పీ ఏఎస్పీ అజయ్‌ప్రసాద్‌ నేతృత్వంలో నడికూడి జీఆర్పీ సీఐ టి. శ్రీనివాసరావు, ఎస్సై పి.శ్రీనివాసరావు బృందాలతో రంగంలోకి దిగారు. గుంటూరు నుంచి నడికూడి వరకు సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించి పలు సాంకేతిక ఆధారాలు సేరించారు. నిందితులు అడిగొప్పలకు చెందిన ఏటీ లక్ష్మీనారాయణ, చామరాజుపురానికి చెందిన రాచకుంట రమేష్‌, ఎడ్వర్టుపేటకు చెందిన మక్కెన వెంకటేశ్వరరావు, పంగా సైదారావు, మాచవరానికి చెందిన మానపాటి వేణుగా తేలినట్లు ఎస్పీ తెలిపారు. బాధితులు ఉండే ప్రాంతాల్లోనే నిందితులు ఉండటంతో వారు నగదుతో చెన్నైకి బయలుదేరినట్లు సమాచారం సేకరించి దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. నగదు సంచిని అడిగొప్పల గ్రామ శివారులోని పొలాల్లో గొయ్యి తీసి దాచిపెట్టి పరారయ్యారన్నారు. జీఆర్పీ, రైల్వే పోలీసులు సంయుక్తంగా పని చేసి నిందితులను ఆదివారం అడిగొప్పుల గ్రామం శివారులో అరెస్టు చేసి వారి వద్ద రూ. 89 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల్లోని లక్ష్మీనారాయణపై హత్యాయత్నం, రమేష్‌పై మద్యం అక్రమ రవాణా కేసులు ఉన్నాయని చెప్పారు. రైల్వే భద్రత సహాయ కమిషనర్‌ శరత్‌బాబు, సీఐలు రామయ్య, గంగా వెంకటేశ్వర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.

స్వాధీనం చేసుకున్న నగదు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని