logo

Crime News: కిషన్‌సింగ్‌.. వాహన చోరీల్లో ‘కింగ్‌’!

అతడి పేరు కిషన్‌సింగ్‌.. రోడ్డుపై నిలిపిఉంచిన బైకులను క్షణాల్లో మాయం చేయడంలో దిట్ట. వేర్వేరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలు ఎత్తుకెళ్లిన ఈ ఘరానా పాత నేరస్థుడిని కూకట్‌పల్లి పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు.

Updated : 17 Mar 2022 07:13 IST


నిందితుడు

మూసాపేట, న్యూస్‌టుడే: అతడి పేరు కిషన్‌సింగ్‌.. రోడ్డుపై నిలిపిఉంచిన బైకులను క్షణాల్లో మాయం చేయడంలో దిట్ట. వేర్వేరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలు ఎత్తుకెళ్లిన ఈ ఘరానా పాత నేరస్థుడిని కూకట్‌పల్లి పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. భారీగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కూకట్‌పల్లి ఠాణాలో మీడియా సమావేశంలో ఏసీపీ ఆకుల చంద్రశేఖర్‌ వివరాలు వెల్లడించారు. బహదూర్‌పుర పరిధి అత్తాపూర్‌లోని కిషన్‌బాగ్‌కు చెందిన సర్దార్‌ కరణ్‌ వీర్‌సింగ్‌ అలియాస్‌ సర్దార్‌ కిషన్‌సింగ్‌(22) గతంలో ఓ హత్యాయత్నం కేసుతోపాటు పలు ఠాణాల్లో బైకుల చోరీ కేసుల్లో నిందితుడు.ప్రస్తుతం జోమాటోలో డెలివరీ బాయ్‌గానూ, ఓ ఫైనాన్స్‌ సంస్థలో రికవరీ ఏజెంట్‌గా కూడా చేస్తున్నాడు. మూసాపేట కైత్లాపూర్‌కు చెందిన మంగలి పాండు స్థానిక ప్రభుత్వ పాఠశాల సమీపంలోని తన ఇంటి ఆవరణలో ఈనెల 7నరాత్రి ద్విచక్ర వాహనం నిలిపాడు. ఉదయం కనపడకపోవడంతో కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు నిందితుడి ముఖకవళికలు గుర్తించారు. కూకట్‌పల్లి డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు, డీఎస్సై అబ్దుల్‌ రజాక్‌ ఆధ్వర్యంలోని సిబ్బంది బుధవారం వైజంక్షన్‌లో సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా కిషన్‌సింగ్‌ ఓ ద్విచక్ర వాహనంపై వచ్చినప్పుడు ధ్రువపత్రాలడిగితే పారిపోవడానికి ప్రయత్నించాడు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కైత్లాపూర్‌లో వాహన చోరీ కేసులోని ముఖకవళికలతో సరిపోలడంతో, విచారించగా నేరాన్ని ఒప్పుకొన్నాడు. రూ.20 లక్షల విలువైన 14 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అతను ఫైనాన్స్‌ సంస్థలో పనిచేస్తున్నందున రుణాలు చెల్లించని వారి వాహనాలనూ జప్తు చేసేవాడు. సమావేశంలో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.ఆంజనేయులు, డీఎస్సై అబ్దుల్‌ రజాక్‌, ఎస్సై పి.శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.


స్వాధీనం చేసుకున్న వాహనాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని