logo

నా తల్లిదండ్రులు జయలలిత, శోభన్‌బాబు.. వారసురాలిని నేనే..!

జయలలిత వారసురాలిని తానేనంటూ, తనకు వారసత్వ ధృవీకరణ పత్రం అందించాలని మదురై తాలూకా కార్యాలయంలో ఓ మహిళ వాగ్వాదానికి దిగడం ఆసక్తికరంగా మారింది. మదురై తిరువళ్లువర్‌ నగర్‌కు చెందిన మురుగేశన్‌ భార్య మీనాక్షి (38) తన తండ్రి శోభన్‌బాబు,

Updated : 17 Mar 2022 08:53 IST

సంబంధిత పత్రం ఇవ్వాలంటూ వాగ్వాదం


మీనాక్షి

సైదాపేట, న్యూస్‌టుడే: జయలలిత వారసురాలిని తానేనంటూ, తనకు వారసత్వ ధృవీకరణ పత్రం అందించాలని మదురై తాలూకా కార్యాలయంలో ఓ మహిళ వాగ్వాదానికి దిగడం ఆసక్తికరంగా మారింది. మదురై తిరువళ్లువర్‌ నగర్‌కు చెందిన మురుగేశన్‌ భార్య మీనాక్షి (38) తన తండ్రి శోభన్‌బాబు, తల్లి జయలలిత అని, చెన్నై పోయెస్‌ గార్డెన్‌లో ఉన్న తన తల్లి మృతి చెందినందున తనకు వారసత్వ సర్టిఫికేట్‌ ఇవ్వాలని జనవరి 27న ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంది. తాలూకా కార్యాలయ అధికారులు దిగ్భ్రాంతికి లోనై ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక తికమక పడ్డారు. దరఖాస్తు చేసుకుని నెల దాటడంతో మంగళవారం మీనాక్షి తాలూకా కార్యాలయానికి వచ్చి, డిప్యూటీ తహసీల్దారు వద్ద వారసత్వ సర్టిఫికేట్‌ ఇవ్వాలని కోరింది.

ఆమె తల్లి అని పేర్కొంటున్న వ్యక్తి మృతి చెందింది చెన్నైలో కావడంతో అక్కడికెళ్లి తీసుకోమని చెప్పారు. ఇందుకు నిరాకరించిన మీనాక్షి తన తల్లిదండ్రులు తనను అనాధగా వదిలి వెళ్లారని, పళనిలో బంగారు రథం లాగే హక్కు తన తండ్రి శోభన్‌బాబు తనకు ఇచ్చారని, దానికి సంబంధించిన పత్రాలు పొందానని, అయితే వారసత్వ సర్టిఫికేట్‌ ఎందుకు ఇవ్వటం లేదని వాగ్వాదానికి దిగింది. దీంతో తాలూకా కార్యాలయంలో అలజడి నెలకొంది. న్యాయస్థానానికి వెళ్లి మీ హక్కులు చెప్పి ఆదేశాలు తీసుకోమని డిప్యూటీ తహసీల్దార్‌ మీనాక్షిని అక్కడ నుంచి పంపించేశారు. అనంతరం మీనాక్షి మీడియాతో మాట్లాడుతూ... తన చిన్నతనంలోనే తన తల్లి తనను దూరం చేసుకుందని తెలిపింది. బామ్మ పరామర్శలో పెరిగానని, తానే జయలలిత నిజమైన వారసురాలినని తెలిపింది. కోర్టుకు వెళ్లటం గురించి న్యాయవాదితో మాట్లాడతానని తెలిపింది. మీనాక్షి భర్త మురుగేశన్‌ కూలీ కార్మికుడు కావటం గమనార్హం. గతంలో ఇలాగే ఇద్దరు జయలలిత వారసులమని కలకలం రేపిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని