logo

ఏకాంతంగా మాట్లాడుకుందాం.. వివాహ వేదికల ద్వారా పరిచయమైన యువతులపై వల

బషీర్‌బాగ్‌లో ఉంటూ జూబ్లీహిల్స్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో హెచ్‌.ఆర్‌.విభాగంలో ఉన్నతాధికారిగా పని చేస్తున్న ఓ యువతికి విజయవాడకు చెందిన ఓ యువకుడితో...

Updated : 20 Mar 2022 07:42 IST
ఈనాడు, హైదరాబాద్‌: బషీర్‌బాగ్‌లో ఉంటూ జూబ్లీహిల్స్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో హెచ్‌.ఆర్‌.విభాగంలో ఉన్నతాధికారిగా పని చేస్తున్న ఓ యువతికి విజయవాడకు చెందిన ఓ యువకుడితో పెళ్లి సంబంధం కుదిరింది. తరచూ హైదరాబాద్‌కు వస్తున్న యువకుడు ఆమెతో భోంచేసి, సినిమాలు చూసి వెళ్లేవాడు. అతడి ప్రవర్తన నచ్చక పెళ్లి ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పగా.. ఇదే విషయాన్ని వారు ఆ యువకుడికి చెప్పారు. అతడు యువతికి ఫోన్‌ చేసి కలిసి దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తానంటూ బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రిసార్ట్‌లకు వెళ్దామంటూ పిలిచి..

పెళ్లికాని యువతులపై కొందరు యువకులు నయవంచక వల విసురుతున్నారు. అంతర్జాల వివాహ వేదికల ద్వారా పరిచయమవుతూ పెళ్లి సంబంధాల పేరుతో యువతుల ఇళ్లకు వెళ్తున్నారు. వివాహానికి ముందే కొన్ని వ్యక్తిగత వివరాలు పంచుకుందామంటూ అభ్యర్థిస్తూ.. ఏకాంతంగా మాట్లాడుకుందామంటూ ప్రతిపాదిస్తున్నారు. బెంగళూరు, ముంబయి, గోవాలకి.. లేదంటే హైదరాబాద్‌ శివార్లలోని రిసార్ట్‌లకు వెళ్దామంటూ కోరుతున్నారు. అక్కడికి వెళ్లాక వికృతరూపం ప్రదర్శిస్తున్నారు. పెళ్లికి ముందే లైంగిక కోర్కెలు తీర్చాలంటూ బలవంతం చేస్తున్నారు. బాధితుల్లో కొందరు ‘షి’ బృందాలకు ఫిర్యాదు చేస్తుండడంతో వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనల దృష్ట్యా అంతర్జాల వివాహ వేదికల ద్వారా పరిచయమైన యువకులతో ఒంటరిగా వెళ్లకూడదంటూ ‘షి’ బృందాలు హెచ్చరిస్తున్నాయి. పెళ్లికి ముందే ఇద్దరమే బయటకు వెళ్దామని యువకులు ప్రతిపాదిస్తే నో చెప్పాలని సూచిస్తున్నారు. ఏకాంతం పేరుతో కొందరు యువతుల పట్ల దారుణంగా ప్రవర్తించారని, బాధితులు ఆవేదనతో వివరాలు చెప్పారని వివరించారు. మెట్రో నగరాల్లో ఉండే యువతులకు పెద్దగా పట్టింపులు ఉండవు.. ఎక్కడికైనా వచ్చేస్తారన్న అంచనాతో కొందరు యువకులు ఇలా వల విసురుతున్నారని, ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని