logo

Hyderabad News: ఆ ప్రాణాలు తోడింది మద్యమే!

గచ్చిబౌలి కారు ప్రమాదానికి మద్యం మత్తే కారణమని పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. శుక్రవారం సాయంత్రం ఎల్లా హోటల్‌ వద్ద కారు అదుపు తప్పిన ఘటనలో కార్మికురాలు మహేశ్వరి, జూనియర్‌ నటి గాయత్రి మృతిచెందగా

Updated : 20 Mar 2022 11:38 IST
గచ్చిబౌలి కారు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు
హోలీ రోజు కొనుగోలు చేసినట్లు నిర్ధారణ

గాయత్రి

ఈనాడు, హైదరాబాద్‌ గచ్చిబౌలి, న్యూస్‌టుడే: గచ్చిబౌలి కారు ప్రమాదానికి మద్యం మత్తే కారణమని పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. శుక్రవారం సాయంత్రం ఎల్లా హోటల్‌ వద్ద కారు అదుపు తప్పిన ఘటనలో కార్మికురాలు మహేశ్వరి, జూనియర్‌ నటి గాయత్రి మృతిచెందగా రోహిత్‌ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అతడి ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగు పడినట్టు వైద్యులు తెలిపారు. విచారణలో భాగంగా గచ్చిబౌలి పోలీసులు శనివారం పలు ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు.

ఎల్లా హోటల్‌ వద్ద ఆందోళన చేస్తున్న మహేశ్వరి బంధువులు

కొబ్బరి బొండాల్లో కలుపుకొని..: కూకట్‌పల్లి హెచ్‌ఎంటీ హిల్స్‌ ఆదిత్య హోమ్స్‌లో నివసించే రోహిత్‌ శుక్రవారం నిజాంపేట్‌లో ఉండే జూనియర్‌ ఆర్టిస్టు గాయత్రిని కారులో ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో మరో రెండు కార్లలో ఓ యువతి సహా నలుగురు మిత్రులు కలిశారు. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు ఆరుగురు వెళ్లారు. పండగ సందర్భంగా మద్యం విక్రయాలపై ఆంక్షలు ఉండడంతో బయటి నుంచి తెప్పించుకున్నారు. రహదారి పక్కనే 6 కొబ్బరి బొండాలు కొన్నారు. వాటిల్లో మద్యం కలుపుకొని పబ్‌ సమీపంలోనే కారులోనే తాగారు. మిగిలిన మద్యం కారులోనే వదిలేసి పబ్‌లోకి వెళ్లారు. వేడుక అనంతరం గాయత్రి, రోహిత్‌ గచ్చిబౌలి బయల్దేరగా వారు ప్రయాణిస్తున్న కారు ఎల్లా హోటల్‌ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మరణించిన కార్మికురాలు మహేశ్వరి కుటుంబానికి నష్టపరిహారం అందజేయాలంటూ గచ్చిబౌలి ఎల్లాహోటల్‌ వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. మహేశ్వరి భర్త చిన్నరాములు 2005 ఎల్లా హోటల్‌ నిర్మాణ సమయంలో మరణించాడు. జూనియర్‌ ఆర్టిస్ట్‌ గాయత్రి తండ్రి శ్రీనివాస్‌ రెండేళ్ల కిందట మరణించడంతో కుటుంబ భారమంతా ఆమెపై పడింది. లఘుచిత్రాలు, టిక్‌టాక్‌, జూనియర్‌ నటిగా పనిచేస్తూ వచ్చే సంపాదనతో అమ్మ, అమ్మమ్మలను పోషించేది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని