logo

అంకుల్‌.. ట్రాఫిక్‌ క్లియర్‌ చేయండి: పోలీసులకు ఆరేళ్ల బాలుడు ఫిర్యాదు

రోడ్డుపై పెద్ద వాహనాలు ఆగిపోవడంతో ఇబ్బందిగా ఉంది సార్‌.. మీరు వచ్చి వాటిని పంపేయండి..ఆరేళ్ల బాలుడు సీఐతో అన్నమాటలివి. ఆశ్చర్యపోయిన పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. పలమనేరులో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది...

Updated : 20 Mar 2022 08:44 IST


పోలీసులతో మాట్లాడుతున్న బాలుడు

పలమనేరు: రోడ్డుపై పెద్ద వాహనాలు ఆగిపోవడంతో ఇబ్బందిగా ఉంది సార్‌.. మీరు వచ్చి వాటిని పంపేయండి..ఆరేళ్ల బాలుడు సీఐతో అన్నమాటలివి. ఆశ్చర్యపోయిన పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. పలమనేరులో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పట్టణానికి చెందిన మోహన్‌ కుమారుడు కార్తికేయన్‌ స్థానిక ఆదర్శ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. జాతీయ రహదారిపై కాల్వ మరమ్మతుల నేపథ్యంలో పోలీసులు వాహనాలను రోడ్డుకు ఒకవైపు మళ్లించారు. శుక్రవారం సాయంత్రం తండ్రితో కలిసి పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న ఆ బాలుడు రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు, జేసీబీలను చూసి.. వీటిని సజావుగా పంపాలంటే ఏం చేయాలి అని అడగ్గా.. పోలీసులు వస్తే అవే వెళ్లిపోతాయని తండ్రి సమాధానమిచ్చాడు. పోలీసుల దగ్గరకే పోదాం అంటూ ఆ బాలుడు తండ్రితో కలిసి స్టేషన్‌కు వచ్చాడు. అక్కడ సీఐ భాస్కర్‌ దగ్గరకు వెళ్లి నిర్భయంగా సమస్యను వివరించాడు. మేం ఇంటికి వెళ్లడానికి వేరే మార్గం లేదు.. అంకుల్‌ మీరొచ్చి ట్రాఫిక్‌ క్లియర్‌ చేయండి అని అడగ్గానే అతడి మాటలకు ఆశ్చర్యపోయిన సీఐ వెంటనే.. వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. ఎప్పుడైనా సరే నీవు నాకు ఫోన్‌ చేయవచ్చని సీఐ తన ఫోన్‌ నంబరు రాసి బాలుడికి ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని