logo

మహిళ పొట్టలో హ్యాండ్‌ గ్లోవ్స్‌ వదిలేసి సర్జరీ చేసేశారు!

ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలింత ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. ఆమె భర్త అప్రమత్తమై విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అక్కడి వైద్యులు శస్త్రచికిత్స చేసి బాధితురాలిని కాపాడారు. రాయగడ జిల్లా కేంద్రాసుపత్రిలో చోటుచేసుకున్న

Updated : 24 Mar 2022 10:08 IST

రాయగడ జిల్లా కేంద్రాసుపత్రిలో ఘటన

తొలగించిన విశాఖ పట్టణం వైద్యులు

బాధితురాలు కాంచన్‌

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలింత ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. ఆమె భర్త అప్రమత్తమై విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అక్కడి వైద్యులు శస్త్రచికిత్స చేసి బాధితురాలిని కాపాడారు. రాయగడ జిల్లా కేంద్రాసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొరాపుట్‌ జిల్లా లక్ష్మీపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి బిరిగూడ గ్రామానికి చెందిన చేతన్‌ హల్బా భార్య కాంచన్‌ ప్రసవం కోసం గతేడాది అక్టోబర్‌ 3వ తేదీన స్థానిక జిల్లా కేంద్రాసుపత్రిలో చేరింది. సిజేరియన్‌ చేయడంతో మగబిడ్డ జన్మనివ్వగా అక్టోబర్‌ 8న కాంచన్‌ని డిశ్చార్జ్‌ చేశారు. ఇది జరిగిన 15 రోజుల తరువాత ఆమెకు కడుపునొప్పి రావడంతో మళ్లీ జిల్లా కేంద్రాసుపత్రికి వెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యుడు ప్రఫుల్ల పాఢి సమస్య ఏమీ లేదని మందులు రాసిచ్చారు. మూడు నెలల తరువాత కడుపునొప్పి మళ్లీ తీవ్రం కావడంతో ఈ ఏడాది జనవరి 31న కొరాపుట్‌లో జిల్లాకేంద్రాసుపత్రిలో చేర్పించారు. అల్ట్రాస్కానింగ్‌ చేసిన వైద్యులు కాంచన్‌ పొట్టలో ఏవో వస్తువులు ఉన్నట్లు గుర్తించి వెంటనే శస్త్రచికిత్స చేయాలని లేదంటే ఆమె ప్రాణానికి ప్రమాదమని భావించి కటక్‌ లేదా బ్రహ్మపుర తీసుకెళ్లాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించగా బాధితురాలి పొట్టలో చేతి తొడుగులు (గ్లోవ్స్‌) ఉన్నట్లు గుర్తించి పిబ్రవరి 5న వాటిని తొలగించారు. ఈ విషయమై బాధితురాలి భర్త మాట్లాడుతూ ఘటనపై ఈ నెల 18న రాయగడ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. చికిత్స కోసం రూ.12లక్షల వరకు ఖర్చు అయిందని వాపోయారు.

విచారణకు ఆదేశిస్తాం

ఈ విషయాన్ని కలెక్టర్‌ సరోజ్‌కుమార్‌ మిశ్ర దృష్టికి తీసుకెళ్లగా ఘటనపై విచారణకు ఆదేశిస్తామని చెప్పారు. జిల్లా ముఖ్యవైద్యాధికారి లాల్‌మోహన్‌ రౌత్రాయ్‌ మాట్లాడుతూ.. ఈ ఘటన తన హయాంలో జరగలేదని, అప్పుడు వేరే సీడీఎంవో ఉన్నట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

శస్త్రచికిత్స అనంతరం వైద్యులు తొలగించిన చేతి తొడుగులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని