logo

HCU: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చుక్కెదురు

ప్రైవేటు వ్యక్తికి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన భూమిలో 25.16 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సమర్థించింది. ప్రభుత్వానికి జీవో ఇచ్చే అధికారం ఉందంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది.

Updated : 27 Mar 2022 08:56 IST

అప్పీలును కొట్టివేసిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేటు వ్యక్తికి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన భూమిలో 25.16 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సమర్థించింది. ప్రభుత్వానికి జీవో ఇచ్చే అధికారం ఉందంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. యూనివర్సిటీకి గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం 2300 ఎకరాలు కేటాయించగా, ఇందులో తమకు చెందిన భూమి 25.16 ఎకరాలు ఉందని ప్రైవేటు వ్యక్తి లింగమయ్య సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. సివిల్‌ కోర్టు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడంతో యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించగా ప్రైవేటు వ్యక్తికి అనుకూలంగానే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ దశలో యూనివర్సిటీ 25.16 ఎకరాలకు బదులు 12.17 ఎకరాలు ఐఐఐటీ, స్పోర్ట్స్‌ విలేజ్‌ మధ్య ఇస్తామనగా ప్రైవేటు వ్యక్తి అంగీకరించినప్పటికీ ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం తిరస్కరించింది. ప్రైవేటు వ్యక్తి భూమికి రోడ్డు లేకపోవడంతో తిరిగి సివిల్‌ కోర్టును ఆశ్రయించగా రోడ్డు ఇవ్వాలని యూనివర్సిటీని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం సర్వే నెం.37లో 25.31 ఎకరాలను ప్రైవేటు వ్యక్తికి కేటాయిస్తూ 2008లో జీవో 1473 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ యూనివర్సిటీ పిటిషన్‌ దాఖలు చేయగా సింగిల్‌ జడ్జి కొట్టివేస్తూ గత ఏడాది తీర్పు వెలువరించారు. దీన్ని సవాలు చేస్తూ యూనివర్సిటీ దాఖలు చేసిన అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు లేవంటూ యూనివర్సిటీ అప్పీలును కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని