logo

Telangana News: ఆలయ ప్రాంగణంలో గంజాయి దందా.. అక్కడే మొక్కలు పెంచి విక్రయాలు

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్‌ ఆలయం వద్ద గంజాయి దొరకడం సోమవారం కలకలం రేపింది. గ్రామస్థులు, ఎస్సై వరప్రసాద్‌ వివరాల ప్రకారం..

Updated : 05 Apr 2022 09:32 IST


స్వాధీనం చేసుకున్న సరకు

తలకొండపల్లి, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్‌ ఆలయం వద్ద గంజాయి దొరకడం సోమవారం కలకలం రేపింది. గ్రామస్థులు, ఎస్సై వరప్రసాద్‌ వివరాల ప్రకారం.. ఎల్లయ్యగౌడ్‌(80) లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో ధూపదీప కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఆలయ ప్రాంగణంలోని స్థలంలో గంజాయి మొక్కలు పెంచుతూ తన మేనల్లుడు శ్రీనివాస్‌గౌడ్‌ ద్వారా విక్రయిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం మిడ్జిల్‌, కల్వకుర్తి మండలాల నుంచి ఐదుగురు యువకులు గంజాయి కోసం ఎల్లయ్యగౌడ్‌ వద్దకు వచ్చారు. వారిని అనుమానించిన గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆలయంలో ఎల్లయ్యగౌడ్‌ దాచిన గంజాయిని అర్ధరాత్రి శ్రీనివాస్‌గౌడ్‌ బైకుపై ఇంటికి తరలిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. నిందితులు ఎల్లయ్యగౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ను ఎస్సై వరప్రసాద్‌ అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. వారి నుంచి 1.185 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తాను తాగడానికే కొన్నేళ్లుగా ఆలయ స్థలంలో గంజాయి మొక్కలు పెంచేవాడినని ఎల్లయ్యగౌడ్‌ తెలిపాడు. ఇటీవల యువకులు వచ్చి బతిమాలితే ఇస్తున్నానని పేర్కొన్నాడు. గ్రామంలో కోళ్లఫారంలో పనిచేసే ఇతర రాష్ట్రాల వారు, ఇసుక వ్యాపారులు, యువకులు అధికసంఖ్యలో నిత్యం గుడి వద్దకు వస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్‌ వారికి సరఫరా చేస్తున్నాడని గ్రామస్థులు వివరించారు. నిందితులు, కొనుగోలుదారులు కలిపి అయిదుగురిని అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని